WEF Statistics: వచ్చే ఐదేళ్లలో ఈ ఉద్యోగాలకు భారీ డిమాండ్! కానీ.. 83 మిలియన్ల జాబ్స్ హుష్
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఇప్పటికీ దాని దెబ్బ నుంచి పూర్తిగా కోలుకోలేక పలు సంస్థలు అవస్థలుపడుతూనే ఉన్నాయి. అలాగే కొత్త పుంతలకు తెర లేపింది. ఆటోమేషన్ రూపంలో ఉద్యోగాల తీరులో ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. వచ్చే ఐదేళ్ల పాటు..

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఇప్పటికీ దాని దెబ్బ నుంచి పూర్తిగా కోలుకోలేక పలు సంస్థలు అవస్థలుపడుతూనే ఉన్నాయి. అలాగే కొత్త పుంతలకు తెర లేపింది. ఆటోమేషన్ రూపంలో ఉద్యోగాల తీరులో ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. వచ్చే ఐదేళ్ల పాటు ఆ మార్పులు స్థిరంగా కొనసాగుతాయని ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2023 పేరిట వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేసిన రిపోర్టు తేల్చిచెప్పింది. మొత్తం నికర ఉద్యోగాల సృష్టిలో తగ్గుదల నమోదవుతుందని తేల్చి చెప్పింది. వచ్చే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 23 శాతం ఉద్యోగాల్లో మార్పులు తథ్యమని డబ్ల్యూఈఎఫ్ నివేదిక స్పష్టం చేసింది. 2023 నుంచి 2027 వరకు దాదాపు 6.9 కోట్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని పేర్కొంది. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో 8.3 కోట్లు (83 మిలియన్ల జాబ్స్) కనుమరుగవుతాయని తన నివేదికలో అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 803 కంపెనీల్లో నిర్వహించిన సర్వే ద్వారా ఈ విషయాలను వెల్లడించింది.
వచ్చే ఐదేళ్లలో వ్యాపారాల్లో మార్పులు పూర్తిగా నూతన సాంకేతికతల అమలుపైనే ఆధారపడి ఉంటుంది. పర్యావరణ, సాంకేతికత, ఆర్థికంగా వచ్చే కొత్త పోకడలే ఉద్యోగాల సృష్టి, కోతలను నిర్దేశిస్తాయని నివేదికలో వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో 75 శాతం కంపెనీలు బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోనున్నాయి. కొత్త సాంకేతికతల అమలు వల్ల వచ్చే ఐదేళ్లలో ఉద్యోగాల కల్పన మెరుగవుతుందని స్పష్టం చేసింది. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ నిపుణులకు రానున్న రోజుల్లో గిరాకీ మెండుగా ఉంటుంది. ఆ తర్వాత స్థానాల్లో సస్టయినబిలిటీ నిపుణులు, బిజినెస్ ఇంటెలిజెన్స్ విశ్లేషకులు, సమాచార భద్రత విశ్లేషకులు, పునరుత్పాదక ఇంధన ఇంజినీర్లు, సౌర ఇంధన స్థాపన, వ్యవస్థల ఇంజినీర్ల వంటి వారికి డిమాండ్ ఉంటుంది.
ఆటోమేషనే కారణంగా క్లర్కులు, సెక్రటోరియల్ విధుల్లో ఉన్నవారు, పోస్టల్ సేవల క్లర్కులు, క్యాషియర్లు, టికెట్ క్లర్కులు, డేటా ఎంట్రీ క్లర్కు ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోనున్నాయి. విద్య, వ్యవసాయం, డిజిటల్ కామర్స్, వాణిజ్య రంగాల్లో ఉద్యోగాల కల్పన గణనీయంగా ఉండనుంది. అదే సమయంలో సంప్రదాయ భద్రత, ఫ్యాక్టరీ, వాణిజ్య రంగాల్లో ఉద్యోగాలు తగ్గనున్నాయి.




మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.