ఏందిరా ఇది.. ఏడాదిలో రూ. 10 నుంచి రూ.101లకు.. లక్షకు 16 లక్షల లాభం.. ఈ మల్టీబ్యాగర్ జోరు ఆగేట్టు లేదుగా
Multibagger Share: ఈ మల్టీబ్యాగర్ షేరు ఆర్థిక పారామితులలో (Financial Metrics) అద్భుతమైన వృద్ధిని కనబరుస్తోంది. తన రంగంలోని సగటు ప్రదర్శన కంటే చాలా మెరుగ్గా రాణిస్తూ, 2025 సంవత్సరంలో పెట్టుబడిదారులకు కాసుల వర్షం కురిపించింది. 365 రోజుల్లో ఏకంగా 878 శాతం లాభాలను అందించింది.

Elitecon International Ltd: స్టాక్ మార్కెట్‌లో అప్పుడప్పుడు కొన్ని షేర్లు అంచనాలకు అందనంత వేగంగా దూసుకుపోతుంటాయి. ఎలీటకాన్ ఇంటర్నేషనల్ (Elitecon International Ltd) షేరు సరిగ్గా అదే చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ షేరు జెట్ స్పీడ్‌తో పరిగెడుతోంది. జనవరి 1, 2025న కేవలం రూ. 10.37 వద్ద ఉన్న ఈ షేరు ధర, ప్రస్తుతం రూ. 101 కి చేరుకుంది. దీని వేగాన్ని చూసి ఇన్వెస్టర్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ మల్టీబ్యాగర్ జోరు చూస్తుంటే ఇది ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు.
ఎలీటకాన్ ఇంటర్నేషనల్ ప్రధానంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులను తయారు చేస్తుంది. అయితే ఇప్పుడు ఇది ఎఫ్ఎమ్‌సిజి (FMCG) రంగంలోకి కూడా విస్తరిస్తోంది. గత నెలలోనే ఈ కంపెనీ రెండు వ్యవసాయ ఆధారిత (Agro-based) కంపెనీలలో మెజారిటీ వాటాను దక్కించుకుంది. తన వ్యాపారాన్ని విస్తరించుకోవడం, ఆదాయ మార్గాలను పెంచుకోవడమే ఈ కొనుగోలు ప్రధాన ఉద్దేశ్యం.
ఏడాదిలో 1536 శాతం రిటర్న్స్..
ఎలీటకాన్ ఇంటర్నేషనల్ షేరు ధర గత ఆరు నెలల్లో 175 శాతం పెరిగింది. 2025లో ఇప్పటివరకు ఈ షేరు 878 శాతం లాభాలను ఇచ్చింది. అదేవిధంగా గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 1536 శాతం రిటర్న్స్‌ను తన ఇన్వెస్టర్లకు అందించింది. ఉదాహరణకు, ఎవరైనా ఇన్వెస్టర్ ఏడాది క్రితం ఈ షేరులో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, నేడు దాని విలువ దాదాపు రూ. 16,29,032 అయ్యేది.
అన్ని పారామీటర్లలోనూ కంపెనీ టాప్..
Trendlyne గణాంకాల ప్రకారం, ఎలీటకాన్ ఇంటర్నేషనల్ తన రంగంలోని ఇతర కంపెనీల కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది:
మార్కెట్ క్యాప్: కంపెనీ మార్కెట్ విలువ రూ. 16,064.9 కోట్లకు చేరుకుంది.
రెవెన్యూ వృద్ధి: కంపెనీ ఆదాయంలో (YoY) 538% వృద్ధి నమోదైంది, ఇది ఇండస్ట్రీలోనే అత్యధికం.
నికర లాభం: నికర లాభం (Net Profit TTM) 205.7% వృద్ధితో సెెక్టార్‌లోనే అగ్రస్థానంలో ఉంది.
ROE (Return on Equity): కంపెనీ ROE 26.5% గా ఉంది, ఇది ఇన్వెస్టర్లకు మంచి లాభాలను ఇచ్చే సామర్థ్యాన్ని సూచిస్తుంది.
ప్రస్థావించదగ్గ నెగటివ్ పాయింట్: కంపెనీ ప్రైస్ టు బుక్ (Price to Book) రేషియో 132.3 గా ఉంది. ఇది చాలా ఎక్కువ, కాబట్టి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి.
సంస్థాగత పెట్టుబడులు: పెద్ద ఇన్వెస్టర్లు (Institutional Investors) ఈ కంపెనీలో 38.2% వాటాను కలిగి ఉండటం కంపెనీ భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తోంది.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం బ్రోకరేజ్ హౌస్‌ల సలహా, గణాంకాలపై ఆధారపడి ఉంది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు దయచేసి మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. నష్టాలకు టీవీ9 బాధ్యత వహించదు.)
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




