Property Rights: తండ్రి వీలునామా రాయకుండా మరణిస్తే.. ఆస్తిపై కూతురికి హక్కు ఉంటుందా..? చట్టం ఏం చెబుతుందంటే..?
భారత చట్టం ప్రకారం తండ్రి ఆస్తిలో కుమారుడితో పాటు కూతురికి కూడా సమాన వాటా ఉంటుందని మనందరికీ తెలిసిందే. అయితే తండ్రి వీలునామా రాయకుండా మరణిస్తే కూతురికి సమాన వాటా ఉంటుందా అనే అనుమానం చాలామందికి ఉంటుంది. ఈ వివేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

అన్నతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తి వివాదాలు జరగడం లాంటివి మనం తరచూ మన చుట్టుపక్కల లేదా వార్తల్లో చూస్తూ ఉంటాం. తండ్రి వాస్తి కోసం వారసులు లేదా వారసురాళ్ల మధ్య గొడవలు జరుగుతుంటాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసుల వరకు వెళుతూ ఉంటారు. భారతదేశంలో ఆస్తుల విషయంలో చట్టాలు స్పష్టంగా ఉన్నాయి. వారసత్వ ఆస్తులకు సంబంధించిన నిబంధనల పట్ల చాలామంది అవగాహన లేక కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అసలు భారత్‌లో వారసత్వ ఆస్తులపై నిబంధనలు ఏం చెబుతున్నాయి..? తండ్రి ఆస్తిలో కూతురుకు ఎలాంటి హక్కులు ఉంటాయి..? ఒక వ్యక్తి విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకుంటే మాజీ భార్యకు జన్మించినవారికి ఆస్తి లభిస్తుందా..? లాంటి అనేక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తండ్రి మరణిస్తే కూతురికి ఆస్తి లభిస్తుందా..?
కొంతమంది తాము బ్రతికుండానే వారసులకు తమ ఆస్తిని పంచి పెడతారు. లేదా తాము మరణించిన తర్వాత ఎవరెవరికి తన ఆస్తిలో ఎంత భాగం దక్కుతుందనేది బ్రతికుండానే వీలునామాలో పొందుపరుస్తారు. వీటి వల్ల ఎలాంటి ఆస్తి వివాదాలు అనేవి ఉండవు. కానీ ఇలాంటివి ముందే చేయకుండా తండ్రి మరణించినప్పుడు వారసుల మధ్య ఆస్తి తగాదాలు వస్తాయి. భారత హిందూ వారసత్వ చట్టాల ప్రకారం తండ్రి ఆస్తిలో కూతురుకు సమానమైన భాగం ఉంటుంది. కూతురికి పెళ్లి అయినా లేదా పెళ్లి కాకపోయినా తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. తండ్రి వీలునామా రాసినా, రాయకపోయినా కూతురికి చట్టబద్దంగా ఆస్తిలో కుమారుడితో సమానమైన వాటా పొందే హక్కు ఉంటుంది. పూర్వీకుల నుంచి లభించే ఆస్తిలో వారసులకు సమాన హక్కులు ఉంటాయి. అదే తండ్రి తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి అయి వీలునామాలో వేరే వ్యక్తి పేరు రాస్తే అలాంటి ఆస్తిలో కుమార్తెకు వాటా ఉండదు.
తండ్రి విడాకులు తీసుకుంటే..?
ఒక వ్యక్తి తన మొదటి భార్యతో విడాకులు తీసుకుని రెండో మహిళను పెళ్లి చేసుకున్నాడనుకుందాం. రెండో మహిళతో కూడా సంతానం కలిగిందనుకుందాం. ఇలాంటి సమయంలో మొదటి భార్య పిల్లలకు ఆస్తి దక్కుతుందా..? లేదా రెండో భార్యకు పుట్టిన పిల్లలకు లభిస్తుందా? అనే అనుమానం ఉంటుంది. చట్టాల ప్రకారం.. మొదటి భార్యకు జన్మించిన కుమారుడు లేదా కుమార్తెకు మాత్రమే తండ్రికి పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిపై హక్కు ఉంటుంది. భారత చట్టాల ప్రకారం తండ్రి వైవాహిక స్థితి ఆధారంగా కాకుండా రక్త సంబంధం ఆధారంగా ఆస్తులపై హక్కులు ఉంటాయి. ఇలాంటి విషయాలపై అవగాహన లేకుండా ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
