AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాన్‌వెజ్ ప్రియులకు బిగ్‌ అలర్ట్.. షాప్‌లో మటన్ కొంటున్నారా?.. ఆగండి.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!

కాసులకు కక్కుర్తిపడి కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. లైసెన్స్‌లు లేకుండానే షాప్‌లు నిర్వహిస్తున్న నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. తాజాగా ఇలాంటి వ్యాపారులపై అధికారులు కొరడా ఝులిపించారు. కుళ్లిన మాంసం విక్రయిస్తున్న ఓ మాంసం విక్రయ కేంద్రాన్ని సీజ్ చేశారు.

నాన్‌వెజ్ ప్రియులకు బిగ్‌ అలర్ట్.. షాప్‌లో మటన్ కొంటున్నారా?.. ఆగండి.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!
Tirupati Mutton Market Raid
Raju M P R
| Edited By: |

Updated on: Jun 17, 2026 | 12:12 PM

Share

టెంపుల్ సిటీ తిరుపతిలో భారీ మటన్ మాఫియా దందా వెలుగుచూసింది. కాసులకు కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొరడా ఝులిపించారు. నగరంలోని పిపి చావిడి మటన్ మార్కెట్‌లో మున్సిపల్ అధికారులు బుధవారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ లేకుండా, నిబంధనలను తుంగలో తొక్కి భారీ ఎత్తున కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సదరు మటన్ మార్కెట్‌ను అధికారులు తక్షణమే సీజ్ చేశారు.

ఫ్రీజర్లలో కుళ్లిన మాంసం.. 

పిపి చావిడి మటన్ మార్కెట్‌లో దాదాపు 30 దుకాణాలు ఉండగా, అందులో 15 షాపుల్లోని ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన మాంసం పూర్తిగా కుళ్లిపోయినట్లు తనిఖీల్లో తేలింది. దుర్వాసన వస్తున్న మేకలు, పొట్టేళ్లు, గొర్రెల తలలు, కాళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పారిశుధ్య సిబ్బంది సాయంతో ఆ కుళ్లిన మాంసాన్ని నగర వెలుపల ఉన్న డంపింగ్ యార్డుకు తరలించి, గోతులు తీసి పూడ్చిపెట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై మున్సిపల్ చట్టం కింద కేసులు నమోదు చేసి, మార్కెట్‌కు తాళాలు వేశారు.

పక్క రాష్ట్రాల నుండి అక్రమ రవాణా

ఈ దందా వెనుక పెద్దల అండదండలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల నుండి రైళ్ల ద్వారా మేకలు, గొర్రెల అవయవాలను, తలలను తిరుపతికి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం. ఇలా తెచ్చిన మాంసాన్ని రోజుల తరబడి ఫ్రీజర్లలో నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ సరఫరా వెనుక ఉన్న కింగ్ పిన్ ఎవరనే కోణంలో అధికార యంత్రాంగం ఆరా తీస్తోంది. నగరవ్యాప్తంగా ఉన్న 237 మటన్, చికెన్, ఫిష్ స్టాల్స్‌లో ఎక్కడా సరైన నిబంధనలు పాటించడం లేదని అధికారులు గుర్తించడం గమనార్హం.

భయాందోళనలో భక్తులు

నిత్యం వేలాది మంది యాత్రికులతో రద్దీగా ఉండే తిరుపతిలో ఇలాంటి నిల్వ ఉంచిన కుళ్లిన మాంసం దందా బయటపడటంతో మాంసం ప్రియులు, భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా ఇలాంటి కుళ్లిన మాంసంతోనే వంటకాలు చేస్తున్నారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ హెల్త్, ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుపడుతూ ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు సిపిఐ (CPI) శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న వ్యాపారులపై, తనిఖీలు చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, హోటళ్లపై తక్షణమే దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశాయి.

తప్పు ఒప్పుకున్న వ్యాపారులు

మరోవైపు, అధికారుల దాడులతో దిక్కుతోచని స్థితిలో పడ్డ మాంసం వ్యాపారులు తమ తప్పును అంగీకరించారు. కొన్ని తరాలుగా తాము ఈ వ్యాపారాన్ని నమ్ముకుని బతుకుతున్నామని, ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా సక్రమంగా వ్యాపారం చేసుకుంటామని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తమ ఉపాధిని దెబ్బతీయకుండా, బతుకులపై కనికరం చూపాలని అధికారులను వేడుకుంటున్నారు.

అధికారులు ఏం చెబుతున్నారో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us