Defence exports: మన ఆయుధాలకు ప్రపంచంలో యమ డిమాండ్.. పదేళ్లలో పదిరెట్లు పెరుగుదల
భారతదేశం అన్ని రంగాలలో క్రమంగా అభివృద్ధిని సాధిస్తోంది. వ్యవసాయం, పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో దూసుకుపోతుంది. ప్రజల అవసరాలకు తగిన విధంగా ఉత్పత్తి చేయడంతో పాటు విదేశాలకు ఎగుమతులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో మన రక్షణ ఎగుమతులు విపరీతంగా పెరిగాయి.
దాదాపు పదేళ్లలో రక్షణ రంగ ఎగుమతులు పది రెట్లు అభివృద్ధి సాధించాయి. మెరుగైన టెక్నాలజీతో తయారైన మన ఆయుధాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడింది. పదేళ్ల క్రితం రూ.2 వేల కోట్లుగా ఉన్న ఆయుధాల ఎగుమతులు ప్రస్తుతం రూ.21 వేల కోట్లకు చేరాయి. రక్షణ రంగానికి సంబంధించి గ్లోబల్ మ్యానుఫాక్చరింగ్ హబ్ గా మన దేశం మారుతోంది. పదేళ్లలో పెరిగిన ఎగుమతులే దీనికి నిదర్శనం. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా వెల్లడించారు. మధ్య ప్రదేశ్ లోని మోవ్ కంటోన్మెంట్ లోని ఆర్మీ వార్ కాలేజీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 2029 నాటికి రక్షణ ఎగుమతులను రూ.50 వేల కోట్లకు పెంచాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్టు తెలిపారు.
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ), ప్రాక్సీ వార్ ఫేర్, ఎలక్ట్రోమాగ్నేటిక్ వార్ ఫేర్, స్పేస్ వార్ ఫేర్, సైబర్ టాక్ లతో సాంప్రదాయేతర యుద్ద సాధనాలు నేడు రక్షణకు పెను సవాలుగా మారాయని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇలాంటి దాడులను అరికట్టేందుకు సైన్యం సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ సంబంధాల్లోనూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. రాబోయే రోజుల్లో కొందరు అధికారులు డిఫెన్స్ అటాచ్ లుగా పనిచేస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రపంచ స్థాయిలో జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడం వీరి ప్రథమ లక్ష్యమన్నారు. స్వావలంబన ద్వారా మాత్రమే మనం రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోగలమని, అప్పుడే ప్రపంచ వేదికపై మనకు మరింత గౌరవం లభిస్తుందన్నారు. భద్రతపై పూర్తి గా శ్రద్ధ చూపినప్పుడే ఆర్థిక పరిస్థితి బాగుంటుందని, ఆర్ధిక పరిస్థితి బాగున్నప్పుడే దేశ భద్రత పటిష్టంగా ఉంటుందన్నారు.
మన దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ రక్షణ సంస్థణ సంస్థలు సుమారు వంద దేశాలకు రక్షణ ఎగుమతులు చేస్తున్నాయి. వీటిలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి తదితర వాటితో పాటు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి, అర్జిలరీ గన్లు, డోర్నియల్ 228 ఎయిర్ క్రాప్ట్, రాడార్లు, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణులు, పినాకా రాకెట్లు ఉన్నాయి. ప్రపంచ పెద్దన్నగా భావించే అమెరికా కూడా మన దేశం నుంచి కొన్ని రక్షణ పరికరాలను దిగుమతి చేసుకుంటుంది. వీటిలో ఫ్యూజులేజ్, రెక్కలు, విమానాల విడి భాగాలు, బోయింగ్, హెలికాప్టర్ విడిభాగాలు ఉన్నాయి. ఆర్మేనియాకు ఫిరంగి తుపాకులు, ఆయుధాలను గుర్తించే రాడార్లు, క్షిపణులు, రాకెట్ వ్యవస్థలు, బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు, నైట్ విజన్ పరికరాలను మనం ఎగుమతి చేస్తున్నాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి