Cooking Oil: సామాన్యులకు శుభవార్త.. దిగిరానున్న వంట నూనె ధరలు.. ఎప్పటి నుంచి అంటే..!
Cooking Oil: ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అన్ని ధరలతో పాటు నిత్యవసర ధరలు కూడా ఆకాశన్నంటుతున్నాయి. ఇక వంట నూనె ధరలు మాత్రం విపరీతంగా..
Cooking Oil: ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అన్ని ధరలతో పాటు నిత్యవసర ధరలు కూడా ఆకాశన్నంటుతున్నాయి. ఇక వంట నూనె ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. వంట నూనె లేనిదే రోజు గడవని పరిస్థితుల్లో ధరలు పెరుగుతుండటంతో సామాన్యులకు భారంగా మారుతోంది. అయితే వంట నూనె ధరలు మరింతగా దిగిరానున్నాయని అంటున్నారు కేంద్ర ఫుడ్ సెక్రటరీ సుధాన్షు పాండే. గత ఏడాది నుంచి 20 – 50 శాతం మధ్య పెరిగిన వంటనూనె ధరలు త్వరలోనే తగ్గే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. డిసెంబర్ నుంచి వంట నూనెల ధరలు దిగిరావచ్చన్న సంకేతాలు ఇచ్చారు. కొత్త పంట మార్కెట్‌లోకి రావడం, అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్లు తగ్గే అంచనాలు ఉండటం ఇందుకు కారణంగా పేర్కొన్నారు. రాబోయే డిసెంబర్ నుంచి సోయాబీన్ ఆయిల్, పామాయిల్ ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం కనిపిస్తుంది అని ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు.
రాబోయే రోజుల్లో సోయాబీన్ పంట కోతకు వస్తుంది. ఆ నాలుగు నెలల తర్వాత రబీ ఆవాల పంట చేతికి వస్తుంది, కాబట్టి ధరలు నియంత్రణలో ఉండాలని ఆశిస్తున్నాను అని చెప్పారు. అలాగే, కొత్త పంటల రాక, అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్న ఆయిల్ ధరల ఇందుకు కారణమన్నారు. ప్రస్తుతం 60 శాతం ఆయిల్ భారత్ దిగుమతి చేసుకుంటుందని అన్నారు.
కాగా, అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగితే, అప్పుడు ఆ ప్రభావం ఇక్కడ పడుతుంది అని పాండే అన్నారు. గత సంవత్సర కాలంలో దేశంలో వంట నూనె ధరలు 64 శాతం పెరిగాయి. ఈ ధరల పెరుగుదలను అరికట్టడం కోసం మిషన్ ఆయిల్‌పామ్ పథకాన్ని చేపట్టింది. ఈ పథకం కింద వంట నూనెల తయారీలో కీలకమైన ఫామాయిల్ సాగును ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు మిషన్ ఆఫ్ ఆయిల్ ఫామ్‌ను ప్రకటించింది. ఆయిల్ ధరలు దిగివస్తే సామాన్యులకు ఎంతో ఊరట కలిగినట్లవుతుంది. కాగా, గత కొన్ని నెలలుగా వంట నూనె ధరలు పెరిగిపోవడంతో సామాన్యులకు ఇబ్బందిగా మారుతోంది. దాదాపు రూ.180 వరకు చేరిన నూనె ధరలు ఇటీవల కొంత మేర దిగి రావడంతో కొంత ఊరట కలిగించింది. లీటర్ ఆయిల్ కావాలంటే దాదాపు రూ.150 వరకు చెల్లించాల్సిందే. ఇప్పుడు మరింత దిగి రానున్నట్లు సంకేతాలు అందడంతో ఆనందం కలిగించే అంశమనే చెప్పాలి.