Food Irradiation: భారత్‌లోనే తొలిసారిగా.. ధరల హెచ్చుతగ్గుల నివారణకు ఇరేడియేషన్ పద్ధతి..
కూరగాయలు, పప్పుదినుసులు, ఇలా నిత్యవసర వస్తువుల ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో కూడా తెలియదు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం టమాట ధరలు ఠారెత్తిస్తున్నాయి. గతంలో ఉల్లిపాయల పరిస్థితి కూడా..

విజయవాడ, జులై 24: కూరగాయలు, పప్పుదినుసులు, ఇలా నిత్యవసర వస్తువుల ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో కూడా తెలియదు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం టమాట ధరలు ఠారెత్తిస్తున్నాయి. గతంలో ఉల్లిపాయల పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. అయితే కొన్ని నిత్యవసర వస్తువులను నిల్వ ఉంచితే తక్కువ రేటు ఉన్నప్పుడు కొనుగోలు చేసి చాలా రోజులు వినియోగించుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలను కూడా చాలాకాలం నిలువ ఉంచుకోవచ్చు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? కేంద్ర ప్రభుత్వం ఇరేడియేషన్ సాంకేతికతను తెరపైకి తీసుకువచ్చింది.
అసలు ఇరేడియేషన్ అంటే…
ఈ పద్ధతిలో ఆహారాన్ని రేడియేషన్ ఆయనీకరణానికి గురి చేస్తారు. ఇందుకోసం గామా కిరణాలు, ఎక్స్ కిరణాలు, ఎలక్ట్రాన్ కిరణాలను వినియోగిస్తారు. ఇదేవిధంగా ఉల్లిపాయలను కూడా గామా రేడియేషన్కు గురి చేయనున్నారు. దీని ప్రభావం వల్ల అందులోని సూక్ష్మజీవులు, కీటకాలు నశిస్తాయి. దీంతో ఉల్లిపాయల నిల్వ సామర్థ్యం క్రమంగా పెరుగుతుంది. ఈ ప్రక్రియ వల్ల రంగు, రుచీలో తేడా ఉంతుందని అపోహ అవసరం లేదు. ఎందుకంటే నాణ్యత, రుచి, ఆకృతి, ఇలా ఎలాంటి మార్పులు ఉండవు. సాధారణంగా ఉల్లిపాయలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయి కానీ అందులో సూక్ష్మజీవులు, కీటకాలు తొలగిపోతాయి.
సాధారణంగా ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, క్యారెట్ ఇటువంటి పదార్థాలు ఎక్కువ కాలం నిలువ ఉంచితే మొలకలు వస్తాయి. ఇరేడియేషన్ పద్ధతి వల్ల ఇలా మొలకలను సైతం రానివ్వదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సుమారు మూడు లక్షల టన్నుల సరుకును బఫర్ స్టాక్ గా సేకరించనుంది. ఆ తర్వాత శీతల గిడ్డంగికి తరలించడానికి ముందే వాటిని ప్రయోగాత్మకంగా ఇరేడియేషన్ కు గురిచేస్తుంది. దీనికోసం బాబా అణు పరిశోధన కేంద్రం సహాయం తీసుకుంది. అయితే ఇకపై ఉల్లిపాయల ధరలపై హెచ్చుతగ్గులను నివారించే రోజులు త్వరలో రాబోతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.