AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loans: ఒకేసారి 2, 3 లోన్స్ తీసుకోవచ్చా..? ఆర్బీఐ రూల్స్ గురించి తెలుసుకోండి..

చేతిలో డబ్బు లేనప్పుడు లోన్ తీసుకోవడం సహజం. అయితే ఇప్పటికే ఒక లోన్ వాడుతున్నప్పుడు, మళ్లీ పర్సనల్ లోన్ కోసం అప్లై చేయొచ్చా? ఒకవేళ చేస్తే బ్యాంకులు లోన్ ఇస్తాయా లేదా రిజెక్ట్ చేస్తాయా? ఆర్‌బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి? మీ లోన్ అప్రూవల్ కావాలంటే మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి? అనే విషయాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Loans: ఒకేసారి 2, 3 లోన్స్ తీసుకోవచ్చా..? ఆర్బీఐ రూల్స్ గురించి తెలుసుకోండి..
Can You Take Two Personal Loans At Once
Krishna S
|

Updated on: Apr 25, 2026 | 6:13 PM

Share

ప్రస్తుతం మనకు ఏ అవసరం వచ్చిన టక్కున గుర్తొచ్చేది లోన్. అత్యవసర సమయాల్లో లేదా ఇల్లు, కారు వంటివి కొనేటప్పుడు అందరూ ఆశ్రయించేది లోన్స్‌నే. అయితే ఇప్పటికే ఒక పర్సనల్ తీసుకున్నప్పుడు, మరో లోన్ తీసుకోవచ్చా? అది సాధ్యమేనా? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. దీనిపై ఆర్‌బీఐ నిబంధనలు, బ్యాంకుల పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒకేసారి ఎన్ని లోన్స్ తీసుకోవాలో అనే దానిపై ఎటువంటి కఠినమైన పరిమితులు లేవు. అంటే మీరు ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ రుణాలు పొందడానికి చట్టపరంగా ఎటువంటి అడ్డంకులు ఉండవు. అయితే కొత్త రుణం మంజూరు చేయాలా లేదా అనేది పూర్తిగా ఆయా బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీ రుణ సంస్థల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

బ్యాంకులు ప్రధానంగా తనిఖీ చేసే DTI నిష్పత్తి

మీకు కొత్త రుణం ఇవ్వాలా వద్దా అని నిర్ణయించేటప్పుడు బ్యాంకులు చూసే అత్యంత కీలకమైన అంశం Debt to Income Ratio. మీ నెలవారీ ఆదాయంలో ఎంత శాతం పాత అప్పుల వాయిదాలకు వెళ్తుందో తెలిపే లెక్క ఇది. సాధారణంగా మీ ఆదాయంలో 35 శాతం వరకు EMIలు ఉంటే అది సురక్షితం. మీ నెలవారీ జీతం రూ. 50,000 అనుకుందాం. మీరు ఇప్పటికే రూ.10,000 EMI చెల్లిస్తుంటే మీ DTI 20శాతం. ఇది తక్కువగా ఉంది కాబట్టి బ్యాంకులు మీకు మరో రుణం ఇవ్వడానికి మొగ్గు చూపుతాయి. ఒకవేళ EMIలు రూ. 25,000 దాటితే కొత్త రుణం రావడం కష్టమవుతుంది.

క్రెడిట్ స్కోర్: మీ ఆర్థిక వ్యక్తిత్వానికి అద్దం

పర్సనల్ లోన్లు సాధారణంగా ఎలాంటి హామీ లేకుండా ఇస్తారు. అందుకే బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్‌ను నిశితంగా పరిశీలిస్తాయి. 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ ఉంటే అది మంచి స్కోర్‌గా పరిగణిస్తాయి. గతంలో మీరు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించారా? మీ EMI చెల్లింపులలో ఎప్పుడైనా జాప్యం జరిగిందా? వంటి అంశాలు మీ స్కోర్‌ను ప్రభావితం చేస్తాయి. క్రమశిక్షణతో కూడిన చెల్లింపు చరిత్ర ఉంటే ఒకటి కంటే ఎక్కువ రుణాలు పొందడం సులభమవుతుంది.

ఎక్కువ అప్పులతో పొంచి ఉన్న ప్రమాదాలు

ఒకటి కంటే ఎక్కువ రుణాలు తీసుకోవడం వల్ల తక్షణ అవసరాలు తీరినప్పటికీ, అది దీర్ఘకాలంలో ఆర్థిక ఒత్తిడిని పెంచుతుంది.

నెలవారీ బడ్జెట్ తలకిందులు: EMIల సంఖ్య పెరిగేకొద్దీ, నిత్యావసర ఖర్చులకు డబ్బు తక్కువయ్యే అవకాశం ఉంది.

అప్పుల ఉచ్చు: ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి దిగజారవచ్చు.

క్రెడిట్ స్కోర్ పతనం: అనుకోని పరిస్థితుల్లో ఒక్క EMI మిస్ అయినా, క్రెడిట్ స్కోర్ దెబ్బతిని భవిష్యత్తులో రుణాలు పొందే అవకాశం కోల్పోతారు.

వివేకంతో నిర్ణయం తీసుకోండి

పర్సనల్ లోన్ తీసుకోవడం ఇప్పుడు చాలా సులభం కావచ్చు, కానీ దానిని తిరిగి చెల్లించే బాధ్యతను ముందుగానే అంచనా వేయాలి. మీ తిరిగి చెల్లించే సామర్థ్యం బాగుండి, అత్యవసర పరిస్థితి అయితేనే రెండో రుణానికి ప్రయత్నించండి. ఆశకు పోయి అప్పుల ఊబిలో పడకుండా, లాభనష్టాలను బేరీజు వేసుకుని అడుగు ముందుకు వేయడం మీ ఆర్థిక భవిష్యత్తుకు ముఖ్యం.

Follow Us