Aadhar card: ఆధార్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చా..? అసలు నిబంధనలు ఏంటంటే?
దేశంలో ఆధార్ కార్డుకు ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిందే. పుట్టిన పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాల్సిన అతి ముఖ్యమైన పత్రమిది. ప్రభుత్వం నుంచి పొందే లబ్ధితో పాటు అన్ని రకాల ఆర్థిక వ్యవహారాలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలుకు కీలకంగా ఉంటుంది.
దేశంలోని పౌరులందరికీ ప్రభుత్వం ఆధార్ కార్డును మంజూరు చేస్తుంది. ఈ కార్డులో పేరు, పుట్టిన తేదీ, చిరునామా తదితర వివరాలతో మనకు ఒక యూనిక్ నంబర్ ను కేటాయిస్తారు. ఆ నంబరే మీకు గుర్తింపుగా ఉపయోగపడుతుంది. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ప్రతి పనినీ ఆన్ లైన్ లో చాలా సులభంగా చేసుకోగలుగుతున్నాం. అలాగే ఆధార్ కార్డును ఆన్ లైన్ లో పొందే అవకాశం ఉందా, ప్రభుత్వం నిబంధనలు ఏమిటో తెలుసుకుందాం. మీరు ఇప్పటికే ఆధార్ కార్డును పొంది ఉంటే, దానిలో మార్పుచేర్పులను నిబంధనల ప్రకారం ఆన్ లైన్ లో చేసుకోవచ్చు. ముఖ్యంగా చిరునామా మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మొదటి సారిగా కార్డు కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడం కుదరదు. తప్పకుండా ఆధార్ కేంద్రాలను వెళ్లాల్సిందే. మీ ఇంటిలో కూర్చుని ఆన్ లైన్ దరఖాస్తు చేసుకుంటే తిరస్కరిస్తారు. ఒక్కసారి కార్డు పొందిన తర్వాత ఏమైనా మార్పులు ఉంటే మాత్రం ఆన్ లైన్ లో చేసుకునే అవకాశం ఉంది.
ఆధార్ కార్డు కోసం మొదటి సారిగా దరఖాస్తు చేసుకునేవారు ఈ కింద తెలిపిన విధానంలో చాలా సులువుగా ఆ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. దాని కోసం ఈ చిట్కాలను పాటించండి. కొత్త ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి. ఇవి దేశ వ్యాప్తంగా అనేకం అందుబాటులో ఉన్నాయి. వీటి చిరునామాను యూఐడీఐఏ వెబ్ సైట్ లో చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఆధార్ దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంది. దానిలో భాగంగా యుఐడీఐఏ వెబ్ సైట్ లో అపాయింట్ మెంట్ బుక్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎన్ రోల్ మెంట్ ప్రక్రియ వ్యక్తిగతంగానే జరిగినప్పటికీ, ఆధార్ కేంద్రానికి వచ్చినప్పుడు మీరు తగిన సమయం చూసుకుని రావచ్చు. అపాయింట్ మెంట్ స్లాట్ ను ముందుగానే బుక్ చేసుకోవచ్చు.
ఆధార్ నమోదు కేంద్రంలో సిబ్బంది అడిగిన వివిధ ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. చిరునామా రుజువు కోసం పాస్ పోర్టు, ఓటర్ ఐడీ, యూటిలిటీ బిల్లుల రశీదులు తదితర వాటిని అందజేయాలి. అలాగే మీ వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, ఫొటోతో సహా మీ బయోమెట్రిక్ డేాటా సేకరిస్తారు. నమోదు పూర్తయిన తర్వాత మీకు ఆధార్ నంబర్ కేటాయిస్తారు. దరఖాస్తులో మీరు తెలిపిన చిరునామాకు ఆధార్ కార్డును పోస్టులో పంపిస్తారు. అవసరమైతే ఇ–ఆధార్ ను డిజిటల్ వెర్షన్ లో కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పటికే ఆధార్ కార్డును కలిగి ఉంటే దానిలో వివరాల మార్పులను మాత్రం ఆన్ లైన్ లో చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ మార్పునకు సంబంధించి రుజువును మాత్రం తప్పకుండా అప్ లోడ్ చేయాలి. యూఐడీఐఏ పోర్టల్ ద్వారా చాలా సులభంగా ఆన్ లైన్ లో మార్పులు చేసుకోవచ్చు.