Gold price: బంగారం ధర వెంటనే తగ్గనుందా? బబుల్ ట్రెండ్ అంటే ఏంటి?
గడచిన కొన్ని వారాలుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు ప్రతిరోజు ఆల్ టైం రికార్డ్ స్థాయిని బద్దలు కొడుతూ ముందుకు వెళ్తున్నాయి. అయితే మధ్యలో కొన్ని చిన్న చిన్న తగ్గుదలలు కూడా మనం గమనించొచ్చు. అయితే మరి సడెన్ గా పెరిగిన ఈ ధరలు రాబోయే రోజుల్లో తగ్గుతాయా? ఇంకా పెరుగుతాయా? నిపుణులు ఏమంటున్నారు.

బంగారం ధర రోజురోజుకీ భారీగా పెరుగుతోంది. అక్టోబర్ 8వ తేదీకి 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,24,240 కు చేరుకుంది. అయితే ఇది ఉన్నట్టుండి వచ్చిన మార్పు అంటున్నారు నిపుణులు. దీన్ని బబుల్ ట్రెండ్ గా వర్ణిస్తున్నారు. అంటే పెరిగినట్టే పెరిగి మళ్లీ తగ్గొచ్చు అన్నమాట. అస్థిరమైన కారణాల వల్ల వేగంగా ధరలు పెరిగినప్పుడు మళ్లీ వెంటనే తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు కనిపిస్తున్న ట్రెండ్ ఇదే అంటున్నారు.
రికార్డు స్థాయిలో..
బంగారం ధర మొదటిసారిగా అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో పెరిగింది. ఒక ఔన్స్ (31.2 గ్రాములు) 4,000 డాలర్లు దాటింది. మళ్లీ దాన్ని క్రాస్ చేస్తూ.. 4,014 డాలర్ల వద్ద ఆల్ టైం రికార్డ్ స్థాయిని నమోదు చేసింది. అయితే ఈ పెరుగుదల కేవలం డాలర్ బలహీనపడడం, అమెరికా ఆర్థిక వ్యవస్థలోని అస్థిరత వల్ల మాత్రమే అంటున్నారు నిపుణులు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ఎక్కువమంది ఇన్వెస్టర్లు ఒకేసారి బంగారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఈ సడెన్ పెరుగుదల కనిపిస్తుంది అంటున్నారు.
ఏడాదిలో 50 శాతం
బంగారం ధర ఈ ఒక్క సంవత్సరంలో సుమారు 50 శాతం పెరిగింది. మరోపక్క అమెరికన్ డాలర్ వాల్యూ 10 శాతం తగ్గింది. డాలర్ బలహీనపడడం కారణంగానే బంగారం విలువ భారీగా పెరుగుతోంది. రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారంలోనే పెట్టుబడులు పెట్టడంతో బంగారం ధర రోజురోజుకీ పెరుగుతూ పోతోంది. అయితే ఒకవేళ అమెరికా ఎకానమీ కాస్త స్థిరపడితే ధరల పెరుగుదల తగ్గుముఖం పట్టొచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




