AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Gaurav Trains: భారత్ గౌరవ్ రైళ్లను నడిపేందుకై ఐఆర్‌సీటీసీ కీలక ఒప్పందం

భారతదేశం గొప్ప సంస్కృతి, సాంస్కృతిక వారసత్వాన్నిచాటి చెప్పేందుకై చారిత్రాత్మక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలను రైలు మార్గం ద్వారా అనుసంధానం చేసే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ భారత్ గౌరవ్ రైలు..

Bharat Gaurav Trains: భారత్ గౌరవ్ రైళ్లను నడిపేందుకై ఐఆర్‌సీటీసీ కీలక ఒప్పందం
Bharat Gaurav Trains
Subhash Goud
|

Updated on: Dec 15, 2022 | 7:20 PM

Share

భారతదేశం గొప్ప సంస్కృతి, సాంస్కృతిక వారసత్వాన్నిచాటి చెప్పేందుకై చారిత్రాత్మక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలను రైలు మార్గం ద్వారా అనుసంధానం చేసే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ భారత్ గౌరవ్ రైలు సర్వీస్‌ను ప్రారంభించింది. తద్వారా దక్షిణ మధ్య రైల్వే జోన్ అంతటా ఈ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబందించి దక్షిణ మధ్య రైల్వే సహకారంతో భారత్ గౌరవ్ రైళ్లను నడిపేందుకై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) మొదటి సర్వీస్ ప్రొవైడర్‌గా నమోదు చేసుకుంది.ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో భారత్ గౌరవ్ రైళ్లను నడిపేందుకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయమైన రైల్ నిలయంలో దీనికి సంబంధించి అధికారిక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జి.జాన్ ప్రసాద్, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఆర్.ధనంజయులు సమక్షంలో ఒక కోటి రూపాయల బ్యాంకు పూచికత్తును ఐఆర్‌సీటీసీ జీజీఎం నరసింగరావు అందజేశారు . పద్మజ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పాసెంజర్ సర్వీసెస్) దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ మేనేజర్ సత్యనారాయణ కుడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

దక్షిణ మధ్య రైల్వే వాణిజ్య విభాగం నిరంతరం కృషిచేసి భారత్ గౌరవ్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వేలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. తదనుగుణంగా భారత్ గౌరవ్ రైళ్ల ద్వారా జోన్‌లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే పర్యాటకులకు కలిగే ప్రయోజనాల గురించి దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివరించారు. అనేక చారిత్రక, పుణ్యక్షేత్రాలను ఒకేసారి సందర్శించాలనుకునే రైలు ప్రయాణికులకు భారత్ గౌరవ్ రైళ్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రైళ్లను నడపడం వల్ల ఐఆర్‌సీటీసీకి అలాగే రైల్వేలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలిపారు. ఇందులో భాగంగా ఐఆర్‌సీటీసీ అత్యంత ఆసక్తిని కనబరిచి దక్షిణ మధ్య రైల్వే నుండి భారత్ గౌరవ్ రైలు సర్వీస్‌లను నడపడానికి ముందుకు వచ్చింది.

ఐఆర్‌సీటీసీ ప్రారంభించనున్న భారత్ గౌరవ్ రైలు ప్రయాణికులకు భిన్న అనుభవాన్ని అందించడానికి ముందుగా నిర్దేశించుకున్న వివిధ పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఈ ప్రయాణం సాగుతుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా వివిధ తరగతులలో ప్రయాణం సాగించేందుకు సేవలు అందుబాటులో ఉండనున్నాయి. భారత్ గౌరవ్ యాత్రకు సంబంధించిన ఐఆర్‌సీటీసీ అన్ని వివరాలను త్వరలో ప్రకటించనుంది.

ఇవి కూడా చదవండి

అలాగే ఈ భారత్ గౌరవ్ పథకం కింద వ్యక్తిగతంగా, భాగస్వామ్య సంస్థ, కంపెనీ, సొసైటీ, ట్రస్ట్, జాయింట్ వెంచర్లు, పెట్టుబడులు పెట్టే వారు సర్వీస్ ప్రొవైడర్‌గా ఆన్‌లైన్‌లో  వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకొనే అవకాశాన్ని కల్పించింది. రిజిస్ట్రేషన్ అనంతరం కావాల్సిన బోగీలను కావాల్సిన రీతిలో పేర్కొంటూ ఆన్‌లైన్ డిమాండ్‌ను ఉంచవచ్చు. దీనితో పాటు రూ.కోటి రూపాయల బ్యాంక్ గ్యారెంటీని సమర్పించాల్సి ఉంటుంది. ఈ భారత్ గౌరవ్ పథకం పర్యాటక రంగంలో ఒక నూతన శకానికి నాందిపలకనుందని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సిహెచ్‌ రాకేష్‌ తెలిపారు.

ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ పథకం పర్యాటక రంగంలో ఒక గొప్ప మార్పును తీసుకువస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యాటక రైళ్లను నడపడానికి ఆసక్తి ఉన్న ఇతర ఆపరేటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని దక్షిణ మధ్య రైల్వే తో కలిసి నడవడానికి ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి