Car Prices Hike: మరోసారి ధరలు పెంచేందుకు సిద్ధమైన ఆటోమొబైల్ కంపెనీలు..!
క్రూడ్ ఆయిల్(Crude Oil) 100 డాలర్ల కంటే పైన ఎంతకాలం ఉంటుందో తెలియదు.. రష్యా ఉక్రెయిన్(Russia Ukrain War)లో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేదు. కానీ..
క్రూడ్ ఆయిల్(Crude Oil) 100 డాలర్ల కంటే పైన ఎంతకాలం ఉంటుందో తెలియదు.. రష్యా ఉక్రెయిన్(Russia Ukrain War)లో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేదు. కానీ త్వరలో వాహనాలు ధరలు పెరగబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కార్ల కంపెనీలు ధరల పెంచేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం లోహల ధర భారీగా పెరగడమే..1000 కిలోల బరువున్న కారును తయారు చేసేందుకు 700 కిలోల స్టీల్(Steel)ను వినియోగిస్తారు. గత రెండు నెలల్లో స్టీల్ ధరలు దాదాపు 35 శాతం పెరిగాయి. ఇది కాకుండా కారులో అల్యూమినియం, పల్లాడియం, రోడియం, ప్లాటినం, రబ్బరు, కాపర్ వంటి ఎన్నో లోహాలు ఉపయోగిస్తారు. వీటి ధర కూడా భారీగా పెరిగాయి. దీంతో తయారీ ఖర్చు పెరుగుతుందని ఆటోమొబైల్ కంపెనీలు చెబుతున్నాయి. అందుకే వాహనాల ధరలు పెంచాల్సిన అవసరం ఉందని వివరిస్తున్నాయి.
లోహల ధరలు రెండు నెలల్లో 25 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. ఇటు పెట్రోల్, డీజిల్ ధర త్వరలో పెరిగే అవకాశం ఉంది. ఈ రెండు ఆటో పరిశ్రమను ప్రభావితం చేస్తున్నాయి.. చేయనున్నాయి.. దీంతో వాహనాలకు డిమాండ్ తగ్గడంతో పాటు సరకు రవాణా కూడా భారం కానుంది. ఈ మధ్య కాలంలో కార్ల ధరలు ఒకటి రెండు సార్లు పెరిగాయి. జనవరిలో దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ ఖరీదైన ముడి పదార్థాల ధరలను కారణంగా చెప్పి ధరను 1.7 శాతం పెంచింది. అంతకు ముందు గత ఏడాది కాలంలో కార్ల ధరలు 5 శాతం పెరిగాయి. ఐదు నెలల క్రితం 2 లక్షల 99 వేల ఉన్న ఆల్టో కారు ఇప్పుడు 3.25 లక్షలుగా పెరిగింది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రభారం ఆటో రంగంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇదే కాకుండా సెమీ కండక్టర్ల కొరత కూడా కంపెనీలు వేధిస్తోంది. ఇటీవలి కాలంలోనే సెమీకండక్టర్ల సరఫరా మెరుగుపడిందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వింకేశ్ గులాటీ అన్నారు. ఆటో కంపెనీల నుంచి డీలర్లకు సరఫరా పెరిగిందని.. కానీ రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా, సెమీకండక్టర్ల సరఫరా మళ్లీ ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. FADA డేటా ప్రకారం ఫిబ్రవరి 2022లో వాహనాల మొత్తం రిటైల్ అమ్మకాలు గత సంవత్సరం కంటే 9.21 శాతం తక్కువగా ఉన్నాయి.