Bajaj chetak EV: ఆ ఈవీలకు గట్టిపోటీ తప్పదా..? మార్కెట్‌లోకి బజాజ్ స్కూటర్
బజాజ్ చేతక్ అంటే ఒకప్పుడు దేశాన్నే ఊపేసిన స్కూటర్. ఫ్యామిలీ ద్విచక్ర వాహనంగా ఎందరో అభిమానాన్ని పొందింది. అమ్మకాలలో రికార్డులు నెలకొల్పింది. ఈ స్కూటర్‌ను ఇష్టపడని వారు ఉండరనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. అంతలా ప్రజలకు దగ్గరైంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నేపథ్యంలో ఈ విభాగంలోకి బజాజ్ ప్రవేశించింది.
చేతక్ పేరుతో కొత్త స్కూటర్లను విడుదల చేసింది. తాజాగా చేతక్ 35 సిరీస్‌ను ఆవిష్కరించింది. దీనిలో భాగంగా మూడు కొత్త వేరియంట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటి ప్రత్యేకతలు, ధరలు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి. బజాజ్ చేతక్ 35 సిరీస్‌లో 3501, 3502, 3503 అనే మూడు రకాల వేరియంట్ల ఉన్నాయి. అదిరిపోయే క్లాసిక్ లుక్‌తో ఇవి ఆకట్టుకుంటున్నాయి. వీటిలో బేస్ స్పెక్ అయిన 3502 ట్రిమ్ రూ.1.20 లక్షలు, మిడ్ స్పెక్ అయిన 3501 ధర రూ.1.27 లక్షల నుంచి మొదలతున్నాయి. టాప్ స్పెక్ 3503 ధర వివరాలు వెల్లడికాలేదు. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు. కొత్త చేతక్ కొత్త వాహనం లుక్ పరంగా ఎంతో ఆకట్టుకుంటోంది. పొడిగించిన సీటు, విస్తృత ప్లోర్ బోర్డు వినియోగదారులకు బాగా ఉపయోగతాయి. 35 లీటర్ల అండర్ సీట్ స్టోరేజీ కెపాసిటీతో పాటు మెడల్ బాడీతో వస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం విశేషం.
బజాజ్ 35 సిరీస్ స్కూటర్‌లో 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. దీనికి 950 డబ్ల్యూ చార్జర్ మద్దతు లభిస్తుంది. కేవలం మూడు గంటల్లోనే దాదాపు 80 శాతం బ్యాటరీని చార్జి చేయగలదు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు 153 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. గంటకు 73 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే ఈ స్కూటర్ లో ఇంటిగ్రేడెట్ నామిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్, కాల్ హ్యాండ్లింగ్ సామర్థ్యం కలిగిన టచ్ స్క్రీన్ టీఎఫ్‌టీ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. ఇక జియో ఫెన్సింగ్, థెప్ట్ అలెక్ట్, యాక్సిడెంట్ డిటెక‌్షన్, ఓవర్ స్పీడ్ వార్నింగ్ తదితర ఫీచర్లు ఏర్పాటు చేశారు. ఈ స్కూటర్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కొనుగోలు చేసుకోవచ్చు.
ప్రస్తుతం మన దేశంలోని ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లో ఓలా, టీవీఎస్, ఏథర్ కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇవి విడుదల చేసిన ఎస్1, ఐక్యూబ్, రిజ్టా తదితర మోడళ్లు విక్రయాల్లో దూసుకుపోతున్నాయి. బజాజ్ నుంచి విడుదలైన 35 సిరీస్ స్కూటర్ వీటికి గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. కాగా.. 3501 వేరియంట్ డెలివరీని డిసెంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే 3502 వేరియంట్ మాత్రం 2025 జనవరి నుంచి రోడ్లపై పరుగులు తీయనుంది. బజాజ్ చేతక్‌కు దేశ వ్యాప్తంగా విస్తృతమైన నెట్ వర్క్ ఉంది. దీని ద్వారా తమ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తోంది. దేశంలోని 507 పట్టణాలలో 4వేల సేల్స్ టచ్ పాయింట్లు, 3800 సర్వీస్ వర్క్‌షాపులను కలిగి ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి