AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2021: బడ్జెట్‌పై కరోనా ఎఫెక్ట్.. పన్నుల భారం తప్పదా.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా మంత్రం పనిచేస్తుందా..?

కేంద్రం మరో వారం రోజుల్లో 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అయితే ఈ నెల 29నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 1న ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారమన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Budget 2021: బడ్జెట్‌పై కరోనా ఎఫెక్ట్.. పన్నుల భారం తప్పదా.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా మంత్రం పనిచేస్తుందా..?
Anil kumar poka
| Edited By: Ram Naramaneni|

Updated on: Jan 31, 2021 | 7:11 PM

Share

Budget 2021: కేంద్రం మరో వారం రోజుల్లో 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అయితే ఈ నెల 29నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 1న ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారమన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కరోనా కారణంగా అన్ని రంగాలు ఇప్పటికే అతలాకుతలమయ్యాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ అందరూ ఆర్థికంగా భారీ నష్టాలను చవిచూశారు. దీంతో ప్రభుత్వ ఆదాయం తగ్గగా.. ఖర్చులు భారీగా పెరిగాయి. అంతకుముందు ప్రభుత్వం ప్రకటించిన పథకాలు, ప్రస్తుతం ఫ్రీ కోవిడ్ వ్యాక్సిన్ లాంటివి ప్రభుత్వానికి అదనంగా భారం కానున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం భారీ సవాళ్లను ఎదుర్కొనుంది. దీనిలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు.. ఎలాంటి పన్నులు విధించనున్నారు, లేకపోతే కొత్తపన్నులను ప్రవేశపెడతారు అనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అత్యధిక ఆదాయ-పన్నుల స్లాబ్ కోసం తాత్కాలిక కోవిడ్ -19 పన్ను ప్రవేశపెట్టే అవకాశముందని సమాచారం. దీంతోపాటు సంపద పన్నును తిరిగి ప్రవేశపెడతారా..? లేక ఆర్థిక పునరుజ్జీవనం కోసం పన్ను స్థిరత్వాన్ని కొనసాగించడంపై నిర్మలా దృష్టి పెడతారా అనే అంశాలపై చర్చ నెలకొంది. అయితే మితమైన పన్ను రేట్లు, అధిక పన్నులు.. పన్ను-జీడీపీ నిష్పత్తిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం.

భారతదేశ ఆర్థిక పరిస్థితులను లోతుగా పరిశీలిస్తే.. మొదటి నుంచి మితమైన పన్నులు విధిస్తూ.. లక్ష్యాలను సాధించడంలో భారత ప్రభుత్వం విజయవంతమవుతూ వస్తోంది. ఉదాహరణకు 1971 లో వ్యక్తిగత పన్ను వ్యవస్థలో 12 రకాల పన్నులు (బ్రాకెట్స్) మాత్రమే ఉన్నాయి. పన్ను రేట్లు సున్నా నుంచి 85% వరకు ఉండగా.. సర్‌చార్జితో అత్యధిక పన్ను రేటు 93.5% గా ఉండేది. అయితే ఈ పన్నులను 1992-93లో గణనీయంగా సరళీకృతం చేశారు. కేవలం నాలుగు రకాల బ్రాకెట్లు మాత్రమే ఉంచుతూ.. గరిష్ట పన్ను రేటును 40% చేశారు. ఈ క్రమంలో 1997-98లో పి. చిదంబరం ‘డ్రీమ్ బడ్జెట్’ను ప్రవేశపెట్టారు. వ్యక్తిగత ఆదాయ-పన్ను రేటును 40% నుంచి 30% కు, కార్పొరేట్ ఆదాయ-పన్ను రేట్లను దేశీయ సంస్థలకు 40% నుంచి 35% కు తగ్గించారు. ఇదే విధివిధానాలు కొత్త గరిష్ట పన్ను రేట్లు నేటి వరకు కొనసాగుతునే ఉన్నాయి. ప్రస్తుతం అదనపు సర్‌చార్జీలతో కలిపి అత్యధిక పన్ను భారం ఇప్పుడు 42.7%గా ఉంది.

డ్రీమ్ బడ్జెట్ ప్రభావంతో పన్ను-జీడీపీ నిష్పత్తి బాగా పడిపోయింది. ఆ తరువాత ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవడంతో పన్ను-జీడీపీ నిష్పత్తి మెరుగుపడింది. 1997-98 బడ్జెట్ తరువాత వ్యక్తిగత పన్ను వసూళ్లు 6% మేర తగ్గాయి. ఆ తరువాత ఐదేళ్లలో (1999 నుంచి 2003 వరకు ) సగటు వ్యక్తిగత పన్ను-జీడీపీ నిష్పత్తి 1.4% కి పెరిగింది. అంతకుముందు ఐదేళ్లల్లో 1.2% (1993 నుంచి 1997 వరకు) ఉంది. దీంతోపాటు కార్పొరేట్ పన్ను వసూళ్లలో కూడా ఇదే విధమైన ప్రభావం కనిపించింది. ఐదేళ్లల్లో సగటున జీడీపీ నిష్పత్తి 1.4% నుంచి 1.6% కి పెరిగింది. 2000 నుంచి 2003 వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడంతో భారత జీడీపీ కూడా మందగించింది.

స్థిరత్వం.. పన్ను రేట్లలో క్రమంగా మార్పులు చేయడం వలన.. దీర్ఘకాలిక ప్రత్యక్ష పన్నుల ద్వారా జీడీపీ నిష్పత్తి పెరుగుదలకు కారణమైందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే భారత వృద్ధి రేటు కూడా గణనీయంగానే ఉంది. దేశంలో గత సంవత్సరం వరకు గరిష్ట పన్ను రేటు (సర్‌చార్జ్, సెస్‌తో కలిపి) 30% నుంచి 35.9% మధ్య ఉంది. 2020 ఫైనాన్స్ యాక్ట్ ద్వారా సర్‌చార్జ్ రేటు పెంపుతో గరిష్ట రేటు ప్రస్తుత స్థాయికి చేరుకుంది.

ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గొప్ప సంకల్పంతో ముందడుగు వేశారు. పన్ను వ్యవస్థను మరింత సరళతరం చేయడంతో పాటు నిజాయితీగా పన్నులు చెల్లించేవారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ‘ట్రాన్స్‌పరెంట్ ట్యాక్సేషన్ – హానరింగ్ ది హానెస్ట్’ అనే ప్రచారానికి 2020 ఆగస్టులో నాంది పలికారు. ఈ స్ఫూర్తితో సంక్షోభ సమయంలో కూడా పన్నులు వసూళ్లతోపాటు జీడీపీ పెరగడానికి ఆధారమైంది. దీంతోపాటు ప్రభుత్వం కూడా పలు చర్యలు తీసుకుంది. వీటి ఆధారంగా 2021 బడ్జెట్ రూపొందే అవకాశముందని పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో అధిక పరిపాలనా ఖర్చులు.. తక్కువ ఆదాయ వనరుల కారణాల వల్ల అంతకుముందు నిలిపివేసిన పన్నులను కొనసాగించే అవకాశముంది. దీంతోపాటు ప్రస్తుత పన్ను చెల్లింపుదారులపై అదనపు భారం లేదా సంపద పన్ను / ఎస్టేట్ డ్యూటీ వంటి కొత్త పన్నులు విధించే అవకాశముందని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక శాఖ మంత్రి ఎలాంటి మంత్రంతో ముందడుగు వేస్తారో.. ఎలాంటి కొత్త పన్నులు విధిస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. దీని గురించి మరింత క్లారిటీ రావాలంటే మరో వారం పాటు వేచిచూడాల్సిందే. Read Also: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. గడిచిన 24 గంటల్లో 6,18,399 కేసులు, 10,178 మరణాలు.. Read Also:ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం.. ఒక్క రోజులోనే 6,43,042 కేసులు, 9,669 మరణాలు..