మాస్కులు, భౌతికదూరం నిబంధనతో టెన్త్ ఎగ్జామ్స్
వీలైనంత త్వరలో ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల టైం టేబుల్ విడుదల చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. లాక్‌డౌన్ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్న వెంటనే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై కూడా తగిన నిర్ణయం తీసుకుంటామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
వీలైనంత త్వరలో ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల టైం టేబుల్ విడుదల చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. లాక్‌డౌన్ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్న వెంటనే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై కూడా తగిన నిర్ణయం తీసుకుంటామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
లాక్‌డౌన్ ముగిసిన తర్వాత రెండు వారాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని, దాదాపు రెండు వారాల పాటు ఈ పరీక్షలు కొనసాగే అవకాశం ఉందని మంత్రి అంటున్నారు. పదో తరగతి పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్‌ని త్వరలోనే విడుదల చేస్తామని ఆయన తెలిపారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ.. మాస్కులు ధరించడం ద్వారా పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యే అవకాశాలపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోందని మంత్రి సురేష్ వెల్లడించారు.
సాంకేతిక విద్యాశాఖ సహకారంతో విద్యా విధానంలో కొత్త మార్పులు తెచ్చామని, దాని వల్లే ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ సమయంలో పదవ తరగతి విద్యార్థులకు దూరదర్శన్ ద్వారా విద్యామృతం.. ఆల్ ఇండియా రేడియో ద్వారా విద్యాకలశం పేరుతో ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నామని మంత్రి వివరించారు.
సమగ్ర శిక్షా విధానంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 1,529 కోట్ల రూపాయలలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికే 923 కోట్లు వచ్చాయని మిగిలిన 606 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాకు తెలిపారు.