ముకేశ్ ఎగువకు…అనిల్ దిగువకు
భారత దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో 13వ స్థానానికి చేరుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఆరు స్థానాలు మెరుగుపర్చుకున్న ఆయన సంపద విలువ రూ.3.5 లక్షల కోట్లు (50 బిలియన్ డాలర్లు) కావడం విశేషం. ఫోర్బ్స్ 2019 సంపన్నుల జాబితా ప్రకారం.. 2018లో 40.1 బిలియన్ డాలర్లుగా ఉన్న ముకేశ్ అంబానీ సంపద ఏడాదిలో దాదాపు 10 బిలియన్ డాలర్లు పెరిగింది. అదే సమయంలో ముకేశ్ తమ్ముడు అనిల్ […]

భారత దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో 13వ స్థానానికి చేరుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఆరు స్థానాలు మెరుగుపర్చుకున్న ఆయన సంపద విలువ రూ.3.5 లక్షల కోట్లు (50 బిలియన్ డాలర్లు) కావడం విశేషం. ఫోర్బ్స్ 2019 సంపన్నుల జాబితా ప్రకారం.. 2018లో 40.1 బిలియన్ డాలర్లుగా ఉన్న ముకేశ్ అంబానీ సంపద ఏడాదిలో దాదాపు 10 బిలియన్ డాలర్లు పెరిగింది.
అదే సమయంలో ముకేశ్ తమ్ముడు అనిల్ అంబానీ ఫోర్బ్స్ జాబితాలో 1349వ స్థానానికి పడిపోయారు. ఆయన ఆస్తుల విలువ 1.8 బిలియన్ డాలర్లు. 2018లో అనిల్ 887వ స్థానంలో ఉన్నారు. ఏడాదిలో ఆయన ఆస్తులు దాదాపు 1 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి.
ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 131 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రెండో స్థానంలో ఉన్నారు. ఆయన సంపద విలువ 96.5 బిలియన్ డాలర్లు. గత ఏడాదితో పోలిస్తే బిల్ గేట్స్ సంపద 6.5 బిలియన్ డాలర్లు పెరిగింది. మూడో స్థానంలో వారెన్ బఫెట్ (82.5 బిలియన్ డాలర్లు) ఉన్నారు. ఆయన ఆస్తులు 1.5 బిలియన్ డాలర్లు తగ్గాయి. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ మూడు స్థానాలు పడిపోయి 8వ స్థానంలో ఉన్నారు. ఆయన నికర ఆస్తులు 62.3 బిలియన్ డాలర్లు.