చైనా దూకుడుకు కళ్లె వేసేందుకు భారత్ వ్యూహం !
సరిహద్దుల మధ్య ఉద్రిక్తల నివారణకు ఒకవైపు శాంతి చర్చలు, సైనిక ఉపసంహరణ అంటూనే దొంగ దెబ్బ తీసిన చైనా వైఖరి 20 మంది భారత సైనికుల ప్రాణాలు తీసింది. గాల్వన్ వ్యాలీ ఘటన నేపథ్యంలో చైనాతో ఎలాంటి వైఖరిని అనుసరించాలనే విషయంపై ప్రధానంగా వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొన్నినేపథ్యంలో రక్షణ, విదేశాంగ మంత్రిత్వశాఖల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లద్దాక్ సమీపంలో వాస్తవాధీన రేఖ గాల్వన్ వ్యాలీ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ప్రాణాంతక దాడుల నేపథ్యంలో దేశ రాజధానిలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణల్లో తెలంగాణ సూర్యాపేట్‌కు చెందిన కల్నల్ ర్యాంకు అధికారి బిక్కుమల్ల సంతోష్‌బాబు సహా 20 మంది జవాన్లు వీరమరణం పొందారు. చైనా సైనికులు 43 మంది మరణించారు. ఈ ఘటన తర్వాత చైనాతో అనుసరించాల్సిన వైఖరిపై రక్షణ, విదేశాంగ శాఖల అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల పరంపరలో మరో ముందడుగు పడింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో సమావేశం అయ్యారు.
ఈ సమావేశానికి త్రివిధ దళాధిపతులు జనరల్ మనోజ్ ముకుంద్ నరావణె (ఆర్మీ), అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ (నౌకాదళం), రాకేష్ కుమార్ బదౌరియా (వైమానిక దళం)లతో రాజ్‌నాథ్ సింగ్ సమావేశం అయ్యారు. చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఒకవంక వారితో చర్చిస్తూనే విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో రాజ్‌నాథ్ సింగ్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
సరిహద్దుల మధ్య ఉద్రిక్తల నివారణకు ఒకవైపు శాంతి చర్చలు, సైనిక ఉపసంహరణ అంటూనే దొంగ దెబ్బ తీసిన చైనా వైఖరి 20 మంది భారత సైనికుల ప్రాణాలు తీసింది. గాల్వన్ వ్యాలీ ఘటన నేపథ్యంలో చైనాతో ఎలాంటి వైఖరిని అనుసరించాలనే విషయంపై ప్రధానంగా వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. లఢక్ సెక్టార్ ఈశాన్య ప్రాంతం రెండు దేశాలకు రక్షణపరంగా అత్యంత వ్యూహాత్మకం, సున్నితమైన అంశం కావడం వల్ల అంతే సున్నితంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయం కేంద్ర ప్రభుత్వంలో వ్యక్తమౌతోంది. శాంతియుత వాతావరణం, చర్చల ద్వారా సరిహద్దు వివాదాలకు ముగింపు పలకాలని భావిస్తున్నప్పటికీ.. చైనా అనవసరంగా రెచ్చగొడుతోందనే అభిప్రాయం రక్షణ శాఖ అధికారుల్లో నెలకొంది.
ఎన్నిసార్లు అడ్డుకున్నా, పలుమార్లు వారించినా.. చైనా సైనికులు భారత భూభాగంపైకి చొచ్చుకుని వస్తూనే ఉన్నారని, పైగా వివాదాస్పద ప్రాంతంలో శాశ్వత కట్టడాలకు కూడా పాల్పడుతున్నారని అంటున్నారు. చైనా దూకుడును అడ్డుకోవడానికి శాశ్వత పరిస్కారాన్ని అన్వేషించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఆయా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రాజ్‌నాథ్ సింగ్..త్రివిధ దళాధినేతలతో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది.