AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రయాంట్ మాదిరిగానే ఎందరో.. వీరిదీ ప్రమాద మరణమే

పాడు హెలికాఫ్టర్‌ బాస్కెట్‌బాల్‌ లెజెండ్‌ కోబీ బ్రయాంట్‌ను పొట్టన పెట్టుకుంది.. అతనితో పాటు 13 ఏళ్ల కూతురు జియానాను కూడా బలితీసుకుంది.. ఈ దుర్ఘటన క్రీడాలోకాన్ని కలచివేసింది.. కన్నీరు కార్చేలా చేసింది… అభిమానులు తల్లడిల్లేలా చేసింది… బ్రయాంట్‌కు అర్ధాయుష్షును ఇచ్చిన విధిని తిట్టుకునేలా చేసింది… అతడు ఉంటే ఇంకెంత మంది బ్రయాంట్‌లను పుట్టించేవారో! ఇంకెందరు మైకెల్‌ జోర్డాన్‌లు బాస్కెట్‌బాల్‌ను ఏలేవారో… ఇంకెందరు మ్యాజిక్‌ జాన్సన్‌లు మ్యాజిక్‌ చేసేవారో…! కరీం అబ్దుల్‌ జబ్బార్‌… లీబ్రాన్‌ జేమ్స్‌… లారీ బర్డ్‌ […]

బ్రయాంట్ మాదిరిగానే ఎందరో.. వీరిదీ ప్రమాద మరణమే
Rajesh Sharma
| Edited By: |

Updated on: Sep 01, 2020 | 7:26 PM

Share

పాడు హెలికాఫ్టర్‌ బాస్కెట్‌బాల్‌ లెజెండ్‌ కోబీ బ్రయాంట్‌ను పొట్టన పెట్టుకుంది.. అతనితో పాటు 13 ఏళ్ల కూతురు జియానాను కూడా బలితీసుకుంది.. ఈ దుర్ఘటన క్రీడాలోకాన్ని కలచివేసింది.. కన్నీరు కార్చేలా చేసింది… అభిమానులు తల్లడిల్లేలా చేసింది… బ్రయాంట్‌కు అర్ధాయుష్షును ఇచ్చిన విధిని తిట్టుకునేలా చేసింది… అతడు ఉంటే ఇంకెంత మంది బ్రయాంట్‌లను పుట్టించేవారో! ఇంకెందరు మైకెల్‌ జోర్డాన్‌లు బాస్కెట్‌బాల్‌ను ఏలేవారో… ఇంకెందరు మ్యాజిక్‌ జాన్సన్‌లు మ్యాజిక్‌ చేసేవారో…! కరీం అబ్దుల్‌ జబ్బార్‌… లీబ్రాన్‌ జేమ్స్‌… లారీ బర్డ్‌ లాంటి గొప్ప గొప్ప బాస్కెట్‌బాల్‌ క్రీడాకారులను చూసేవారవేమో! ప్రతిభావంతులు పూర్ణాయుష్షుతో జీవించాలనుకుంటాం! వారి నీడలో మరింత మంది ప్రతిభావంతులు పుట్టుకురావాలని ఆశిస్తాం.. కానీ ప్రమాదాలు చెప్పిరావు.. బ్రయాంట్‌లాగే గతంలో చాలా మంది క్రీడాకారులు విమాన ప్రమాదంలో అర్ధాంతరంగా కన్నుమూశారు.. క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలోకి నెట్టారు..

‘మేము క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడేందుకు ఇట్నుంచి అటూ … అట్నుంచి ఇటూ ప్రయాణిస్తుంటాం.. ఒక్కోసారి బస్సులో వెళతాం.. కొన్నిసార్లు రైళ్లల్లో ట్రావెల్‌ చేస్తాం.. మరికొన్ని సార్లు విమానంలో వెళతాం.. ఎప్పుడో ఒకప్పుడు నేను ప్రయాణించే విమానం కూలిపోయి చనిపోతాను.. నేరుగా స్వర్గానికి వెళతాను.. ఈ మధ్య ఎందుకో అలా నాకు పదే పదే అనిపిస్తోంది…’ ఇవి సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ హాన్సీ క్రోనే తన మరణానికి కొన్నేళ్ల ముందు తన అన్నయ్య ఫ్రాన్స్‌తో అన్న మాటలు! అనుకున్నట్టుగానే జూన్‌ 1, 2002లో జరిగిన విమాన ప్రమాదంలో క్రోనే మరణించాడు.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ మరకను అంటించుకుని నిషేధానికి గురయ్యాడు కానీ.. ఆ మచ్చే లేకపోతే క్రోనే ఎంతో సాధించేవాడు.. ఎంతోమందికి తర్ఫీదు ఇచ్చేవాడు.. ఏదో అదృశ్యశక్తి తనతో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేయించిందనేవాడు క్రోనే… సౌతాఫ్రికాకు ఎన్నో విజయాలను అందించాడు.. సౌతాఫ్రికా టీమ్‌ను బలోపేతం చేశాడు.. గోల్డెన్‌బాయ్‌గా పేరు సంపాదించుకున్నాడు.. 90లలో సౌతాఫ్రికాలో పాపులర్‌ వ్యక్తిగా నిలిచాడు.. ఎంతగా అంటే అప్పటి దేశాధ్యక్షుడు నెల్సన్‌ మండేలా తర్వాత అంతటి పేరు సంపాదించుకునేంతగా! ఇప్పటికీ క్రోనే చాలామంది ఆటగాళ్లకు ఓ స్ఫూర్తి…

27 ఏప్రిల్‌, 1993

జాంబియాలో ఫుట్‌బాలే అత్యంత ప్రజాదరణ పొందిన ఆట! ఆ దేశ జట్టు సాధించిన విజయాలు అనిర్వచనీయాలు.. 1988లో సియోల్‌ ఒలింపిక్స్‌లో 4-0 గోల్స్‌ తేడాతో ఇటలీని ఓడించి సంచలనం సృష్టించింది… కలుష బ్వల్వాయా హ్యాట్రిక్‌ సాధించడం మరింత సంచలనం.. అదే గొప్ప జట్టు అనుకుంటే అంతకు మించిన జట్టు 1993లో కూడింది… అతిరథ మహారథులతో కూడిన ఆ జట్టు సెనెగల్‌ టీమ్‌తో ఫీఫా వరల్డ్‌కప్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ ఆడేందుకు బయలుదేరింది… జాంబియా ఎయిర్‌ఫోర్స్‌ ప్రత్యేకించి ఫుట్‌బాల్‌ టీమ్‌ కోసం ఏర్పాటు చేసిన ఫ్లయిట్‌లో ప్రయాణం… సమరోత్సాహంతో ఉన్న ఆ జట్టు వరల్డ్‌కప్‌ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది… కొందరు ఆటగాళ్లు వ్యూహాలు రచించుకుంటున్నారు.. కోచ్‌లేమో సలహాలు సూచనలు ఇస్తున్నారు.. ఇంతలో విమానంలో కదలికలు… ఒక్కసారిగా విమానం ఊగిపోసాగింది… పైలట్‌ చేసిన తప్పిదం ప్లేయర్ల కలలను ఛిద్రం చేసింది… లిబ్రేవిల్లేలో విమానం కుప్పకూలింది.. అందులో ప్రయాణిస్తున్న 22 మంది ఆటగాళ్లు కన్నుమూశారు… జట్టు కెప్టెన్‌, స్టార్‌ ప్లేయర్‌ కలుష బ్వల్వాయా యూరోపియర్‌ క్లబ్‌తో వేరే విమానంలో ప్రయాణిస్తుండటంతో బతికిపోయాడు.. ఇంతటి పెను విషాదాన్ని జాంబియా ఎప్పుడూ ఎదుర్కోలేదు… అందులోంచి బయటపడేందుకు చాలా కాలం పట్టింది… ఆ చేదు జ్ఞాపకాలను సమాధి చేసి కసికొద్దీ కొత్త జట్టును రూపొందించుకుంది.. చనిపోయిన ఆటగాళ్లకు నివాళిగా అత్యుత్తమ జట్టును తయారు చేసింది…

నవంబర్‌ 8, 1948

అవిభాజ్య చెకొస్లొవేకియాకు అది చీకటి రోజు… జాతీయ ఐస్‌ హాకీ జట్టులో సగానికి సగం మంది కనుమూసిన రోజు… బ్రిటన్‌లో ఎగ్జిబిషన్‌ టూర్‌ కోసం ఆరుగురు చెకోస్లోవేకియా ఐస్‌ హాకీ ఆటగాళ్లు ప్యారిస్‌కు చేరారు.. అక్కడ్నుంచి ఛార్టర్‌ ఫ్లయిట్‌లో లండన్‌కు బయలుదేరారు.. మిగతా ఎనిమిది మంది ఆటగాళ్లు వెంబ్లీలో ఓపెనింగ్‌ టూర్‌ మ్యాచ్‌ ఉండటంతో ఓ రోజు ముందే వెళ్లారు…ఆరుగురు ప్రయాణిస్తున్న విమానం ఇంగ్లీషు ఛానెల్‌లో కుప్పకూలింది… దాంతో పాటే ఆరుగురు ఆటగాళ్ల ఆకాంక్షలు కుప్పకూలాయి…చెకొస్లొవేకియాలో మేజర్‌ స్పోర్ట్స్‌ ఐస్‌ హాకీనే! ఇంటర్నేషనల్‌ ఈవెంట్స్‌లో ఎన్నో విజయాలను కూడా సాధించింది… ఎవడి దిష్టి తగిలిందో … టీమ్‌లోని సగం సభ్యులు అర్ధాంతరంగా దుర్మరణం పాలవ్వాల్సి వచ్చింది..

మే 4, 1949

ఇటలీలోని టొరినో ఫుట్‌బాల్‌ క్లబ్‌… టోరో అని అభిమానులు పిల్చుకునే ఈ జట్టు లీగ్‌లలో అసాధారణ విజయాలను సాధించింది… ఇందులోంచి జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నవారు చాలా మందే ఉన్నారు.. గ్రాండె టోరినో అని ముద్దుగా అభిమానులు పిల్చుకునే ఈ జట్టు లిస్బాన్‌లో ఎస్‌ఎల్‌ బెన్‌ఫికాతో ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడి ఇంటికి బయలుదేరింది… ఇందులో చాలామంది ఇటలీ జాతీయ జట్టులో స్థానం పొందినవారే ఉన్నారు.. 18 మంది ఆటగాళ్లు.. అయిదుగురు క్లబ్‌ అధికారులు సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు.. ల్యాండ్‌ అవుతున్న విమానం ఒక్కసారిగా అదుపుతప్పింది… ఆ వెంటనే కప్పకూలింది.. అందులో ప్రయాణిస్తున్నవారంతా నిమిషాల్లో చనిపోయారు… గుర్తుపట్టలేనంతంగా మృతదేహాలు ఛిద్రమయ్యాయి… ఇటలీ క్రీడా చరిత్రలో ఇంత పెద్ద దుర్ఘటన మరెప్పుడూ జరగలేదు.. జరగకూడదు కూడా!

జనవరి 5, 1950

క్రీడల్లో నాటి సోవియట్‌ యూనియన్‌ ఎదురులేకుండా ఉండేది… అన్ని క్రీడల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించేది.. మాస్కో మిలటరీ ఎయిర్‌ఫోర్స్‌లో కాకలు తీరిన క్రీడా యోధులు ఉండేవారు..మాస్కో మిలటరీ ఎయిర్‌ఫోర్స్‌కు ప్రత్యేకంగా స్పోర్ట్స్‌ టీమ్స్‌ ఉండేవి… అలాంటిదే ఐస్‌ హాకీ టీమ్‌ కూడా! పొరుగున ఓ మ్యాచ్‌ ఆడి సొంతూరికి బయల్దేరింది జట్టు… బలమైన గాలులు.. భయంకరమైన హిమపాతం విమానాన్ని కుప్పకూలుస్తాయన్నది ఆ క్షణం వారు తెలుసుకోలేకపోయారు.. మరికొద్దిసేపట్లో ల్యాండ్‌ అవుతుందన్న టైమ్‌లో విమానం కుప్పకూలింది.. అందులో ఉన్న 13మంది ఐస్‌ హాకీ క్రీడాకారులు దుర్మరణం చెందారు.

ఫిబ్రవరి 6, 1958

ఓల్డ్‌ట్రాఫర్డ్‌లోని మాంచెస్టర్‌ యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది.. ఇంగ్లాండ్‌లో మేటి జట్టుగా పేరు సంపాదించుకుంది… ఆ క్లబ్‌లో ఆడిన ఆటగాళ్లు కొందరు నేషనల్‌ టీమ్‌లోనూ చోటు సంపాదించుకున్నారు. పశ్చిమ జర్మనీలోని మ్యూనిచ్‌లో మ్యాచ్‌ ఆడేందుకు వెళ్లింది మాంచెస్టర్‌ యునైటెడ్‌ సాకర్‌ టీమ్‌… తిరుగు ప్రయాణం అయ్యింది… టేకాఫ్‌లోనే విమానం ప్రమాదానికి గురయ్యింది… అంతే.. ప్రయాణికుల్లో చాలా మంది మరణించారు… ఎనిమిది మంది ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు ..ముగ్గురు క్లబ్‌ ఉద్యోగులు స్పాట్‌లోనే చనిపోయారు.. బతికి బట్టకట్టిన ఇద్దరు ఆటగాళ్లు గాయాల కారణంగా ఫుట్‌బాల్‌కు స్వస్తి చెప్పారు..

ఆగస్టు 14, 1958

ఫెన్సింగ్‌ క్రీడ అందరికి అబ్బదు.. ఎంతో కష్టపడితే కానీ ఆ క్రీడలో రాటుదేరలేరు… ఒంటిచేత్తో కత్తులు తిప్పగలగడం కొందరికే సాధ్యం… ఇందులో ఈజిప్ట్‌ క్రీడాకారులు పట్టుసాధించారు… ఒలింపిక్స్‌లో ఓ పట్టుపట్టాలనుకున్నారు… ఫెన్సింగ్‌లో దేశానికి పతకం సాధించి పెట్టాలనుకున్నారు.. కానీ వారి ఆశలను విమాన ప్రమాదం కాల్చేసింది… ఆరుగురు ఆటగాళ్లు ప్రయాణిస్తున్న విమానం అట్లాంటిక్‌ సముద్రంలో కుప్పకూలింది… 99 ప్రయాణికులతో పాటు ఆరుగురు ఫెన్సింగ్‌ క్రీడాకారులు దుర్మరణం చెందారు.

ఫిబ్రవరి 15, 1961

ఫిగర్‌ స్కేటింగ్‌ అన్నది మంచులో ఆడే క్రీడ! ఒక్కరు ఆడొచ్చు.. ఇద్దరు కలిసి ఆడొచ్చు.. లేదా జట్టుగా బరిలో దిగొచ్చు… ఈ హిమక్రీడలో అమెరికా అప్పట్లో ముందుండేది… చాకుల్లాంటి ప్లేయర్లు టీమ్‌లో ఉండేవారు.. చెకొస్లొవేకియాలోని ప్రేగ్‌లో జరిగిన ప్రపంచ ఫిగర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు పాతికమందితో కూడిన ఫిగర్‌ స్కేటింగ్‌ టీమ్‌ విమానం ఎక్కింది.. బెల్జియం నుంచి చెకొస్లొవేకియా వెళ్లాలన్నది టూర్‌ ప్లాన్‌… గమ్యాన్ని చేరకముందే… అనుకున్న లక్ష్యాన్ని సాధించకముందే జట్టు అనంతలోకాలకు వెళ్లిపోయింది.. విమానం కుప్పకూలడంతో పాతికమంది క్రీడాకారులు కన్నుమూశారు.

ఫిబ్రవరి 6, 1965

చిలీలో ఫుట్‌బాల్‌కు విశేషమైన ఆదరణ ఉంటుంది… సాకర్‌ మ్యాచ్‌ అంటే చాలు పడిచచ్చిపోతారు.. ఆ దేశంలో చాలా ఫుట్‌బాల్‌ క్లబ్‌లున్నాయి… అలాంటివాటిల్లో అగ్రస్థానం అంటోనియో వరాస్‌ది! ఈ టీమ్‌ అర్జెంటీనాలో మ్యాచ్‌లు ఆడేందుకు బయలుదేరింది.. విమానం ఎక్కిన కొద్ది సేపటికే పైలట్‌ తప్పిదం కారణంగా విమానం కుప్పకూలింది.. అందులో ప్రయాణిస్తున్నవారెవ్వరూ మరణం నుంచి తప్పించుకోలేకపోయారు.. 22 మంది ఫుట్‌బాల్‌ క్రీడాకారులు కూడా అంతే!

నవంబర్‌ 14, 1970

అమెరికా వర్జీనియాలోని మార్షల్‌ యూనివర్సిటీ క్రీడలకు పెట్టింది పేరు.. ఫుట్‌బాల్‌లో అయితే మరింత గొప్ప పేరు ఉంది… క్యాంపస్‌ గేమ్స్‌లో మార్షల్‌ యూనివర్సిటీ ప్లేయర్లకు ఎదురుండేది కాదు… ఈస్ట్‌ కరొలినా యూనివర్సిటీలో జరిగిన క్యాంపస్‌ గేమ్స్‌లో పాల్గొని… విజయాలు సాధించి సొంతింటికి బయలుదేరింది ఫుట్‌బాల్‌ టీమ్‌… జట్టులోని 37 మంది ఆటగాళ్లు.. తొమ్మిది మంది కోచ్‌లు రిలాక్సవుతూ …కబుర్లు చెప్పుకుంటూ వచ్చే సీజన్‌లో ఎలా ఆడాలన్న దానిపై వ్యూహరచన చేసుకుంటున్నారు.. అంతలోనే విమానంలో కుదుపు… అందరిలోనూ టెన్షన్‌.. కొద్ది సేపటికే విమానం కుప్పకూలింది.. భావి ఆటగాళ్లు సంఘటన స్థలిలోనే మరణించారు… ఈ దుర్ఘటన అమెరికాను తీవ్రంగా బాధించింది.

అక్టోబర్‌ 6, 1976

క్యూబాలోనే పోరాటస్ఫూర్తి ఉంటుంది… అలాంటి దేశంలో క్రీడాకారులు ఓటమిని అంగీకరిస్తారా? అస్సలు అంగీకరించరు.. ముఖ్యంగా ఫెన్సింగ్‌ ప్లేయర్లు… కత్తులు పట్టుకుని సై అంటారు.. అప్పటికీ ఆ జట్టు అనేక అంతర్జాతీయ వేదికలపై జెండా ఎగరేసింది… బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో ఓ గేమ్‌ ఆడి తిరిగివస్తున్న క్యూబా ఫెన్సింగ్ టీమ్‌ను ఉగ్రవాదులు పెట్టిన ఓ బాంబు బలితీసుకుంది… క్యూబా అంటే అరికాలి మంట నెత్తికెత్తుకునే అమెరికానే అక్కసుతో ఈ బాంబు పెట్టిందనే వారు కూడా ఉన్నారు… అమెరికా పగపట్టిందో లేక విధి చిన్నచూపు చూసిందో తెలియదు కానీ క్యూబాకు చెందిన 24 మంది ఫెన్సింగ్‌ క్రీడాకారులు ప్రమాదంలో కన్నుమూశారు…

జులై 15, 2009

జూడో అంటేనే యుద్ధ క్రీడ… ఆ క్రీడలో అడుగుపెట్టిన ఇరాన్‌ యువకులు బంగారు కలలు కన్నారు.. జాతీయ యూత్‌ టీమ్‌లో చోటు సంపాదించుకున్నారు… ఏనాటికైనా నేషనల్‌ టీమ్‌లో ప్లేస్‌ సంపాదించుకుని దేశానికి గౌరవాన్ని తేవాలనుకున్నారు… విధి మాత్రం మరోలా ఆలోచించింది… విమాన ప్రమాదం జట్టులోని ఎనిమిది మంది ఆటగాళ్లను పొట్టన పెట్టుకుంది…

సెప్టెంబర్‌ 7, 2011

లోకోమోటివ్‌ యారోస్లావి… రష్యాలోని మేజర్‌ ఐస్‌ హాకీ టీమ్‌… ఎన్నో విజయాలను చవి చూసిన టీమ్‌… ఈ టీమ్‌లోని 37 మంది ఆటగాళ్లను విమాన ప్రమాదం బలి తీసుకుంది… ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రగాయాలతో హాస్పిటల్‌లో చనిపోయాడు..

నవంబర్‌ 28, 2016

బ్రెజిల్‌లో ఫుట్‌బాల్‌ క్లబ్‌ టీమ్‌లు చాలానే ఉన్నా చాపెకొన్స్‌కు ఉన్న ప్రత్యేకత వేరు.. ఈ టీమ్‌ కొలంబియాలో టోర్నమెంట్‌ ఆడేందుకు వెళ్లింది.. టీమ్‌లోని 19 మంది ప్లేయర్లతో పాటు 14 మంది క్లబ్‌ స్టాఫ్‌ సభ్యులు.. తొమ్మిది మంది బోర్డు మెంబర్లు.. నలుగురు జర్నలిస్టులు విమానంలో ఉన్నారు.. కోపా సూడామెరికనా ఫైనల్స్ మ్యాచ్‌ కోసం అని బయలుదేరారు.. మధ్యలోనే మెడ్లిన్‌ దగ్గర విమానం కుప్పకూలింది…విమానంలో ఉన్నవారందరూ చనిపోయారు… బ్రెజిల్‌ ఇప్పటికీ ఆ విషాదాన్నుంచి తేరుకోలేకపోతున్నది.

– బాలసుబ్రహ్మణ్యం (బాలు) సీనియర్ జర్నలిస్టు, టీవీ9