AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌తోనే అసలు సమస్య.. కేసీఆర్ తాజా ఆదేశాలివే

హైదరాబాద్ నగరంలో కరోనా ప్రభావం ఎక్కువగా వున్నందున రాజధానిపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని ఆదేశించారు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు. నగరాన్ని జోన్ల వారీగా విభజించి, ఒక్కో జోన్‌ను ఒక్కో యూనిట్ పరిగణిస్తూ ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని కేసీఆర్ నిర్దేశించారు. పాజిటివ్ కేసులు నమోదైన కంటైన్మెంట్ జోన్లలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. తెలంగాణలో కరోనా ప్రభావంపై ముఖ్యమంత్రి సోమవారం తాజాగా సర్వే నిర్వహించారు. ఏఏ చోట్ల కరోనా […]

హైదరాబాద్‌తోనే అసలు సమస్య.. కేసీఆర్ తాజా ఆదేశాలివే
Rajesh Sharma
| Edited By: |

Updated on: Apr 13, 2020 | 6:28 PM

Share

హైదరాబాద్ నగరంలో కరోనా ప్రభావం ఎక్కువగా వున్నందున రాజధానిపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని ఆదేశించారు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు. నగరాన్ని జోన్ల వారీగా విభజించి, ఒక్కో జోన్‌ను ఒక్కో యూనిట్ పరిగణిస్తూ ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని కేసీఆర్ నిర్దేశించారు. పాజిటివ్ కేసులు నమోదైన కంటైన్మెంట్ జోన్లలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

తెలంగాణలో కరోనా ప్రభావంపై ముఖ్యమంత్రి సోమవారం తాజాగా సర్వే నిర్వహించారు. ఏఏ చోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి అధికారులతో ఆరా తీశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారిలో జిహెచ్ఎంసి పరిధిలోని వారే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నందున హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వైద్యశాఖ అన్ని విధాలా సర్వసన్నద్ధంగా ఉండాలని కోరారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు, ఇతర జిల్లాల్లో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ప్రయత్నాలను, లాక్ డౌన్ అమలును, ధాన్యం కొనుగోళ్ల వ్యవహారాలను సిఎం సమీక్షించారు. కొందరు జిల్లా అధికారులతో నేరుగా మాట్లాడి పలు సూచనలు చేశారు. ‘‘గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ వచ్చిన వారి ద్వారా ఇతరులకు తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా హైదరాబాద్‌లో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ విషయంలో ప్రత్యేక వ్యూహం అనుసరించాలి. నగరంలోని మొత్తం 17 సర్కిళ్లను 17 యూనిట్లుగా విభజించాలి. ప్రతీ యూనిట్ కు ప్రత్యేకంగా వైద్యాధికారిని, పోలీసు అధికారిని, మున్సిపల్ అధికారిని, రెవెన్యూ అధికారిని నియమించాలి. మున్సిపల్ యంత్రాంగమంతా కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో నిమగ్నం కావాలి. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికంతా ఒక్కో డిఎం అండ్ హెచ్ఓ ఉన్నారు. 17 సర్కిళ్లకు వేర్వేరుగా సీనియర్ వైద్యాధికారిని నియమించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘పాజిటివ్ కేసుల ఆధారంగా రాష్ట్రం మొత్తం 246 కంటైన్మెంటులు ఏర్పాటు చేశాం. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 126 కంటైన్మెంటులున్నాయి. వీటిని మరింత పకడ్బందీగా నిర్వహించాలి. ఈ కంటైన్మెంట్లలోని ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానీయవద్దు. బయట వారిని లోపటికి పోనీయవద్దు. ప్రతీ కంటైన్మెంటుకు ప్రత్యేక పోలీసు అధికారిని, నోడల్ అధికారిని నియమించాలి. వారి ఆధ్వర్యంలో అత్యంత కఠినంగా నియంత్రణ చేయాలి. ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులను ప్రభుత్వ యంత్రాంగమే అందించాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.

అత్యధిక జనసమ్మర్థం ఉండే జిహెచ్ఎంసిలో పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండడాన్ని అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించాలని ముఖ్యమంత్రి అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి,ఇతర సీనియర్ అధికారులు ప్రతీ రోజు ఉదయం ప్రగతి భవన్ లోనే జిహెచ్ఎంసిలోని సర్కిళ్ల వారీగీ ప్రత్యేక సమీక్ష జరపాలని, పరిస్థితికి తగ్గట్టు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఇండ్ల నుంచి బయటకు రావద్దని ముఖ్యమంత్రి మరోసారి విజ్ఞప్తి చేశారు.