రాజధాని తరలింపు నిరవధిక వాయిదా.. కోర్టులో ఏజీ చెప్పేశారు!

ఏపీ రాజధాని తరలింపుపై ఆందోళన చేస్తున్న అమరావతి ఏరియా రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం. అది కూడా ఏకంగా హైకోర్టుకు తెలిపిన అఫిడవిట్‌లో ఈ గుడ్ న్యూస్‌ని పేర్కొంది.

  • Rajesh Sharma
  • Publish Date - 2:37 pm, Fri, 24 April 20
రాజధాని తరలింపు నిరవధిక వాయిదా.. కోర్టులో ఏజీ చెప్పేశారు!

ఏపీ రాజధాని తరలింపుపై ఆందోళన చేస్తున్న అమరావతి ఏరియా రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం. అది కూడా ఏకంగా హైకోర్టుకు తెలిపిన అఫిడవిట్‌లో ఈ గుడ్ న్యూస్‌ని పేర్కొంది. రాజధాని తరలింపుపై హైకోర్టులో తాజా గుడ్ న్యూస్ మేరకు ప్రమాణ పత్రాన్ని కూడా దాఖలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. వారం రోజుల్లో ప్రమాణపత్రం కోర్టుకు సమర్పిస్తామని అడ్వకేట్ జనరల్ మాటిచ్చారు.

ఒకవైపు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వం రాజధాని తరలింపును కూడా సమాంతరంగా ముందుకు తీసుకువెళుతుందన్న ఆరోపణలకు సర్కార్ తెరదించింది. రాజధాని తరలింపు అంశంపై అడుగులు ముందుకు పడడం లేదని తెలిపింది. రాజధాని తరలింపుపై అమరావతి పరిరక్షణ జేఏసీ దాఖలు చేసిన పిల్‌ను ఏపీ హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారించింది.

రాజధాని వికేంద్రీకరణకు ఉద్దేశించిన బిల్లులు శాసన వ్యవస్థలో పాస్ అవకుండా రాజధాని తరలింపు ప్రక్రియ చేపట్టబోమని హైకోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్. అయితే, ఈ విషయం నోటి మాటగా కాకుండా ప్రమాణ పత్రం రూపంలో దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దాంతో ప్రమాణ పత్రం దాఖలుకు పది రోజులు సమయం కావాలని ఏజీ కోరారు. ఈ మేరకు హైకోర్టు 10 రోజులు గడువు ఇస్తూనే.. ఈ పది రోజుల్లో ఎటువంటి చర్యలు చేపట్టినా హైకోర్టుకు తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది.

పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై 10 రోజుల్లో కేంద్రం కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కార్యనిర్వాహక రాజధానిని.. అమరావతి నుంచి విశాఖపట్నం తరలించేందుకు ప్రయత్నం చేస్తోందని పిటిషనర్ ఆరోపించారు. ఇటీవల జరిగిన సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో మే ఆఖరు నాటికి రాజధానిని తరలించడానికి ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోందని మినిట్స్‌లో పేర్కొన్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు పిటిషనర్.

రాజధాని తరలింపు నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులకు అనేక రకాలైన ప్రయోజనాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందని మినిట్స్‌లో పేర్కొన్నారని, వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఇటీవల విశాఖకు రాజధానిని తరలించడాన్ని ఎవరూ ఆపలేరంటూ కామెంట్ చేశారని పిటిషనర్ కోర్టుకు వివరించారు. అయితే.. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ధర్మాసనం వివరణ కోరింది.