కరోనా ఎఫెక్ట్ః తిరుపతి వెళ్లేవారికి అలర్ట్.. మరోసారి ఆంక్షలు విధించిన అధికారులు.. వారికి మాత్రమే అనుమతి!
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. చైనా నుంచి దాపురించిన మహమ్మారి ఇంకా వదలడం లేదు.
strict rules at Tirupati: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. చైనా నుంచి దాపురించిన మహమ్మారి ఇంకా వదలడం లేదు. మధ్యలో కరోనా కేసులు కాస్త తగ్గడంతో… మనం మళ్లీ పాత అలవాట్లకు మారిపోయాం. మళ్లీ ఇప్పుడు కరోనా మరింత జోరుగా సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోంది. అటు ఏపీలోని చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో కరోనాను కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు మంగళవారం నుంచి సంపూర్ణ ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆంక్షలు విధించింది. శ్రీవారి దర్శనం టికెట్లు ఉన్నవారికే తిరుమలకు అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. నడకదారి భక్తులకు ముందు రోజు ఉదయం 9గంటల నుంచి అనుమతి ఉంటుందని తెలిపారు. అలాగే, వాహనాల్లో వచ్చేవారికి ముందు రోజు మధ్యాహ్నం 1గంట నుంచి మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఇక, పాజిటివ్ కేసుల సంఖ్యను బట్టి లాక్‌డౌన్ తరహా ఆంక్షలను కుదించాలా, మరి కొద్ది రోజులు ఆంక్షలు పొడిగించాలా అన్న నిర్ణయం తీసుకుంటామన్నారు.
మరోవైపు, చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ తీవ్రత అధికమవుతున్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కలెక్టర్ కోరారు. ప్రతీ ఒక్కరూ విధిగా నిబంధనలను పాటించి సహకరించాలని పోలీసులు తెలిపారు.