Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR Farmers: రైతులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్‌.. ఈసారి కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు ప్రకటన..

KCR Good News To Farmers: తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రాడు శుభవార్త చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని గ్రామాల్లో 6,408 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు..

CM KCR Farmers: రైతులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్‌.. ఈసారి కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు ప్రకటన..
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 29, 2021 | 7:31 PM

KCR Good News To Farmers: తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రాడు శుభవార్త చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని గ్రామాల్లో 6,408 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాల దృష్ట్యా గత ఏడాదిలాగే గ్రామాల్లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం స్పష్టం చేశారు. సోమవారం ప్రగతి భవన్‌లో వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు అవసరమైన 20,000 కోట్ల రూపాయలకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చే ఏర్పాట్లను మంగళవారం సాయంత్రానికల్లా పూర్తి చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల తక్షణ ఏర్పాటు కోసం అన్ని జిల్లాల కలెక్టర్లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. హైదరాబాద్‌లోనే ఉండి కొనుగోలు కేంద్రాల ఏర్పాటును, ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని సీఎం ఆదేశించారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలను సమన్వయం చేసుకుంటూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రిని, సీఎస్ ను, అధికారులను సీఎం ఆదేశించారు. మొత్తం 6,408 కొనుగోలు కేంద్రాల్లో 2,131 ఐకేపీ కేంద్రాలు, 3,964 పీ.ఏ.సీ.ఎస్. కేంద్రాలు, మిగతావి మరో 313 కేంద్రాలున్నాయని వివరించారు.

కనీస మద్దతు ధర..

రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే విషయంలో కనీస మద్దతు ధర నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ముఖ్యమంత్రి కోరారు. వడ్లు ఎండబోసి తాలు లేకుండా 17శాతం తేమకు మించకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు. తేమ ఎక్కువగా లేకుండా చూసుకోవాలని, కనీస మద్దతు ధర పొందేందుకు అనుసరించాల్సిన నిబంధనలను పాటించాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన 20 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు.

పత్తిపై ప్రత్యేక దృష్టి..

తెలంగాణ రాష్ట్రంలో పండే పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, పత్తి మంచి నాణ్యత ఉండటంతోపాటు ఎక్కువ దిగుబడి వచ్చి అధిక ధర లభించే అవకాశం ఉన్నందున, వచ్చే వానాకాలం 75 నుంచి 80 లక్షల ఎకరాల్లో పత్తి పండించడానికి సిద్ధం కావాలని సీఎం రైతులను కోరారు. ఇందుకు అవసరమైన విత్తనాల కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని సీఎం వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జనార్ధన్ రెడ్డిని ఆదేశించారు.

కంది సాగు కోసం చర్యలు..

ఇక కంది సాగుపై మాట్లాడిన సీఎం.. 20 నుంచి 25 లక్షల ఎకరాల్లో కందిపంట సాగు కోసం చర్యలు చేపట్టాలని సూచించారు. పత్తి, కంది పంటలకు నీళ్ల తడులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుందని తెలిపారు. ఈ యాసంగిలో 52.76 లక్షల ఎకరాల్లో వరి పంట పండిందని, దాదాపు 1 కోటి 17 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, 21 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని సీఎం వివరించారు. ఆహార ధాన్యాల నిల్వల కోసం అదనపు గోదాములను నిర్మించేందుకు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సిద్ధంగా ఉన్నందున కార్పొరేషన్‌కు లీజుకు ఇవ్వడానికి స్థలాలను ఎంపిక చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు.

ఈ సమావేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: ఆదిలాబాద్ రిమ్స్‌లో బాలింతల వార్డులోకి దూసుకొచ్చిన నాగుపాము.. ముప్పుతిప్పలు.. చివరకు

Personal Loan Proposal: మీ పర్సనల్ లోన్ ప్రతిపాదన తిరస్కరించబడిందా? దీనికి ఇవే ప్రధాన కారణాలు కావచ్చు…!

Hyderabad Water Supply: ఏప్రిల్ 1న నగరంలో ప‌లుచోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం.. పూర్తి వివరాలు