తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సందడి.. నామినేషన్లు దాఖలు చేసిన ప్రధాన పార్టీలు.. సందడిగా మారిన నెల్లూరు కలెక్టరేట్
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం దాదాపు ముగిసింది. ఇవాళ ఒక్కరోజే నాలుగు ముఖ్య పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం దాదాపు ముగిసింది. ఇవాళ ఒక్కరోజే నాలుగు ముఖ్య పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలన్నీ నామినేషన్లు వెయ్యడంతో ఆ హడావుడి ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మిగిలింది ప్రచార పర్వం. కాగా, గెలుపు తమదేనన్న ధీమాతో అన్ని పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఇప్పటికే తిరుపతి నియోజకవర్గం ప్రచారాలతో హోరెత్తుతుంది.
ఇక, ఒక్కరోజే నాలుగు పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయడానికి రావడంతో నెల్లూరు కలెక్టరేట్ కోలాహలంగా మారింది. నామినేషన్ కార్యక్రమాన్ని వైసీపీ బలప్రదర్శనలా నిర్వహించింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి, సూళ్లూరుపేట, సర్వేపల్లి, గూడూరు ఎమ్మెల్యేలు, ప్రతి ఇంచార్జ్ మంత్రులు, ఎన్నికల ఇంచార్జ్‌లు, వివిధ పార్టీల నేతల రాకతో నెల్లూరు కలెక్టరేట్ కిటకిటలాడింది.
తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని బరిలోకి దిగుతున్నాయి. తిరుపతి బైపోల్ నామినేషన్ల ఘట్టం ప్రధాన పార్టీల్లో జోష్ పెంచింది. హోలి పండుగ రోజు… అభ్యర్థుల నామినేషన్లతో నెల్లూరులో సందడిగా మారింది. వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి నామినేషన్‌కు అధికారపార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఏడుగురు మంత్రులు, 10 మందికిపైగా ఎమ్మెల్యేలతో… కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లిన గురుమూర్తి నామినేషన్ వేశారు. తమ అభ్యర్థి గురుమూర్తి పేదకుటుంబం నుంచి వచ్చారని, ఇతర పార్టీల అభ్యర్థులు మాజీ కేంద్రమంత్రులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు మద్దతుగా నిలుస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యర్థులు ఎవరైనా వైసీపీ అభ్యర్థికి బంపర్ మెజారిటీ ఖాయమంటున్నారు ఏపీ మంత్రులు.
ఇక, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభ పేరును ఖారారు చేసింది అధిష్టానం. దీంతో ఇవాళ ఆమె.. బీజేపీ తరుఫున నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజుతో పాటు ముఖ్యనేతలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతికి బీజేపీ ఏం చేసిందన్న వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేతలు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. దేశాభివృద్ధికి పాటు పడతున్న బీజేపీకి తిరుపతి ప్రజలు అండగా నిలుస్తారని బీజేపీ నేతలు అంటున్నారు.
అటు, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న కేంద్రమాజీ మంత్రి చింతా మోహన్ నిరాడంబరంగా నామినేషన్ వేశారు. ఎలాంటి ఆర్భాటం, హడావిడి లేకుండా వచ్చారు. ఆయన భార్యతో కలిసి నెల్లూరు కలెక్టరేట్‌లో నామినేషన్ పత్రాలు సమర్పించారు. సాదాసీదాగా వెళ్లి… నామినేషన్ దాఖలు చేశారు. సీపీఎం అభ్యర్థిగా యాదగిరి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ విధానాల్ని నిలువరించేందుకే తాము బరిలో నిలిచామన్నారు మధు.
Read Also… సాగర్ బరిలో నోముల భగత్.. తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజాదరణ.. సాఫ్ట్‌వేర్ వదిలి ప్రజా సేవకు సిద్ధం..!