AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: కేసీఆర్‌ గళం హస్తినకు వినిపిస్తుందా?… తెలంగాణలో బీజేపీ జాతీయవాదం తెరమీదకు తెస్తుందా?

జాతీయ రాజకీయాల వైపు స్పీడ్ పెంచిన సీఎం కేసీఆర్ కు మమతా బెనర్జీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకున్న మమత బెనర్జీ కలిసి వచ్చే ముఖ్యమంత్రులతో సమావేశానికి సిద్దమయ్యారు.

Big News Big Debate: కేసీఆర్‌ గళం హస్తినకు వినిపిస్తుందా?... తెలంగాణలో బీజేపీ జాతీయవాదం తెరమీదకు తెస్తుందా?
2222
Ram Naramaneni
| Edited By: |

Updated on: Feb 16, 2022 | 6:25 AM

Share

కేసీఆర్‌ గళం హస్తినకు వినిపిస్తుందా? తెలంగాణలో బీజేపీ జాతీయవాదం తెరమీదకు తెస్తుందా? మమత ఆహ్వానంపై గులాబీబాస్‌ రియాక్షనేంటి? రీజనల్‌ పార్టీల నేషనల్‌ ఎజెండాకు బీజేపీ కౌంటరేంటి?

జాతీయ రాజకీయాల వైపు స్పీడ్ పెంచిన సీఎం కేసీఆర్ కు మమతా బెనర్జీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకున్న మమత బెనర్జీ కలిసి వచ్చే ముఖ్యమంత్రులతో సమావేశానికి సిద్దమయ్యారు. కోల్‌కతా డిక్లరేషన్‌కు సిద్దమవుతున్నారు. మరి కేసీఆర్ మమత సమావేశంలో పాల్గొంటారా? లేక గుణాత్మక మార్పు లో భాగంగా తన రూటే తనదే అంటూ కొత్త ఎజెండాతో సరికొత్త సంస్థతో దూసుకొస్తారా?

బెంగాల్‌ దీదీ నుంచి కేసీఆర్‌ ఫోన్‌కాల్‌… స్టాలిన్‌కు కూడా వచ్చిన కాల్‌

వీరందరి లక్ష్యం ఒక్కటే.. మోదీని గద్దెదించడం…ఎవరి రాష్ట్రంలో వారుండి ఎవరికి వారు ఒక్కక్కరుగా పోరుబాట పట్టారు.. ఇప్పుడు ఒక్కటవ్వాలని కోరుకుంటున్నారు. హస్తిన కోటలు బద్దలు కొట్టాలని లక్ష్యంగా మమత బెనర్జీ చేయని ప్రయత్నం లేదు…తమిళనాడు నుంచి స్టాలిన్‌ ఘీంకరింపులు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా కేసీఆర్‌ స్వరం పెంచి మోదీపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఢిల్లీ కోటలు బద్దలు కొట్టాల్సిందే అంటూ గాండ్రిస్తున్నారు

అయితే ఇక్కడే కేసీఆర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీలను ఏకం చేయడం కాదు ముందు సంఘటితం చేయాల్సింది ప్రజలను అంటూ తనదైన కోణం ఆవిష్కరిస్తున్నారు. కలిసివచ్చే పార్టీలు తర్వాత ఏకం కావొచ్చు ముందు జనాల్లోకి మోదీ ప్రజావ్యతిరేక విధానాలను తీసుకెళ్లాలన్నది కేసీఆర్‌ వ్యూహంగా ఉంది. అందుకే గతంలో చేసిన ప్రయోగం ఫెడరల్‌ ఫ్రంట్‌ వాసనలు దరి చేరకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. కేంద్రంలోని అవినీతిని బయటపెడతామంటూ హెచ్చరిస్తున్నారు. రాజ్యాంగం మార్చాలంటూ సంచలనం రేపిన కేసీఆర్‌ ఇప్పుడు మోదీ విదేశాంగ విధానం నుంచి అంతర్గత ఇష్యూల వరకూ టార్గెట్‌ చేశారు. తన లక్ష్యం బీజేపీని తరమికొట్టడమే అంటున్నారు. ఇందుకు ఆయన ఎంచుకున్న మార్గం ప్రత్యేక అజెండాతో దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం. ఇందుకు అవసరం అయితే ఉమ్మడి వేదిక ఏర్పాటు చేయడం. జనాలు ముందుకొస్తే… ఈ ప్రాసెస్‌లో సహజంగానే పార్టీలు కలిసోస్తాయంటున్నారు సీఎం కేసీఆర్‌.

కేసీఆర్‌ సమరశంఖారావం పూరించిన సమయంలోనే స్టాలిన్ తో మాట్లాడిన మమతా బెనర్జీ తాజాగా సీఎం కేసీఆర్‌తో టచ్‌లోకి వచ్చారు. త్వరలో జరిగే వారణాసి ర్యాలీకి ఆహ్వానం పలికినట్టు తెలుస్తోంది. అయితే కెసిఆర్ బిజెపి ని ఎందుకు ఓడించాలని విషయంలో స్పష్టమైన విధానాలను ముందుకెళుతున్నారు. తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన అనుభవంతో కేసీఆర్ కు జాతీయ రాజకీయాల్లో కూడా వ్యూహాలతో వెళ్ళానుకుంటున్నారు. ఫ్రంట్‌ల పేరుతో తొందరపడి టెంట్‌ పీకేయడం కాకుండా దీర్ఘకాలిక వ్యూహంతో అడుగులు వేయాలనుకుంటున్నారు. మమత బెనర్జీ ఇచ్చిన పిలుపుకు స్పందిస్తూనే ఆ వేదికను కూడా తన ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన తరహాలోనే ఎలాంటి రాజకీయ వాసనలు లేకుండా గుణాత్మక మార్పు అనే అంశంతో జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. టార్గెట్‌ మోదీ కాబట్టి స్థానికంగా ప్రత్యర్ధి అయిన కాంగ్రెస్‌ను కూడా టచ్‌ చేయడం లేదు. రాహుల్‌గాంధీ పట్ల సానుకూలంగా ప్రకటనలు చేయడం ద్వారా తాను ఎన్డీయేకు శత్రువు అనే సంకేతాలు బలంగా పంపుతున్నారు.

వాస్తవానికి ఇప్పుడు మోదీపై ఫైట్‌ చేస్తున్న పార్టీలు వాటికున్న ఎంపీల బలం… రాష్ట్రాల్లో ఉండే సీట్లు గురించి కేసీఆర్‌కు పక్కా తెలుసు. తొందరపడి పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తే వచ్చే సవాళ్లు తెలుసు. ప్రస్తుతం మోదీకి వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్న పార్టీలు టీఎంసీ, టీఆర్ఎస్‌, డిఎంకే, JMM, RJD ఉన్నాయి. ప్రస్తుతం ఆయా పార్టీలకు బలం నామమాత్రంగానే ఉంది. అయితే 200 సీట్లలో అయినా ప్రాంతీయ పార్టీలు 2014లో సాధించగలవని నమ్మకం కలిగితే మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్‌ రాజకీయ కూటమి వైపు అడుగులు వేసే అవకాశం ఉంది.

——- బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్

ఈ అంశంపైనే టీవీ మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ డిబేట్ నిర్వహించారు. ఆ లైవ్ వీడియో దిగువన చూడండి..