Numeralogy -Colours: మీకు ఏ రంగు అంటే ఇష్టం.. దేనికి ప్రధాన్యత ఇస్తారు? రంగుల ద్వారా సరికొత్త భవిష్యత్తు!
రంగులను బట్టి కూడా జీవితంలో అదృష్టం పడుతుందని చాలామంది నమ్ముతున్నారు. ముఖ్యంగా ఐరోపా దేశాల్లో ఈ మధ్యకాలంలో ఈ నమ్మకం బాగా వేళ్ళు పాతుకు పోయి..
రంగులను బట్టి కూడా జీవితంలో అదృష్టం పడుతుందని చాలామంది నమ్ముతున్నారు. ముఖ్యంగా ఐరోపా దేశాల్లో ఈ మధ్యకాలంలో ఈ నమ్మకం బాగా వేళ్ళు పాతుకు పోయి ఉంది. మీరు ఏ రంగు వస్త్రాలు ధరించారు, ఏ రంగు రాళ్లు వేలికి పెట్టుకున్నారు, ఏ రంగు చెప్పులు వేసుకున్నారు, మీకు ఏ రంగు అంటే ఇష్టం, ఏ రంగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు అనే అంశం మీద కూడా జీవితం ఆధారపడి ఉంటుందని భారత్ లోనే కాక ఇతర దేశాల్లో సైతం చాలా మందికి గట్టి నమ్మకం. రంగుల శాస్త్రాన్ని బట్టి ఓ వ్యక్తి జీవితం గురించి, భవిష్యత్తు గురించి చెప్పవచ్చని, ఎవరు ఏ రంగును వాడాలో తెలుసుకుంటే జీవితం సాఫీగా సాగిపోవడానికి వీలు కలుగుతుందని భావిస్తున్నారు.
సంఖ్యా శాస్త్రాన్ని బట్టి ఏ వ్యక్తి ఏ రంగు ఎక్కువగా ఉపయోగించాలో తెలుసుకొని, ఆ ప్రకారం ఆ రంగులో దుస్తులు ధరించడమో, ఉంగరంలో ఆ రంగు రాయిని పొదిగించి పెట్టుకోవడమో చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, పుట్టిన తేదీ 26-5-1985 అనుకోండి. ఇందులో సంఖ్యలు అన్నిటిని కూడవలసి ఉంటుంది. సంఖ్యల మొత్తం 36 అవుతుంది. దాన్ని కూడా ఒకే సంఖ్యగా మార్చాలి. అంటే ఇది 9 అవుతుంది. 9 అంటే దాని అధిపతి కుజ గ్రహం అవుతుంది. కుజ గ్రహం ఆ వ్యక్తి జీవితాన్ని అన్ని విధాలుగాను ప్రభావితం చేస్తుంది. కుజ గ్రహానికి ఏ రంగు ఇష్టమో మనం కూడా అదే రంగుకు ప్రాధాన్యం ఇచ్చే పక్షంలో మన జీవితం అదృష్టవంతంగా మారుతుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. పుట్టిన తేదీ లేని వాళ్ళు తొమ్మిది లోపల ఒక సంఖ్యను అనుకుని దాని ప్రకారం ముందుకు వెళ్లాలి.
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒకటో సంఖ్యకు సూర్య గ్రహం అధిపతి. రెండవ సంఖ్యకు చంద్రుడు, సంఖ్యకు గురువు, నాలుగవ సంఖ్యకు రాహువు, ఐదవ సంఖ్యకు బుధుడు, ఆరుకు శుక్రుడు, ఏడుకు కేతువు, 8 కి శని, 9కి కుజుడు అధిపతులు. ఈ పుట్టిన తేదీని కూడితే లేదా మీకు నచ్చిన సంఖ్యను కూడితే ఒకటి వచ్చిందనుకోండి. అప్పుడు మీ జీవితాన్ని ప్రభావితం చేసే గ్రహం సూర్య గ్రహం అని తెలుసుకోవచ్చు. సూర్యగ్రహానికి లేత ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కాషాయం రంగన్నా, ఆరెంజ్ రంగన్నా కూడా ఇష్టమే. ఒకటవ సంఖ్య వచ్చినవారు ఎక్కువగా ఈ రంగు దుస్తులు ధరించాలి. కనీసం దుస్తుల్లో ఎక్కడో అక్కడ ఈ రంగు తప్పనిసరిగా ఉండాలి. ఈ రంగులో ఉన్న రాయిని ఉంగరంలో ధరించినా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు ఉన్నవారు, అధికార యోగం కోసం ఎదురుచూస్తున్నవారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఇతర దేశాలకు వెళ్లదలుచుకున్నవారు, వ్యాపారం చేయదలుచుకున్న వారు, చదువు వంట బట్టని వారు, ఏం చేసినా అదృష్టం కలసి రానివారు ఈ రంగు దుస్తులు వేసుకుంటే తప్పకుండా వారి జీవితాల్లో మంచి సానుకూల మార్పు వస్తుంది. ప్రయత్నించి చూడండి. మీకే అనుభవం అవుతుంది. ఈ సంఖ్య వారు పొరపాటున కూడా ఆకుపచ్చ, నలుపు, నీలం రంగులు ఉపయోగించకూడదు. ప్రతికూల ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది.
అదేవిధంగా, మీ సంఖ్య రెండు అయిందనుకోండి. ఈ సంఖ్యకు అధిపతి చంద్రగ్రహం. చంద్రగ్రహానికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. ఈ రంగు నీ మీద ఉంటే మీ అదృష్టం మారిపోవడం ఖాయం. ఆకస్మిక ధన లాభాలు, లాటరీలు, ఆర్థిక లావాదేవీలు, జూదాలు, స్పెక్యులేషన్ వంటి అంశాల్లో మీరు ఒక వెలుగు వెలుగుతారు. అయితే ఎటువంటి పరిస్థితులలోనూ ఎరుపు, నీలం రంగుల జోలికి పోవద్దు. ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు తెలుపు రంగు దుస్తులు ధరించి వెళితే, తప్పకుండా సెలెక్ట్ అవుతారు. ఇక మూడవ సంఖ్య గనక అయితే, ఆ సంఖ్యకు అధిపతి గురు గ్రహం అవుతుంది. గురు గ్రహానికి ఇష్టమైన రంగు పసుపు. పసుపు రంగు దుస్తులు వేసుకున్నా, పసుపు రంగు రాయిని ఉంగరంలో ధరించినా మీకు ఇక జీవితంలో తిరుగు ఉండదు. గురు గ్రహం యోగించి మిమ్మల్ని అత్యున్నత స్థానాలకు తీసుకువెళ్లటం ఖాయం. తెలుపు, ఎరుపు, నీలం, పచ్చ రంగుల జోలికి మాత్రం పోవద్దు. దురదృష్టం వరిస్తుంది.
నాలుగవ సంఖ్యకు అధిపతి రాహువు. నాలుగవ సంఖ్య వచ్చినవారు ఎక్కువగా ముదురు ఎరుపు, గులాబీ రంగులు వాడటం మంచిది. వీటి వల్ల రాహువు కుటుంబ సౌఖ్యాన్ని, వ్యాపారంలో లాభాలను, విదేశీ చదువులను, విదేశీ ఉద్యోగాలను, పరిశోధనలో విజయాలను ఇస్తాడు. రాహువు కు తెలుపు, నలుపు రంగులు నచ్చవు. అందువల్ల నాలుగవ సంఖ్య వారు ఈ రంగులు వాడితే ప్రతికూల ఫలితాలే వస్తాయి. ఐదవ సంఖ్యకు అధిపతి బుధుడు. పచ్చ రంగు అంటే బుధ గ్రహానికి చాలా ఇష్టం. ఉన్నత విద్య, పరిశోధన, గ్రంథ రచన, వృత్తి నిపుణులు, ఐటీ, క్రీడాకారులు, వ్యాపారులు, వాణిజ్యం వంటివి రాణించాలంటే పచ్చ రంగును ఎక్కువగా ఉపయోగించడం మంచిది. అయితే, ఈ సంఖ్యకు చెందినవారు తెలుపు, నలుపు, నీలం, ఎరుపు రంగుల్ని దగ్గరకు రానివ్వకూడదు.
ఆరవ సంఖ్యకు అధిపతి శుక్ర గ్రహం. ఈ గ్రహానికి తెలుపు, గోధుమ రంగులు అంటే చాలా ఇష్టం. ఈ రంగులకు ప్రాధాన్యం ఇచ్చే వారిని ఈ గ్రహం అందలాలు ఎక్కిస్తుంది. సినిమా, టీవీ, కళాకారులు, భాగస్వామ్య వ్యాపారం, రియల్ ఎస్టేట్, వ్యవసాయం, మద్య వ్యాపారం వంటి రంగాలకు చెందిన వారు ఈ రంగు దుస్తులు ధరిస్తే తమ తమ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. ఇక ఈ సంఖ్యకు చెందినవారు పసుపు, ఎరుపు, పచ్చ, నీలం రంగులకు దూరంగా ఉండాలి. ఏడవ సంఖ్యకు అధిపతి కేతువు. ఈ గ్రహానికి గోధుమ రంగన్నా, కాఫీ పొడి రంగన్నా ఎంతో ఇష్టం. ఈ రంగులను ఎక్కువగా ఉపయోగించే వారిని అదృష్టం వరిస్తుంది. ఆధ్యాత్మికం, ప్రవచనాలు, యోగా, బోధకులు, ఉపాధ్యాయులు, రవాణా కార్మికులు, రవాణా వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, బీమా రంగానికి చెందినవారు ఈ రంగుల వల్ల ఎంతగానో పురోగతి సాధిస్తారు. ఈ సంఖ్య వారికి అకస్మాత్తుగా ధనయోగం పడుతూ ఉంటుంది. కేతు గ్రహానికి నలుపన్నా, తెలుపన్నా పడదు. ఈ సంఖ్యకు చెందినవారు ఈ రంగులు వాడితే ప్రతికూల ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది.
ఎనిమిదవ సంఖ్యకు అధిపతి శని గ్రహం. ఈ గ్రహానికి నలుపు, నీలం రంగులంటే చాలా ఇష్టం. ఎనిమిదవ సంఖ్య వచ్చినవారు ఈ రంగులు వాడితే తప్పకుండా వారి వారి రంగాల్లో పైకి వస్తారు. ఈ రంగులను ఎక్కువగా ఉపయోగిస్తే ఐశ్వర్యవంతులవుతారు. ఈ గ్రహానికి ఎరుపు, పచ్చ, తెలుపు, పసుపు రంగులు అంటే ఇష్టం ఉండదు. మద్యం, ఇనుము, లోహాలు, కులవృత్తులు, వ్యవసాయం, సేవ, ఉత్పత్తి, పంపిణీ, ప్రయాణాలు వంటి రంగాల్లో ఉన్నవారు ఈ రంగుల దుస్తులు ధరించడం వల్ల అదృష్టవంతులు అవుతారు. ఇక తొమ్మిదవ సంఖ్యకు కుజ గ్రహం అధిపతి. ఈ గ్రహం ఎరువు రంగు అంటే ఇష్టపడుతుంది. నీలం, పచ్చ, పసుపు రంగులు అంటే ఇష్టం ఉండదు. ఎరుపు రంగు దుస్తులు ధరించినా, ఎరుపు రంగు రాయిని ఉంగరంలో ధరించి పెట్టుకున్నా ఆ వ్యక్తికి తప్పకుండా అదృష్ట యోగం పడుతుంది. లోహాలు, పరిశోధనలు, వైద్యం, న్యాయ శాస్త్రం, టెక్నాలజీ, విద్యుత్ శక్తి వంటి రంగాల వారు ఎరుపు రంగు వల్ల బాగా అదృష్టవంతులయ్యే అవకాశం ఉంది.
కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సమయంలో రంగుల ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం చాలా మంచిది. ఈ సంఖ్యలు, రంగులతో తప్పకుండా ప్రయోజనం పొందుతారు. రంగుల మీద కూడా అదృష్టం ఆధారపడి ఉంటుందని భారత దేశంలో కూడా చాలామందికి గట్టి నమ్మకం ఉంది. వాణిజ్యవేత్తలు, వ్యాపారులు, కళాకారులు, సినిమా, టీవీ రంగాలకు చెందిన వారు, రియల్ ఎస్టేట్ వారు ఈ పద్ధతిని చాలా కాలం నుంచి అనుసరిస్తున్నారు.
మరిన్ని రాశి ఫలాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి