Ugadi 2025 Virgo Horoscope: కన్య రాశి వారికి ఉగాది ఫలితాలు.. ఉద్యోగులకు ఎలా ఉంటుంది?
Ugadi 2025 Panchangam Kanya Rashifal: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కన్య రాశివారికి ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతం పెరుగుదల, ఆర్థికంగా బలమైన సంవత్సరంగా ఉండే అవకాశముంది. మే 18 తర్వాత ఆదాయం పెరుగుతుంది. అయితే అనవసర ఖర్చులను నియంత్రించాలి. జూలై తర్వాత మూడు నెలల పాటు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. అక్టోబర్, నవంబర్ నెలల్లో మంచి ఆదాయం ఉంటుంది. మీ రాశికి సంబంధించి తెలుగు కొత్త సంవత్సర (మార్చి 30, 2025 నుంచి ఏప్రిల్ 1, 2026 వరకు) ఫలాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఫలితాలు – కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆదాయం 14, వ్యయం 2 | రాజపూజ్యాలు 6, అవమానాలు 6
కన్య రాశికి సప్తమ స్థానంలోకి శని, దశమ స్థానంలోకి గురువు ప్రవేశిస్తున్నందువల్ల ఉద్యోగంలో మీ ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికారులు మీ మీద బాగా ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. మే 18న ఆరవ స్థానంలోకి రాహువు ప్రవేశం వల్ల ఆదాయం బాగా పెరిగి, ఆర్థిక, వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం మాదిరిగానే అనుకూలంగా కొనసాగుతుంది. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి కానీ అందుకు తగ్గట్టుగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు తప్పకుండా సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యానికి లోటుండదు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి. తరచూ ఆదిత్య హృదయం పఠించడం వల్ల అనేక విధాలుగా శుభ ఫలితాలు కలుగు తాయి.
ఈ రాశివారికి ఏప్రిల్ నుంచి అనేక విధాలుగా అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టే పక్షంలో సంవత్సరమంతా చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. జూలై తర్వాత మూడు నెలల పాటు ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆదాయం విశేషంగా వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. పెట్టుబడులు, మదుపులు అంచనాలను మించిన లాభాలు కలిగిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలకు అవకాశం ఉంది. విదేశీయానానికి కూడా అవకాశం ఉంది. శనికి అత్యంత ప్రీతికరమైన శివార్చనను తరచూ చేయించడం వల్ల ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది.