Ugadi 2025 Leo Horoscope: సింహ రాశి వారికి ఉగాది ఫలితాలు.. అష్టమ శని ప్రభావంతో..
Ugadi 2025 Panchangam Simha Rashi: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మార్చి 27 తర్వాత సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభమవుతుంది. ఇది ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే మే 25 నుండి గురు రాశి మార్పు ప్రభావంతో పరిస్థితులు మెరుగవుతాయి. ఆగస్టు తర్వాత శుక్ర, బుధ, రవి అనుకూలతతో సమస్యలు తగ్గుతాయి. మీ రాశికి సంబంధించి తెలుగు కొత్త సంవత్సర (మార్చి 30, 2025 నుంచి ఏప్రిల్ 1, 2026 వరకు) ఫలాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఫలితాలు – సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆదాయం 11, వ్యయం 11 | రాజపూజ్యాలు 3, అవమానాలు 6
మార్చి 20 తర్వాత ఈ రాశివారికి అష్టమ శని ప్రారంభం కాబోతోంది. దీనివల్ల ప్రతి పనిలోనూ తిప్పట, శ్రమ ఎక్కువగా ఉంటాయి. అనవసర విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం, ముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పటడుగులు వేయడం, పొరపాట్లు చేయడం, అధికారుల ఆగ్రహానికి గురి కావడం వంటివి జరుగుతాయి. బాగా సన్నిహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి.
అయితే, మే 25న లాభస్థానంలోకి గురువు ప్రవేశించిన దగ్గర నుంచి ఈ అష్టమ శని ప్రభావం బాగా తగ్గే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. అనవసర ఖర్చులు, నష్టదాయక వ్యవహారాలతో ఇబ్బంది పడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మధ్య మధ్య ధన యోగం పట్టి, ముఖ్యమైన అవసరాలు తీరడం, ఆర్థిక సమస్యలు తగ్గడం వంటివి కూడా జరుగుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా ముందుకు సాగుతాయి. ఈ రాశివారు తరచూ గణపతి స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది.
పూర్తిగా సంవత్సరమంతా అష్టమ శని సమస్యలు ఉండే అవకాశం లేదు. ఆగస్టు తర్వాత శుక్ర, బుధ,, రవుల అనుకూలత పెరుగుతున్నందువల్ల అష్టమ శని ప్రభావం బాగా తగ్గి, సుఖ సంతోషాలు పెరగడం, కొన్ని ప్రధాన సమస్యలు పరిష్కారం కావడం, మానసిక ఒత్తిడి తగ్గడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరడంతో పాటు, ఇంట్లో సౌకర్యాలను మెరుగుపరచుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి తర్వాత నుంచి జీవితం సామాన్యంగా సాగిపోతుంది. తరచూ శనీశ్వరుడికి దీపం వెలిగించడం వల్ల శని ప్రభావం బాగా తగ్గే అవకాశం ఉంది.