Zodiac Signs: చక్రం తిప్పనున్న శుక్రుడు.. ఈ రాశివారి ప్రేమ వ్యవహారం పెళ్లికి దారి తీస్తుంది..

శుక్ర గ్రహం ఒక గొప్ప కళాకారుడు. ప్రేమ, శృంగారం, లైంగిక సంబంధాలు, పెళ్లిళ్లు, కళలు వంటి అంశాలకు ఈ గ్రహం ప్రధాన కారక గ్రహం.

Zodiac Signs: చక్రం తిప్పనున్న శుక్రుడు.. ఈ రాశివారి ప్రేమ వ్యవహారం పెళ్లికి దారి తీస్తుంది..
Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Jan 20, 2023 | 9:00 AM

శుక్ర గ్రహం ఒక గొప్ప కళాకారుడు. ప్రేమ, శృంగారం, లైంగిక సంబంధాలు, పెళ్లిళ్లు, కళలు వంటి అంశాలకు ఈ గ్రహం ప్రధాన కారక గ్రహం. శుక్రుడు వృషభ, తులా రాశులకు అధిపతి. మీన రాశి ఈ గ్రహానికి ఉచ్ఛ రాశి. కన్యా రాశి నీచ రాశి. సాధారణంగా ఈ రాశులలో సంచారం చేస్తున్నప్పుడు శుక్రుడు గరిష్ట స్థాయిలో తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. అయితే, వివిధ రాశుల్లో ఈ గ్రహం వివిధ రకాల ఫలితాలను ఇస్తుంటుంది. ఈ కొత్త సంవత్సరంలో వివిధ రాశుల మీద నుంచి శుక్ర గ్రహం సంచరించడం వల్ల రకరకాల ఫలితాలు చోటు చేసుకుంటాయి.

మేషం

ప్రశాంతతకు, సుఖ సంతోషాలకు మారుపేరైన శుక్ర గ్రహం మేషరాశిలో సంచరిస్తున్నప్పుడు ఈ రాశి వారిలో అతిగా మోహాన్ని పెంచుతాడు. తాను ప్రేమించిన వ్యక్తిని ఏదో విధంగా లోబరుచుకోవడమో, హద్దులు మీరి వ్యవహరించడమో జరుగుతుంది. మేష రాశి కుజుడికి సంబంధించిన రాశి. ఈ రాశిలో శుక్రుడికి కొద్దిగా అసౌకర్యంగా ఉంటుంది. అందువల్ల ప్రేమ, పెళ్లి, శృంగారం, లైంగిక సంబంధాలు వంటి విషయాల్లో బాగా దూకుడుగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ ఏడాది మార్చి 12 తర్వాత నుంచి మేషరాశిలో శుక్ర సంచారం జరుగుతుంది.

వృషభం

ఏప్రిల్ 6 నుంచి వృషభ రాశిలో సంచరించబోతున్న శుక్ర గ్రహం విలాసవంతమైన జీవితాన్ని ఈ రాశి వారికి అందిస్తాడు. శుక్రుడు తన స్వక్షేత్రమైన వృషభంలోకి ప్రవేశించగానే ఈ రాశి వారికి సంపదను, సుఖ సంతోషాలను రుచి చూపిస్తాడు. ప్రేమ జీవితంలోనూ, వైవాహిక జీవితంలోనూ అందలాలు ఎక్కిస్తాడు. దాంపత్య జీవితంలో కొత్త పుంతలు తొక్కిస్తాడు. అంతేకాదు, అక్రమ సంబంధాలు కూడా అవకాశం ఉంటుంది. స్త్రీ లోలత్వం పెరుగుతుంది. మహిళలతో పరిచయాలు పెరుగుతాయి. ఈ రాశి వారిలో కొందరికి వ్యసనాలు వంటబట్టే అవకాశం కూడా ఉంది.

మిథునం

మే రెండవ తేదీన మిధున రాశి లోకి ప్రవేశిస్తున్న శుక్రుడు ఈ రాశి వారిని ప్రేమ వ్యవహారాలలోకి దించేస్తాడు. ఇప్పటికే ప్రేమ వ్యవహారాలలో మునిగి తేలుతున్న వారిని పెళ్లి వరకు తీసుకువెళ్తాడు. సాధారణంగా పెళ్లికి ముందే దాంపత్య జీవితం ప్రారంభం కావటానికి దోహదం చేస్తాడు. విహారయాత్రలు, వినోదయాత్రలను తన ప్రేమ జీవితానికి ఆధారం చేసుకుంటాడు. షికార్లకు, ఆహార విహారాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తాడు. సాధారణంగా సహ విద్యార్థులతో నో, సహా ఉద్యోగులతోనో ప్రేమాయణాలు సాధించడానికి అవకాశం ఉంది.

కర్కాటకం

మే నెల 30వ తేదీన శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి ఈ రాశి వారు ప్రేమ వ్యవహారాల నుంచి పెళ్లి జీవితంలోకి ప్రవేశించడానికి ఆరాటపడతారు. ప్రేమ వ్యవహారాలకు తక్కువ సమయం కేటాయించి, పెళ్లి ప్రస్తావనకు ఎక్కువ సమయం ఇవ్వడం జరుగుతుంది. వీరికి ప్రేమ కంటే పెళ్లి ముఖ్యం. జీవితానికి ప్రాధాన్యం ఇస్తారు. ప్రేమ వ్యవహారాలలో కూడా శృంగారం, లైంగిక సంబంధాల కంటే భావోద్వేగ పరంగా వ్యవహరించడమే వీరికి ముఖ్యం. పెళ్లి కోసమే ప్రేమించడం జరుగుతుంది.

సింహం

జూలై 7వ తేదీన శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశిలో శుక్రుడు కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఈ రాశి వారు తాము స్వయంగా ఇతరులను ప్రేమించడం పెట్టుకోరు. అవతలి వారు ప్రేమించినప్పటికీ తాను అంటి ముట్టనట్టు వ్యవహరిస్తారు. అయితే, ప్రేమించిన వ్యక్తి మీద భారీగా ఖర్చు పెట్టడానికి, ఖరీదైన కానుకలు కొనిపెట్టడానికి, విలాసంగా గడపటానికి ఏమాత్రం వెనుకాడరు. ప్రేమించిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారి తీయడానికి ప్రాధాన్యం ఇస్తారు. పెళ్ళికి ముందు ప్రేమలను ప్రోత్సహించరు.

కన్య

శుక్ర గ్రహానికి ఇది నీచరాశి. శుక్రుడు ఈ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు, సమస్యలు, చిక్కులు ఎక్కువగా ఉంటాయి. అక్టోబర్, నవంబర్ నెలలో శుక్రుడు ఈ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ రాశి వారు ప్రేమ వ్యవహారాల్లో, దాంపత్య జీవితంలో కొంత అసంతృప్తిని ఎదుర్కోవడం జరుగుతుంది. సాధారణంగా వీరు ప్రేమ వ్యవహారాలకు సంబంధించినంత వరకు ఊహా లోకంలో జీవిస్తారు. ఎక్కువగా సహచరులతోనే ప్రేమలో పడుతుంటారు. ప్రేమను వ్యక్తం చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఒకసారి ప్రేమలో పడితే మాత్రం వీరిని మార్చడం సాధ్యం కాదు.

తుల

తులారాశి శుక్ర గ్రహానికి స్వక్షేత్రం. నవంబర్లో ఈ రాశిలోకి ప్రవేశిస్తున్నప్పటికీ, దాదాపు ఫిబ్రవరి నెల నుంచే ఈ గ్రహం ప్రేమ వ్యవహారాలకు అనుకూల వాతావరణం సృష్టిస్తుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రేమ వ్యవహారాల్లో కానీ, వైవాహిక జీవితంలో కానీ, దాంపత్య జీవితంలో కానీ తన భాగస్వామిని వదిలిపెట్టడం లేదా దూరంగా ఉండటం జరిగే ప్రసక్తే లేదు. ప్రేమ వ్యవహారంలో ఎంత దూరమైనా వెళ్ళటానికి ఈ రాశి వారు సిద్ధపడతారు. వ్యతిరేకతను, ప్రతికూలతలను అధిగమిస్తారు. ప్రేమించడం అంటూ జరిగితే అది తప్పనిసరిగా పెళ్లికి దారి తీయవలసిందే అని మీరు భావిస్తారు.

వృశ్చికం

కుజుడు అధిపతి అయిన వృశ్చిక రాశి లో శుక్రుడు ఒక పట్టాన ఇమడ లేడు. ప్రశాంతంగా, నెమ్మదిగా ఉండే శుక్రవారం దూకుడుగా ఉండే కుజుడితో సామరస్యం కుదరదు. డిసెంబర్ ప్రాంతంలో వృశ్చికంలోకి శుక్రుడు ప్రవేశిస్తాడు. ప్రేమ వ్యవహారాల్లో అవతలి వ్యక్తి తనకు లోబడి ఉండాలని, తనతో మాత్రమే సన్నిహితంగా ఉండాలని, తనకు మాత్రమే పరిమితం కావాలని మీరు కోరుకుంటారు. అవతలి వ్యక్తి నిర్ణయాలతో, ఆలోచనలతో, అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా వ్యవహరిస్తారు. ఈ ఒంటెద్దు పోకడ కారణంగా ప్రేమ వ్యవహారాలు తరచూ విఫలం అవుతుంటాయి.

ధనుస్సు

ధనురాశిలో శుక్రుడు సాధారణంగా డిసెంబర్ చివరిలో ప్రవేశిస్తాడు. ఈ రాశిలో శుక్రుడు ఆదర్శవంతమైన ప్రేమను, పెళ్లిని, శృంగారాన్ని, దాంపత్య జీవితాన్ని కోరుకుంటాడు. అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరగాలని ఆశిస్తాడు. ఎక్కువగా విహారయాత్రలకు ప్రాధాన్యం ఇస్తాడు. తన పద్ధతి ప్రకారం నడుచుకోవాలని కోరుకుంటాడు. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలను ససేమిరా అంగీకరించడు. అందమైన లేదా రమణీయమైన ప్రదేశాలలో ప్రేయసితో కబుర్లు చెప్పడానికి ఇష్టపడతాడు. నిజానికి ఈ రాశి వారిని ప్రేమించడం, ప్రేమకు ఒప్పించడం కష్ట సాధ్యమైన పని. అవతలి వ్యక్తి నుంచి మరీ ఎక్కువగా క్రమశిక్షణ, సమయ పాలన కోరుకుంటారు.

మకరం

శని క్షేత్రమైన మకర రాశిలో శుక్ర గ్రహానికి సొంత ఇంటిలో ఉన్నంత ఆనందంగా ఉంటుంది. సాధారణంగా జనవరి నెలలో శుక్రుడు ఈ రాశిలో ప్రవేశిస్తుంటాడు. మీరు ఎవరిని ప్రేమించినా ప్రేమకు కట్టుబడి ఉంటారు. దాంపత్య జీవితంలో కూడా ఒకే వ్యక్తికి అంకితమై ఉంటారు. ప్రేమలో దిగటానికి ఎక్కువ సమయం తీసుకుంటారు కానీ, ఒకసారి ప్రేమలో ప్రవేశించిన తరువాత ఇక వెనక్కి చూడటం ఉండదు. దాంపత్య జీవితంలో ప్రయోగాలు చేస్తుంటారు. ప్రేమైనా పెళ్లయినా వీరు జీవితాంతం ఒకే రకమైన ప్రవర్తనను కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి బాధ్యత పూర్తిగా తనదేనని భావిస్తుంటారు.

కుంభం

ఇది కూడా శని క్షేత్రమే అయినందువల్ల శుక్ర గ్రహానికి ఇక్కడ సౌకర్యవంతంగా ఉంటుంది. జనవరి చివరలో కానీ, ఫిబ్రవరి ప్రారంభంలో కానీ ఈ రాశిలో ప్రవేశించే శుక్రుడు ప్రేమ వ్యవహారాల్లో నీతి నిజాయితీలతో వ్యవహరిస్తాడు. సాధారణంగా ఈ రాశి వారు స్నేహంతో ప్రారంభించి ప్రేమ వరకు వెళతారు. వీరిది ఎక్కువగా మానసికమైన ప్రేమ. ఈ ప్రేమను వీరు మాటలతో కాక, వ్యవహార శైలితో వ్యక్తం చేస్తూ ఉంటారు. ప్రేమ వ్యవహారాలను చివరి వరకు రహస్యంగా ఉంచుతుంటారు. ప్రేమ వ్యవహారంలో అవతలి వ్యక్తిని కూడా తనతో పాటే ముందుకు తీసుకు వెళ్ళటానికి సహకరిస్తారు.

మీనం

ఈ రాశి శుక్ర గ్రహానికి ఉచ్ఛ రాశి. సాధారణంగా ఈ రాశి వారు ప్రేమించే పెళ్లి చేసుకుంటుంటారు. వీరితో ప్రేమ, పెళ్లి, దాంపత్య జీవితం ప్రశాంతంగా హాయిగా గడిచిపోతుంది. వీరిది ఆదర్శ ప్రేమ వివాహం అవుతుంది. మార్చి నెల నుంచి శుక్ర గ్రహ ప్రభావం ఈ రాశి వారి మీద ఎక్కువగా కనిపిస్తుంది. ప్రేమించిన వ్యక్తి కోసం ఈ రాశి వారు ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు. ఈ ఏడాది వీరి ప్రేమ వ్యవహారం తప్పకుండా పెళ్లికి దారితీస్తుంది. పెళ్లి కూడా సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ప్రేమలో దిగిన తరువాత ఈ రాశి వారు అవతలి వ్యక్తిని చాలా అపురూపంగా చూసుకుంటారు. అవతలి వ్యక్తి కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.

మొత్తానికి శుక్ర గ్రహం ఈ ఏడాది చాలా రాశుల వారిని ప్రేమలో ముంచెత్తబోతోంది. పెళ్లిళ్లు కూడా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. ఈ ఏడాది శుక్ర గ్రహం మకర రాశి నుంచి తన సంచారాన్ని ప్రారంభిస్తున్న అందువల్ల ప్రేమలైనా, పెళ్లిళ్లు అయినా కొద్దిగా సంప్రదాయ విరుద్ధంగా జరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితాలు, దాంపత్య జీవితాలు, కుటుంబ జీవితాలు కొన్ని విప్లవాత్మక మార్పులకు లోను కాబోతున్నాయి. ప్రేమ వివాహాలకు ప్రాధాన్యం పెరగబోతోంది.