Rahu Effects: రాహువుతో ఆ నాలుగు రాశులవారు కాస్తంత జాగ్రత్త! గ్రహ దోష పరిహారాలు ఏంటో తెలుసుకోండి..
Rahu Effects: రాహు గ్రహం ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఈ రాశిలో ఇది ఈ ఏడాది అక్టోబర్ 24 వరకు కొనసాగుతుంది. ఈ గ్రహం ఒక్కో రాశిలో 18 నెలలు తిష్ట వేస్తుంది.
జ్యోతిష్య శాస్త్రంలో రాహు గ్రహానికి ఉన్నంత ప్రాధాన్యం మరే గ్రహానికీ ఉండదంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. మొత్తం తొమ్మిది గ్రహాలలోను రాహువు అత్యంత ప్రమాదకర గ్రహం అని చెప్పవచ్చు. సాధారణంగా జాతక చక్రంలో శని కుజ దోషాల గురించి ఆలోచిస్తారు కానీ, నిజానికి బాగా పరిశీలించాల్సిన గ్రహం రాహువే. రాహువు ఒక ఛాయాగ్రహం. అంటే రాహువుకి ప్రత్యేకంగా ఒక రాశి అంటూ లేదు. రాహు గ్రహం ఏ రాశిలో ఉంటే ఆ రాశి నాధుడి ఫలితాన్ని ఇస్తాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అంటే రాహువు మేష రాశి లో ఉంటే ఆ రాశి అధిపతి కుజుడుని బట్టి ఫలితం చెప్పాల్సి ఉంటుంది. అయితే రాహువు స్వయంగా కూడా ఒక పాపగ్రహం కిందే లెక్క. పైగా ఈ గ్రహం ఒక విష సర్పం లాంటిది.
రాహు గ్రహం ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఈ రాశిలో ఇది ఈ ఏడాది అక్టోబర్ 24 వరకు కొనసాగుతుంది. ఈ గ్రహం ఒక్కో రాశిలో 18 నెలలు తిష్ట వేస్తుంది. ఈ గ్రహం వల్ల ప్రస్తుతం ఆరోగ్యపరంగా, ఉద్యోగ పరంగా ఇబ్బంది పడుతున్న రాశుల్లో మేషం, కర్కాటకం, తుల, మకర రాశులు ఉన్నాయి. నిజానికి శుక్రుడు, గురువు వంటి శుభగ్రహాలు రాహువుతో కలయిక వల్ల ఈ గ్రహం తన పూర్తి పాపత్వాన్ని ప్రదర్శించడం లేదు. అయినప్పటికీ, రాహువు వల్ల ఈ రాశుల వారికి ఉద్యోగంలో కుట్రలు, కుతంత్రాలు అనుభవానికి వస్తుంటాయి. ఆరోగ్యంలో కూడా మధ్య మధ్య సమస్యలు ఎదురవుతుంటాయి.
మేష రాశి
ఈ రాశిలో ప్రస్తుతం రాహువు సంచరిస్తున్నాడు. దీని ఫలితంగా ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా సంతృప్తి ఉండకపోవచ్చు. అధికారులు కానీ, సహచరులు కానీ తరచూ సమస్యలు లేదా చిక్కులు సృష్టించే అవకాశం ఉంది. తెర వెనుక ఏవైనా కుట్రలు, కుతంత్రాలు చోటు చేసుకునే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగం విష యంలో రావలసిన ఆఫర్ లెటర్స్ ఆగిపోవడం జరుగుతుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అయితే, ఈనెల 16వ తేదీన శుక్రుడు మేషరాశిలో ప్రవేశిస్తు న్నందువల్ల రాహు బలం తగ్గే అవకాశం ఉంది. పరిస్థితులు సానుకూలంగా మారవచ్చు. ఏప్రిల్ 23న గురు గ్రహం రాహువుతో మేషరాశిలో కలుస్తున్నందువల్ల మరింతగా సానుకూల ఫలితాలు పొందవచ్చు.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి దశమ స్థానంలో అంటే కెరియర్ స్థానంలో రాహువు సంచరించడం జరుగుతోంది. దీనివల్ల ఉద్యోగ స్థానంలో అధికారుల నుంచి వేధింపులు, విమర్శలు, ఆరోపణలు ఎదుర్కోవా ల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిందలు, అపనిందలు మీద పడటానికి అవకాశం ఉంది. ఉద్యోగ స్థానంలో ఈ రాశి వారు తప్పనిసరిగా అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎటు నుంచి ఏ విధమైన సమస్యలు ఎదురవు తాయో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ప్రమోషన్లు ఆగిపోవడం, ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావటం, పని భారం విపరీతంగా పెరగటం వంటివి చోటు చేసుకుంటాయి. అయితే, రాహువుతో ఈ నెల 16న శుక్రుడు, ఆ తరువాత ఏప్రిల్ 23న గురువు కలవడం వల్ల చాలావరకు ఉపశమనం లభిస్తుంది.
తులా రాశి
ఈ రాశి వారికి సప్తమ స్థానమైన మేషరాశిలో రాహువు సంచరించడం జరుగుతోంది. దీనివల్ల అధికారులతో లేదా సహచరులతో అపార్ధాలు, విభేదాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఏది మాట్లాడినా, ఏ పని చేసినా అది అవతలివారికి తప్పు మాటగానే తోచే అవకాశం ఉంది. ఈ రాశి వారు ప్రధానంగా ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆహార విహారాల్లో కఠినంగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ జరిగే సూచనలు ఉన్నాయి. అయితే, రాహువుతో త్వరలో శుక్ర గురుగ్రహాలు కలవబోతున్నందువల్ల కొన్ని సమస్యల తీవ్రత బాగా తగ్గే అవకాశం ఉంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొద్ది రోజులు తల వంచుకొని ఉండటం శ్రేయస్కరం.
మకర రాశి
ఈ రాశికి నాలుగో స్థానంలో అంటే సుఖస్థానంలో రాహువు సంచరిస్తున్నాడు. దీనివల్ల ఈ రాశి వారికి సుఖం, మనశ్శాంతి తగ్గే అవకాశం ఉంది. అధికారులు లేనిపోని బాధ్యతలను మీద వేసే ప్రమాదం ఉంది. ఎంత చాకిరీ చేసినా అధికా రులు సంతృప్తి చెందకపోవచ్చు. సాధారణంగా వృత్తి, వ్యాపారాల్లో కూడా శ్రమ, ఒత్తిడి అధికం అవుతాయి. శరీరానికి విశ్రాంతి లభించడం కూడా కష్టం అవుతుంది. ఇంటా బయటా కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులకు ఎంత మేలు చేసినా, ఎంత సహాయపడినా కృతజ్ఞత కనిపించదు. ఆరోగ్యం విషయంలో కూడా ఎంతో శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. అయితే, రాహువుతో త్వరలో శుక్రుడు, ఆ తరువాత గురువు కలవ బోతున్నందువల్ల, ఈ సమస్యలు చికాకుల నుంచి చాలావరకు గట్టెక్కే అవకాశం ఉంది. కొద్దిగా ఓర్పు సహనాలతో వ్యవహరించడం మంచిది.
అవసర పరిహారాలు
దుర్మార్గాలకు మారుపేరైన రాహు గ్రహంతో తలెత్తే సమస్యలను నివారించడానికి ఈ రాశుల వారు కొన్ని తేలికపాటి పరిహారాలను పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా తరచూ దుర్గాదేవికి పూజ చేయడం లేదా అర్చన చేయించడం వల్ల రాహు దుర్మార్గం బాగా తగ్గే అవకాశం ఉంది. శ్రీకాళహస్తి, మోపిదేవి వంటి పుణ్యక్షేత్రాలలో రాహువుకు లేదా కాలసర్ప దోషానికి పూజ చేయించడం చాలా మంచిది.
(కౌశిక్, ప్రముఖ జ్యోతిష్య పండితులు)
Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..