AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahu Ketu Gochar 2025: రాహుకేతువుల మార్పు వల్ల లాభమెవరికి..? 12 రాశుల వారిపై ప్రభావం ఇలా..

Rahu and Ketu Transit 2025: రాహు కేతువులు గత 18 మాసాలుగా మీన, కన్యారాశుల్లో సంచరిస్తున్నాయి. రాహుకేతువులు ఈ నెల (మే) 18న రాశులు మారబోతున్నాయి. రాహువు కుంభరాశిలోకి, కేతువు సింహ రాశిలోకి మారనున్నాయి. ఈ రెండు గ్రహాలు ఏడాదిన్నర కాలం పాటు ఆ రాశుల్లో సంచరిస్తాయి. రాహు కేతువుల రాశి మార్పు ప్రధానంగా వృత్తి, ఉద్యోగాలు, సంబంధాలు, ఆరోగ్యం, ఆదాయం, చదవులపై ప్రభావం చూపే అవకాశముంది.

Rahu Ketu Gochar 2025: రాహుకేతువుల మార్పు వల్ల లాభమెవరికి..? 12 రాశుల వారిపై ప్రభావం ఇలా..
Rahu Ketu gochar 2025
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: May 12, 2025 | 3:42 PM

Share

మీన, కన్యా రాశుల్లో 18 నెలల పాటు సంచారం చేసిన రాహుకేతువులు ఈ నెల 18న రాశులు మారుతున్నాయి. రాహువు కుంభ రాశిలోనూ, కేతువు సింహ రాశిలోనూ ఏడాదిన్నర పాటు అంటే 2026 డిసెంబర్ 5 వరకు సంచారం చేయడం జరుగుతుంది. ఈ గ్రహాల రాశి మార్పు వల్ల వృత్తి, ఉద్యోగాలు, సంబంధాలు, ఆరోగ్యం, ఆదాయం, చదువుల మీద ప్రభావం పడే అవకాశం ఉంది. కుంభరాశిలో రాహువు సంచారం వల్ల సాధారణంగా కొత్త ఆలోచనలు కలుగుతాయి. మానసికంగా మార్పులు చోటు చేసుకుంటాయి. కేతువు సింహ రాశి సంచారం వల్ల సంబంధ బాంధవ్యాలు మారిపోతాయి. వివిధ రాశులకు ఈ గ్రహాల మార్పువల్ల ఎటువంటి ఫలితాలు కలిగేదీ ఇక్కడ పరిశీలిద్దాం. రాహుకేతువులతో దుష్ప్రభావానికి గురయ్యే రాశులవారు సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల చెడు ప్రభావాలు తగ్గే అవకాశం ఉంటుంది.

  1. మేషం: ఈ రాశికి 11వ స్థానంలో రాహువు సంచారం వల్ల ఆర్థిక లాభాలు ఎక్కువగా కలుగుతాయి. ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. అనారోగ్యానికి తగ్గ వైద్య చికిత్స లభిస్తుంది. ఉద్యోగంలో పైకి ఎదగడానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఉత్తమ ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. కేతువు పంచమ స్థానంలో సంచా రం చేయడం వల్ల పిల్లల నుంచి సవాళ్లు, సమస్యలు ఎదురవుతాయి. సృజనాత్మక శక్తి పెరుగుతుంది.
  2. వృషభం: దశమ స్థానంలో రాహువు ప్రవేశం వల్ల ఉద్యోగంలో ఆటంకాలు, అవరోధాలు తలెత్తే అవకాశం ఉంది. ఆకస్మిక బదిలీలు జరగవచ్చు. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఉద్యోగులకు ఇతర ఉద్యోగులతో సమస్యలు తలెత్తుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీలు పెరుగుతాయి. చతుర్థ స్థానంలో కేతువు సంచారం వల్ల ఇల్లు మారడం, ఇల్లు అమ్మేయడం వంటివి జరుగుతాయి. ఆస్తి సమస్యలు ఇబ్బంది పెడతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
  3. మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో రాహు సంచారం వల్ల విదేశీయానానికి అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించవచ్చు. విదేశీ సంపాదనను అనుభవించే యోగం పడుతుంది. తల్లితండ్రులు, దగ్గర బంధువులతో సమస్యలు తలెత్తుతాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. తృతీయ స్థానంలో కేతువు సంచారం వల్ల బంధుత్వాలు పటిష్ఠం అవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది.
  4. కర్కాటకం: ఈ రాశికి అష్టమ స్థానంలో రాహువు సంచారం వల్ల ఊహించని ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆస్తి వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. రావలసిన సొమ్ము ఒక పట్టాన చేతికి అందక ఇబ్బంది పడ తారు. కుటుంబ జీవితంలో ఒత్తిళ్లు పెరుగుతాయి. ద్వితీయ స్థానంలో కేతు సంచారం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
  5. సింహం: సప్తమ స్థానంలో రాహు సంచారం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు, అపార్థాలు తలెత్తుతాయి. కులాంతర, మతాంతర వివాహం జరిగే అవకాశం ఉంటుంది. అనవసర పరిచయాలు మీదా, వ్యసనాల మీదా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ జీవితంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఈ రాశిలో కేతువు సంచారం వల్ల సంతాన ప్రాప్తికి, ఆధ్యాత్మిక పురోగతికి అవకాశం ఉంది.
  6. కన్య: ఈ రాశికి ఆరవ స్థానంలోకి రాహువు ప్రవేశం వల్ల ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కేతువు 12వ స్థానంలో ప్రవేశం వల్ల విదేశీయాన యోగం కలుగుతుంది. తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు.
  7. తుల: రాహువు పంచమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. నైపుణ్యాలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. కేతువు 11 వ స్థానంలో ప్రవేశించడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
  8. వృశ్చికం: ఈ రాశికి నాలుగవ స్థానంలో రాహువు ప్రవేశం వల్ల ఉద్యోగంలో సమస్యలు తలెత్తుతాయి. అలవికాని లక్ష్యాలు మీద పడతాయి. సవాళ్లు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. ఆదాయం కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గుముఖం పడతాయి. పదవ స్థానంలో కేతువు ప్రవేశం వల్ల ఉద్యోగ జీవితం కొద్దిగా అస్తవ్యస్తం అవుతుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది.
  9. ధనుస్సు: తృతీయ స్థానంలో రాహు సంచారం వల్ల అనేక విధాలైన వృద్ధి, పురోగతి ఉండే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల పెద్దగా లాభాలు ఉండకపోవచ్చు. ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. బంధువులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలను మించిన లాభాలు కలుగుతాయి. భాగ్య స్థానంలో కేతువు సంచారం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది.
  10. మకరం: ద్వితీయ స్థానంలో రాహువు సంచారం వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే, కుటుంబ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. కుటుంబ సభ్యులతో అపార్థాలు కలుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. అష్టమ స్థానంలో కేతు సంచారం వల్ల మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అయ్యే అవకాశం ఉంది.
  11. కుంభం: ఈ రాశిలో రాహువు సంచారం వల్ల వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గు ముఖం పడతాయి. ప్రతిభా పాటవాలు, నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుంది. ఆదాయాన్ని, ఆస్తిపాస్తుల్ని పెంచుకోవడానికి బాగా కష్టపడే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. సప్తమ స్థానంలో కేతువు సంచారం వల్ల దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తుతాయి.
  12. మీనం: వ్యయ స్థానంలో రాహువు సంచారం వల్ల అనుకోని ఖర్చులు పెరుగుతాయి. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. బంధుమిత్రుల వల్ల బాగా నష్టపోతారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. శుభ కార్యాల పైనా, సొంత ఇంటి పైనా ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆరవ స్థానంలో కేతువు సంచారం వల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం వృద్ధి చెందు తుంది.