Lucky Zodiac Signs: కర్కాటక రాశిలోకి బుధుడు.. ఇక ఈ రాశుల వారికి దశ తిరిగినట్టే..!
జూన్ 23న బుధుడు మిథునం నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 28 వరకు ఇక్కడే ఉంటాడు. మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారికి శుభ ఫలితాలుంటాయి. ఆదాయం పెరుగుతుంది, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ప్రతి రాశిపై బుధుడి ప్రభావం వివరంగా తెలుసుకుందాం.

Lucky Zodiac Signs
ఈ నెల(జూన్) 23న బుధుడు తన స్వక్షేత్రమైన మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. ఈ రాశిలో బుధుడు ఆగస్టు 28 వరకూ సంచారం చేస్తాడు. కర్కాటక రాశి అధిపతి అయిన చంద్రుడు ఈ బుధ గ్రహానికి తండ్రి. అందువల్ల బుధుడు ఈ రాశిలో కొద్దిగా శక్తిమంతంగా వ్యవహరిస్తాడు. బుద్ధి కారకుడైన బుధుడు కర్కాటక రాశి సంచారం వల్ల మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఆదాయం వృద్ధి చెంది ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కూడా చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
- మిథునం: రాశ్యధిపతి బుధుడు ధన స్థానంలో ప్రవేశించడం వల్ల షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు, ఇతర మదుపులు, పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా లాభాలనిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను దాటుతాయి.
- కర్కాటకం: ఈ రాశిలో బుధుడి సంచారం వల్ల ఉద్యోగంలోనే కాక సామాజికంగా కూడా గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు, పలుకుబడి బాగా పెరుగుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్ల డం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. బందు మిత్రుల వివాదాల్లో మధ్యవర్తిగా వ్యవహరించి విజయాలు సాధిస్తారు.
- కన్య: రాశ్యధిపతి బుధుడు లాభ స్థాన సంచారం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. మనసు లోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ నూరు శాతం నెరవేరుతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
- తుల: ఈ రాశికి దశమ స్థానంలో బుధ సంచారం వల్ల ఉద్యోగంలో ఆశించిన అభివృద్ధి ఉంటుంది. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. వారసత్వపు ఆస్తి సంక్రమిస్తుంది. అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.
- మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడి సంచారం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి సంబంధం కుదరడం వంటివి జరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. స్థాన చలనానికి అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదం ఒకటి రాజీ మార్గంలో పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సంస్థలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.
- మీనం: ఈ రాశికి పంచమంలో బుధ సంచారం వల్ల జీవనశైలిలో మార్పు వస్తుంది. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభించి అందలాలు అందుకుంటారు. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అదనపు ఆదాయ మార్గాలన్నీ నూరు శాతం విజయం సాధిస్తాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది.




