Lucky Zodiac Signs: మిథున రాశిలో రెండు శుభ గ్రహాలు.. ఆ రాశులకు అంచనాలకు మించిన అదృష్టం..!
మిథున రాశిలో గురు, బుధ గ్రహాలు కలిసి సంచరిస్తున్నాయి. ఈ రెండు గ్రహాలు ఎక్కడ కలిసినా శుభ యోగాలు, అదృష్టాన్నే ప్రసాదిస్తాయి. దీని ప్రభావంతో మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మేష రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కర్కాటక రాశివారికి శుభ ఖర్చులు పెరుగుతాయి, కన్య రాశివారికి ఉద్యోగంలో పదోన్నతులు, వృశ్చిక రాశివారికి ఆకస్మిక ధనలాభం, మకర రాశివారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.

Lucky Zodiac Signs
గురు, బుధులు ఎక్కడ కలిసినా శుభ యోగమేనని, అవి ఏదో విధంగా అదృష్టాన్ని కలగజేస్తాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ప్రస్తుతం మిథున రాశిలో కలిసి ఉన్న ఈ రెండు శుభ గ్రహాల వల్ల కొన్ని రాశులకు అంచనాలకు మించిన అదృష్టం కలిగే అవకాశం ఉన్నప్పటికీ, ఇతర రాశులకు కూడా ఈ గ్రహ యుతి మిశ్రమ ఫలితాలనే ఇస్తుంది తప్ప ప్రతికూల ఫలితాలనిచ్చే అవకాశం లేదు. మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారు కూడా ఈ యుతి వల్ల కొద్దిగా లాభాలు పొందబోతున్నారు. ఈ రాశులకు గురు, బుధులు దుస్థానాల్లో, అంటే 3, 6, 8, 10, 12 స్థానాల్లో ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి తృతీయస్థానంలో గురు, బుధుల సంచారం జరుగుతోంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం తృతీయ స్థానం శుభ గ్రహాలకు అత్యంత బలహీనమైన స్థానం. అయితే, ఈ రెండు గ్రహాల యుతి వల్ల ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. ఏ పని చేయడానికైనా వెనుకాడరు. తెగువ, సాహసం, ప్రయత్నం వంటివి వృద్ధి చెందుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ప్రయాణాలు, ప్రయత్నాల వల్ల బాగా లాభాలు కలుగుతాయి.
- కర్కాటకం: ఈ రాశికి 12వ స్థానంలో గురు, బుధుల సంచారం వల్ల శుభ కార్యాల మీద ఖర్చు పెరిగే అవ కాశం ఉంది. పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నించడం మంచిది. పెరిగిన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని దాచుకోవడం, మదుపు చేయడం, పెట్టుబడులు పెట్టడం వంటివి చేసే అవకాశం ఉంది. వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి.
- కన్య: ఈ రాశికి 10వ స్థానంలో గురువు ఉండడం వల్ల ఉద్యోగంలో ప్రాభవం తగ్గడం జరుగుతుంది. అయితే రాశ్యధిపతి బుధుడు కూడా అదే రాశిలో ఉండడం వల్ల ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభించి పదోన్నతులు పొందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరగడంతో పాటు లాభాలు వృద్ధి చెందుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి.
- వృశ్చికం: ఈ రాశికి అష్టమ స్థానంలో గురు, బుధుల సంచారం వల్ల ఉద్యోగంలోనూ, వృత్తి, వ్యాపారాల్లోనూ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. అయితే, అనేక మార్గాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవ కాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లడం కూడా జరుగుతుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది.
- మకరం: ఈ రాశికి ఆరవ స్థానంలో గురు, బుధుల సంచారం వల్ల ఆదాయంలో ఎక్కువ భాగం వృథా కావడం, ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గడం, వృత్తి, వ్యాపారాలు మందగించడం వంటివి జరిగే అవకాశం ఉంది. అయితే, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. పొదుపు చేయ డం అలవడుతుంది. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి కలుగుతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహకరిస్తారు. బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేస్తారు.