Astrology 2026: శుభ గ్రహాల అనుకూలత..వారికి పెట్టుబడులకు బెస్ట్ టైమ్ ఇదే..!
మూడు శుభ గ్రహాలు అనుకూల స్థానాల్లో సంచరిస్తున్న ప్రభావంతో కొన్ని రాశుల వారికి పెట్టుబడులకు అత్యంత శుభ సమయం ఏర్పడింది. ముఖ్యంగా వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశుల వారు షేర్లు, బంగారం, వెండి, ఆభరణాలు వంటి పెట్టుబడుల్లో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రహయోగం ధనలాభం, ఆర్థిక స్థిరత్వం, సంపద వృద్ధికి అనుకూలంగా ఉండనుంది.

ప్రస్తుతం మూడు శుభ గ్రహాలు ఒక వరుసలో సంచారం చేస్తున్నందువల్ల కొన్ని రాశుల వారికి కొత్త పెట్టుబడులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. మిథునంలో రాశ్యధిపతి బుధుడు, ధన కారకుడైన గురువుకు కర్కాటకంలో ఉచ్ఛ స్థితి, సింహంలో శుక్రుడి సంచారం వల్ల వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశుల వారు షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో పాటు బంగారం, వెండి, ఆభరణాలు, వజ్రాలు తదితర విలువైన అలంకార వస్తువుల మీద కూడా పెట్టుబడులు పెట్టడం వల్ల బాగా లాభపడతారు. మూడు శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నవారికి ధన ధాన్య సమృద్ధి యోగం కలుగుతుంది.
వృషభం
ఈ రాశివారికి ఆగస్టు చివరి లోగా అంచనాలకు మించి ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు అపారంగా లాభిస్తాయి. ఈ రాశివారు ఎటువంటి స్థితిలో ఉన్నా అపర కుబే రులయ్యే అవకాశం ఉంది. రాశ్యధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నందువల్ల స్వర్ణాభరణాల మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం మంచిది. వీలైతే భూములు కొనడం, రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగడం వంటివి కూడా లాభిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా బాగా అవకాశం ఉంది.
మిథునం
రాశ్యధిపతి బుధుడు స్వక్షేత్రంలో ఉండడం, గురువు ధన స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం, శుక్రుడు సింహరాశిలో సంచారం వల్ల అత్యంత సంపన్నులయ్యే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. అదనపు ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. భారీగా ధన, కనక, వస్తు, సామగ్రిని సమకూర్చు కునే అవకాశం ఉంది. వెండి, బంగారంతో పాటు భూముల మీద పెట్టుబడులు పెట్టడం మంచిది.
కన్య
రాశ్యధిపతి బుధుడు దశమ స్థానంలో స్వక్షేత్రంలో ఉండడం, లాభ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తుండడం వల్ల ఈ రాశివారికి షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో పాటు వెండి, బంగారం, ఆభరణాల మీద పెట్టే పెట్టుబడులు బాగా కలిసివస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ధన ప్రవాహ యోగం కలుగుతుంది. భూముల క్రయవిక్రయాలు బాగా లాభిస్తాయి. అదనపు ఆదాయం కోసం ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది.
తుల
ఈ రాశికి భాగ్య, దశమ, లాభస్థానాలు శుభ గ్రహాలతో బలంగా ఉన్నందువల్ల ఎటువంటి పెట్టుబడి అయినా లాభిస్తుంది. ఈ రాశివారికి మనసులోని కోరికల్లో చాలా భాగం నెరవేరుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటి అదనపు ఆదాయ మార్గాల ద్వారా కూడా ఆదాయం బాగా వృద్ధి చెందే అవ కాశం ఉంది. వీరు తమ అదనపు ఆదాయాన్ని, పెరిగిన ఆదాయాన్ని బంగారంతో పాటు స్వర్ణా భరణాలు, వజ్రాభరణాలు, వెండి వస్తువుల మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టడం చాలా మంచిది.
మకరం
శుభ గ్రహాల అనుకూలత వల్ల ఈ రాశివారు రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగడం చాలా మంచిది. వెండి, బంగారాలతో పాటు, స్థిరాస్తులు, షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా కూడా ఈ రాశివారు బాగా లాభపడే అవకాశం ఉంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి ప్రయత్నాలు సాగించడం మంచిది. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులకు వీరికి సమయం బాగా అనుకూలంగా ఉంది.
కుంభం
ఈ రాశివారికి రెండు నెలల పాటు ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. మదుపులు, పెట్టుబడులతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. వీరు జూలై, ఆగస్టు నెలల్లో భారీగా వస్త్రాభరణాలు, షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టడం వల్ల అనేక రెట్లు లాభం పొందే అవకాశం ఉంది. బంగారం, వెండి వస్తువులు, ఆభరణాలతో వ్యాపారాలు చేయడం, అటువంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.



