Shukra Moodami 2023: శుక్ర మూఢమి వల్ల లాభమా, నష్టమా? 12 రాశుల వారిపై దాని ప్రభావం ఎలా ఉంటుందంటే..?

Shukra Moodam 2023: రవి గ్రహానికి శుక్ర గ్రహం బాగా దగ్గరగా వెళ్లినప్పుడు అస్తంగత్వం చెందడం అంటే మూఢమి ఏర్పడడం జరుగుతుంది. రవికి దగ్గరగా వెళ్లినప్పుడు సాధారణంగా శుక్ర గ్రహం తన శక్తిని కోల్పోతుంది. శృంగానికి, పెళ్లిళ్లకు, ప్రేమలకు కారకుడైన శుక్రుడు తన శక్తిని కోల్పోయే పక్షంలో ఇవన్నీ దెబ్బతినడం జరుగుతుంది.

Shukra Moodami 2023: శుక్ర మూఢమి వల్ల లాభమా, నష్టమా? 12 రాశుల వారిపై దాని ప్రభావం ఎలా ఉంటుందంటే..?
Shukra Moodam 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 09, 2023 | 4:56 PM

Zodiac Signs: ఈ నెల 4వ తేదీ నుంచి 17వ తేదీ వరకు శుక్ర మౌఢ్యమి లేదా శుక్ర మూఢమి చోటు చేసుకుంటోంది. దీనినే మూఢం అని కూడా అంటారు. రవి గ్రహానికి శుక్ర గ్రహం బాగా దగ్గరగా వెళ్లినప్పుడు అస్తంగత్వం చెందడం అంటే మూఢమి ఏర్పడడం జరుగుతుంది. రవికి దగ్గరగా వెళ్లినప్పుడు సాధారణంగా శుక్ర గ్రహం తన శక్తిని కోల్పోతుంది. శృంగానికి, పెళ్లిళ్లకు, ప్రేమలకు కారకుడైన శుక్రుడు తన శక్తిని కోల్పోయే పక్షంలో ఇవన్నీ దెబ్బతినడం జరుగుతుంది. అందువల్ల శుక్ర మూఢమి సమయంలో శుభకార్యాలు చేయరు. కొత్తగా ఏ ప్రయత్నమూ తలపెట్టరు. కాగా, జ్యోతిష విజ్ఞానం ప్రకారం శుక్ర మూఢమి ప్రభావం వివిధ రాశుల మీద కూడా ఉంటుంది.

  1. మేషం: సాధారణంగా నాలుగవ స్థానంలో శుక్ర, రవులు కలిసి ఉండడం వల్ల భార్య మీద విపరీతంగా అనురాగం పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్క క్షణం కూడా విడిగా ఉండలేని పరిస్థితి ఉంటుంది. కలిసి పర్యటనలు చేయడం జరుగుతుంది. అంతేకాక, భర్త పనిచేసే సంస్థలోనే ఉద్యోగం లభిం చడం లేదా మారడం వంటివి కూడా జరుగుతాయి. భార్యాభర్తలిద్దరూ ఒకే వృత్తికి చెందినవారై ఉంటారు కూడా. సంతానం కావాలనుకున్న వారికి మాత్రం అందుకు అవకాశం ఉండకపోవచ్చు.
  2. వృషభం: భార్యాభర్తల మధ్య వంద శాతం అనురాగం, అన్యోన్యత ఉన్నప్పటికీ ఇద్దరూ ఒక చోట ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. విభిన్న ప్రాంతాలలో ఉద్యోగాలు చేయడం, వృత్తి, ఉద్యోగాల కారణంగా ప్రయాణాలు చేయడం, తీరిక లేకుండా ఉండడం, అలసిపోతుండడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో ఒకరు కొద్దిగా అనారోగ్యానికి గురికావడం కూడా జరగవచ్చు. మొత్తం మీద ఏదో ఒక కారణం వల్ల భార్యాభర్తల మధ్య కొద్దికాలం ఎడబాటు ఏర్పడుతుంది.
  3. మిథునం: సరసాలు, సరాగాల స్థానంలో అలకలు, కోపతాపాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ తాత్కాలికమే కావచ్చు. ఇక భార్యాభర్తలిద్దరూ విభిన్న ప్రాంతాలలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్థాన చలనాలకు కూడా ఎక్కువగా అవకాశం ఉంది. ఇద్దరి మధ్యా ప్రేమాభిమా నాలు ఉన్నా అనుకోని పరిస్థితుల్లో కొద్ది కాలంపాటు అనుకోకుండా దూరమయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా కుటుంబ పెద్దల కారణంగా ఇటువంటివి జరిగే అవకాశం ఉంది.
  4. కర్కాటకం: ఈ రాశిలోనే శుక్ర, రవుల కలయిక జరుగుతున్నందువల్ల సాధారణంగా భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉండే అవకాశం ఉండకపోవచ్చు. అహర్శిశలూ కలిసి ఉండడం జరుగుతుంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. ప్రేమాభిమానాలు, అన్యోన్యత, సాన్నిహిత్యం బాగా అభివృద్ధి చెందుతాయి. భార్యాభర్తలిద్దరూ ఒకే కంపెనీలో పనిచేయడం, ఒకే వృత్తిలో ఉండడం, ఒకే వ్యాపారంలో కలిసి ఉండడం వంటివి కూడా జరుగుతాయి.
  5. సింహం: ఏదో ఒక కారణం మీద ఒకరికొకరు దూరం కావడం అనేది తప్పకపోవచ్చు. ఈ రాశివారికి ఈ రవి, శుక్రుల కలయిక ఏమాత్రం అనుకూలంగా లేదని చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగాలు కారణం కావచ్చు. లేదా పూర్తిగా విడిపోవడం కావచ్చు. ప్రస్తుతానికి ఈ రాశివారు భార్యతో మొరటుగా, దౌర్జన్యంగా వ్యవహరించడం, వాదోపవాదాలు చేయడం, అపార్థాలు చేసుకోవడం అనే వాటిని దూరంగా ఉంచడం మంచిది. కొద్ది రోజుల పాటు ఇద్దరి మధ్యా అంతగా పొంతన ఉండే అవకాశం లేదు.
  6. కన్య: భార్య విషయంలో తనకున్న దురభిప్రాయాలు తొలగిపోయి, సామరస్యం ఏర్పడే అవకాశం ఉంది. వైవాహిక బంధం కొన్ని మార్పులతో పూర్తిగా పటిష్టం అయ్యే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్త లిద్దరి మధ్యా ముఖ్యంగా స్నేహ బంధం అభివృద్ధి చెందడం జరుగుతుంది. భార్యాభర్తలిద్దరూ ఒకే సంస్థలో ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. భర్త పని చేసే సంస్థలోకి భార్య మారే సూచనలు ఉన్నాయి. ఒకరికొకరు దూరం కావడం, ఎడబాటు రావడం వంటి సమస్యలు తొలగిపోతాయి.
  7. తుల: ఈ రాశి నాథుడైన శుక్రుడు రవి గ్రహంతో కలిసి దశమ స్థానంలో ఉండడం వల్ల సాధారణంగా భార్యతో కలిసి ఉండడానికే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత అతిగా పెరుగు తుంది. ఇద్దరూ కలిసి విహార యాత్రలో, పర్యటనలు, ప్రయాణాలో చేయడం జరుగుతుంది. ఇద్దరి మధ్యా గతంలో పొరపచ్చాలు ఏమైనా ఉంటే అవి తప్పకుండా తొలగిపోయే అవకాశం ఉంటుంది. భార్యతో అనుబంధం కొత్త మలుపు తిరుగుతుంది. విలువైన కానుకలు కొనే సూచనలు కూడా ఉన్నాయి.
  8. వృశ్చికం: ఈ రాశివారికి కూడా రవి, శుక్రుల కలయిక చాలావరకు అనుకూలంగా ఉంది. మధ్య మధ్య కోపతాపాలు, చిరాకులు తలెత్తే అవకాశం ఉన్నప్పటికీ, ప్రేమాభిమానాలకు లోటు ఉండదు. భార్యను విడిచిపెట్టి ఉండే అవకాశం లేదు. ఇద్దరి మధ్య కొన్నిఅనుకూలతలు ఏర్పడతాయి. భార్యతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. విహార యాత్రలు చేయడం, ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లడం వంటివి జరుగుతాయి. భార్య పట్ల ఉన్న అభిప్రాయంలో సానుకూల మార్పు వస్తుంది.
  9. ధనుస్సు: భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్యలున్నా, అపార్థాలున్నా తొలగిపోయి, సామరస్యం పెరుగు తుంది. భార్య మాటకు, సలహాలు, సూచనలకు విలువనివ్వడం ప్రారంభం అవుతుంది. అంతే కాదు, భార్యను ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లడం జరుగుతుంది. విహార యాత్రలకు, వినోద యాత్రలకు వెళ్లే సూచనలున్నాయి. శృంగారంలో పరాకాష్టకు చేరడం జరుగుతుంది. రవి, శుక్రుల కలయిక వల్ల వివాహ బంధం పటిష్టం అవుతుంది.
  10. మకరం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో అంటే వివాహ బంధం స్థానంలో ఈ రవి, శుక్రుల కలయిక జరగడం మంచి సానుకూల ఫలితాలను ఇస్తుంది. భార్యతో మరింత పారదర్శకంగా వ్యవహరించడం, అరమరికలు లేని జీవితాన్ని సాగించడం, ఎటువంటి పొరపచ్చాలున్నా మాట్లాడుకుని పరిష్కరించుకోవడం వంటివి జరుగుతాయి. ఇద్దరూ ఒకే సంస్థలో చేరడం కూడా జరుగుతుంది. ఇద్దరూ కలిసి ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లడం, ఇష్టమైన ఆలయాలను సందర్శించడం వంటివి జరుగుతాయి.
  11. కుంభం: ఈ రాశివారికి సాధారణంగా యథాతథ స్థితి కొనసాగుతుంది. భార్యతో వ్యవహార శైలిలో కొద్దిపాటి మార్పు చోటు చేసుకుంటుంది. ఎక్కువగా భార్య కోరికలను తీర్చడం, అందుకు ఎక్కువగా ఖర్చు చేయడం జరిగే అవకాశం ఉంది. ఎప్పటి మాదిరిగానే అన్యోన్యత, సామరస్యం కొనసాగుతాయి. దాంపత్య జీవితం చాలావరకు సుఖ సంతోషాలలో సాగిపోతుంది. విభిన్న సంస్థలలో పని చేయ డం, విభిన్న వృత్తులు చేపట్టడం వంటివి జరగవచ్చు. సామరస్యంలో మాత్రం తేడా ఉండకపోవచ్చు.
  12. మీనం: సాధారణంగా భార్య పట్ల అతిగా ప్రేమ ఉండే ఈ రాశివారికి ఈ రవి, శుక్రుల కలయిక మరింత ప్రేమను కలిగిస్తుంది. భార్య స్థానానికి అత్యంత విలువనివ్వడం, సలహాలను పాటించడం వంటివి జరుగుతాయి. దాంపత్య జీవితంలో మరింతగా అన్యోన్యత పెరుగుతుంది. ఇష్టమైన ఆధ్యాత్మిక ప్రాంతాలను, పుణ్యక్షేత్రాలను ఇద్దరూ కలిసి సందర్శించే అవకాశం ఉంది. ఇద్దరి మధ్యాసాధార ణంగా ఎడబాటు ఏర్పడే అవకాశం ఉండదు. వృత్తి, ఉద్యోగాలలో కూడా కలిసి ఉండడం జరుగుతుంది.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందని గమనించగలరు. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి