Astro Tips: మీ రాశికి గ్రహ దోషం ఏంటి..? గ్రహ దోషాలకు సరైన పరిహారం ఏమిటో తెలుసా..?

ముందుగా లగ్నాధిపతి, రాశ్యధిపతులు బలంగా ఉండడం అవసరం. ఈ అధిపతులు బలంగా ఉండడానికి, సజావుగా పని చేయడానికి ప్రామాణిక జ్యోతిష గ్రంథాలు సూచిస్తున్న ప్రధానమైన పరిహారం మంత్ర జపం. ప్రతి గ్రహానికి ఒక అధిష్ఠాన దేవత ఉంటుంది. ఆ అధిష్ఠాన దేవతను నిరంతరం మనసులో స్మరిస్తూ ఉండడం వల్ల ఆ గ్రహానికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోయి, శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుందని..

Astro Tips: మీ రాశికి గ్రహ దోషం ఏంటి..? గ్రహ దోషాలకు సరైన పరిహారం ఏమిటో తెలుసా..?
Graha Dosha
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 22, 2023 | 7:40 PM

Astro Tips in Telugu: లగ్నాధిపతి లేదా రాశ్యధిపతి బలంగా ఉంటే జాతకంలో ఎటువంటి దోషమైనా తొలగిపోతుంది. ఇందులో సందేహం లేదు. రాశ్యధిపతి లేదా లగ్నాధిపతి బలంగా లేనప్పుడు జాతకంలో ఎటువంటి యోగాలున్నా ఫలించవని జ్యోతిషశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అంటే, ముందుగా లగ్నాధిపతి, రాశ్యధిపతులు బలంగా ఉండడం అవసరం. ఈ అధిపతులు బలంగా ఉండడానికి, సజావుగా పని చేయడానికి ప్రామాణిక జ్యోతిష గ్రంథాలు సూచిస్తున్న ప్రధానమైన పరిహారం మంత్ర జపం. ప్రతి గ్రహానికి ఒక అధిష్ఠాన దేవత ఉంటుంది. ఆ అధిష్ఠాన దేవతను నిరంతరం మనసులో స్మరిస్తూ ఉండడం వల్ల ఆ గ్రహానికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోయి, శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుందని జాతక చంద్రిక, కేరళ జ్యోతిష రహస్యాలు వంటి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఏయే రాశులకు ఏయే అధిష్టాన దేవతలను స్మరించాలన్నది ఇక్కడ పరిశీలిద్దాం.

మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు ఉచ్ఛ, మిత్ర క్షేత్రాలతో పాటు సరైన స్థానాలలో ఉన్న ప్పుడు మాత్రమే యోగిస్తాడు. లేనిపక్షంలో అనేక కష్టనష్టాలు తప్పవు. ఈ కుజుడికి అధిష్ఠాన దేవత అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాన్ని లేదా మంత్రాన్ని నిత్యం మనసులో స్మరిస్తూ ఉండడం వల్ల కుజుడు శుభ ఫలితాలను మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. స్కంద షష్టి వంటి పర్వదినాలప్పుడు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం మంచిది.

వృషభం: ఈ రాశి నాథుడైన శుక్రుడికి అధిదేవత లక్ష్మీదేవి లేదా హయగ్రీవుడు. ఈ దేవతల్లో ఒకరిని నిత్యం మనసులో స్మరించడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. జాతక చక్రంలో శుక్రుడు సరైన స్థానాల్లో ఉన్నప్పుడు భోగభాగ్యాలకు కొరత ఉండదు. శుక్రుడి పరిస్థితి సరిగ్గా లేని పక్షంలో ఇంట్లో దారిద్ర్య దేవత తాండవిస్తుంది. అందువల్ల ఈ దేవతలను నిత్యం స్మరించడం చాలా అవసరం. ఈ దేవతలకు సంబంధించిన పండుగలలో వారికి విధిగా పూజ చేయడం మంచిది.

మిథునం: ఈ రాశికి అధిపతి అయిన బుధుడికి గణపతి అధిదేవత. జాతక చక్రంలో బుధుడు బలంగా ఉన్నా లేకపోయినా వినాయకుడిని స్మరించుకోవడం వల్ల ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగల సామర్థ్యం ఏర్పడుతుంది. ప్రతిభా పాటవాలు రాణిస్తాయి. సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. గణపతి మంత్రాన్ని గానీ, శ్లోకాన్ని గానీ వీలైనప్పుడల్లా మనసులో స్మరించుకోవడం వల్ల జీవితం మంచి మలుపు తిరుగుతుంది. వినాయక చవితిని తప్పకుండా జరుపుకోవాల్సి ఉంటుంది.

కర్కాటకం: ఈ రాశినాథుడైన చంద్రుడికి దుర్గాదేవి అధిదేవత. జాతక చక్రంలో చంద్రుడి బలం పెరిగి శుభ యోగాలివ్వడానికి దుర్గాదేవి మంత్రాన్ని గానీ, ప్రార్థన శ్లోకాన్ని గానీ అనుక్షణం మనసులో స్మరించుకోవడం అవసరం. దీనివల్ల మానసిక దృఢత్వం కలుగుతుంది. జీవితంలో అతి వేగంగా పురోగతి ఉంటుంది. అతి చిన్న యోగమైనా అత్యుత్తమ ఫలితాలనిస్తుంది. ఎటువంటి మానసిక సమస్యలున్నా తొలగిపోతాయి. ఎంత వయసు వచ్చినా ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

సింహం: ఈ రాశికి అధినాథుడైన రవికి సూర్య భగవానుడే అధినాథుడు. అందువల్ల జాతక చక్రంలో రవి ఏ స్థానంలో ఉన్నా ఆదిత్య హృదయాన్ని లేదా సూర్య మంత్రాన్ని స్మరించుకోవడం చాలా అవసరం. సిరిసంపదలకు లోటు ఉండదు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. జీవితాంతం రాచ మర్యాదలు జరుగుతాయి. చిన్న యోగమైనా అధికంగా శుభ ఫలితాలను ఇస్తుంది. జీవితానికి ఒక సార్థకత ఏర్పడుతుంది. ఈ రాశివారు రథ సప్తమిని తప్పకుండా పాటించడం మంచిది.

కన్య: ఈ రాశికి అధిపతి అయిన బుధ గ్రహానికి అధిదేవత అయిన గణపతిని లేదా విష్ణువును సదా స్మరించడం వల్ల అనేక శుభ యోగాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాణించడం జరుగు తుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. గణపతి మంత్రాన్ని లేదా స్తోత్రాన్ని పఠించడం వల్ల, విష్ణు సహస్ర నామం పారాయణ చేయడం వల్ల బుధ గ్రహానికి బలం పెరిగి, జాతకపరంగా దోష పరిహారం జరుగుతుంది. ఈ దేవతల పండుగలను శ్రద్ధాసక్తులతో పాటించడం చాలా ముఖ్యం.

తుల: ఈ రాశికి అధిపతి అయిన శుక్ర గ్రహానికి లక్ష్మీదేవి అధిదేవత. జాతక చక్రంలో శుక్రుడికి సంబంధించి ఎటువంటి దోషాలున్నా లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల పరిహారం జరుగుతుంది. లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాన్ని లేదా స్తోత్రాన్ని లేదా ప్రార్థన శ్లోకాన్ని నిత్యం మనసులో స్మరించుకోవడం వల్ల భోగభాగ్యాలు బాగా అభివృద్ధి చెందుతాయి. సునాయాసంగా విజయాలు సాధిస్తారు. లక్ష్యీదేవికి సంబంధించిన పండుగలను తప్పనిసరిగా జరుపుకోవాల్సి ఉంటుంది.

వృశ్చికం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామి అధిదేవతలు. వీరిని ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విధంగా నిత్యం మనసులో స్మరించుకోవడం వల్ల శత్రు, రోగ, రుణ బాధలు తొలగిపోవడంతో పాటు జీవితంలో శీఘ్ర పురోగతి సాధ్యమవుతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. ఈ దేవతలకు సంబంధించిన ప్రార్థనలతో పాటు తప్పనిసరిగా వీరి పండుగలను శ్రద్ధాసక్తులతో జరుపుకోవాల్సిన అవసరం ఉంది.

ధనుస్సు: ఈ రాశి నాథుడైన గురు గ్రహానికి దుర్గాదేవి అధిష్టాన దేవత. అందువల్ల దుర్గాదేవి మంత్రాన్ని లేదా శ్లోకాన్ని మనసులో నిత్యం స్మరించుకోవడం వల్ల తప్పకుండా అదృష్టం పడుతుంది. దుర్గా దేవి ఇతర రూపాలను స్మరించినా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. లలితా సహస్ర నామం పఠించడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. దుర్గాదేవికి సంబంధించిన పండుగలను విధిగా పాటించాల్సి ఉంటుంది. అతి తక్కువ కాలంతో అత్యున్నత స్థాయికి చేరుకోవడం జరుగుతుంది.

మకరం: ఈ రాశికి అధిపతి అయిన శనీశ్వరుడికి శివుడు అధి దేవత. శివుడికి ప్రతి నిత్యం అర్చన చేసినా, శివ మంత్రం (పంచాక్షరి) పఠించినా, ప్రార్థన శ్లోకం చదివినా శనీశ్వరుడికి సంబంధించిన దోషాలన్నీ పరిహారమై, జీవితంలో ఊహించని అభివృద్ధికి అవకాశం ఉంటుంది. తరచూ శివాలయాన్ని సందర్శించడం, మహాశివరాత్రిని పాటించడం వల్ల అనేక శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. శనీశ్వరుడికి బలం చేకూరినా, యోగదాయకుడైనా జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.

కుంభం: ఈ రాశికి అధిపతి అయిన శనీశ్వరుడికి శివుడే అధి దేవత. నరసింహ స్వామిని స్మరించుకున్నా శనీశ్వరుడికి దోష పరిహారం జరుగుతుంది. ప్రతి నిత్యం మనసులో శివుడిని ధ్యానించడం, స్మరిం చడం వల్ల శనీశ్వరుడు శుభ ఫలితాలు ఇవ్వడమే జరుగుతుంది. శివుడిని ధ్యానించడం వల్ల ఏలి న్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వంటివి కూడా తొలగిపోతాయి. శివుడి స్మరణతో శని దోషం, శని పాపత్వం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శివ రాత్రిని పాటించడం మంచిది.

మీనం: ఈ రాశికి అధిపతి అయిన గురు గ్రహానికి దుర్గాదేవితో పాటు దత్తాత్రేయ స్వామి కూడా అధి దేవత. అందువల్ల ఈ ఇద్దరు దేవతల్లో ఒకరిని నిత్యం స్మరించుకోవడం వల్ల ఎటువంటి గురు దోష మైనా తొలగిపోతుంది. జీవితంలో అత్యున్నత స్థానాలకు చేరుకోవడం, అత్యంత గౌరవ మర్యాదలు పొందడం, సిరిసంపదలను అనుభవించడం వంటివి జరుగుతాయి. దుర్గాదేవికి సంబంధించిన పండుగలను లేదా దత్తాత్రేయుడికి సంబంధించిన గురు పూజలను పాటించడం చాలా మంచిది.