Andhra Pradesh: కేసీఆర్ జాతీయ పార్టీపై వైసీపీ రియాక్షన్ ఇదే.. పార్టీ విధానాలపై స్పందించిన సజ్జల..

తెలంగాణ నేతలు మా గురించి మాట్లాడటంతోనే తాము స్పందించాల్సి వచ్చిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాము ఇక్కడి వ్యవహారాలకు మాత్రమే కట్టుబడి ఉన్నామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తమ పార్టీ ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని, అందరూ బాగుండాలనేదే..

Andhra Pradesh: కేసీఆర్ జాతీయ పార్టీపై వైసీపీ రియాక్షన్ ఇదే.. పార్టీ విధానాలపై స్పందించిన సజ్జల..
Sajjala Ramakrishna Reddy
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 06, 2022 | 4:17 PM

సీఏం కేసీఆర్ ప్రారంభించిన జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ ఎస్) పై తెలంగాణలోని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ.. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేసీఆర్ జాతీయ పార్టీపై చిరునవ్వుతో స్పందించగా.. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా స్సందించింది. రాష్ట్ర ప్రభుత్వ సలహదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తామని చెప్పారు. కొత్త పార్టీలు రావడం వల్ల పోటీ పెరిగి తమ ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవచ్చన్నారు. ప్రజలకు సంబధించిన అంశాలపై విధానపరమైన అంశాలతో పార్టీలు వస్తే మంచిదేనని అన్నారు. కొత్త పార్టీల రాకపై తాము ఎటువంటి విశ్లేషణ చేయబోమన్నారు. తమది రాజకీయం కోసం రాజకీయ ఎత్తుగడలు వేసే పార్టీ కాదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తాము పాలన అందిస్తున్నామని, అందుకే ప్రజల్లో తమ పార్టీకి ఆదరాభిమానాలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. తమ పార్టీకి స్పష్టమైన విధానం ఉందని, ప్రజల కోసమే తాము రాజకీయం చేస్తున్నామని చెప్పారు. అందుకే ప్రజలు తమకే మద్దతు పలుకుతారని, ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలే అని అన్నారు. రాష్ట్ర అభ్యున్నతే తమకు ముఖ్యమని చెప్పారు. పక్క రాష్ట్రాల విషయాలకు తమకు అవసరం లేదని, తాము ఇతర రాష్ట్రాల వారి గురించి మాట్లాడటం లేదన్నారు. తెలంగాణ నాయకులు అక్కడి విషయాలు వదిలేసి తమ గురించి ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. భవిష్యత్తు రాజకీయాల కోసం వాళ్లు అలా చేస్తున్నారేమో తమకు తెలియదన్నారు.

తెలంగాణ నేతలు మా గురించి మాట్లాడటంతోనే తాము స్పందించాల్సి వచ్చిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాము ఇక్కడి వ్యవహారాలకు మాత్రమే కట్టుబడి ఉన్నామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తమ పార్టీ ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని, అందరూ బాగుండాలనేదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చే హామీలు అమలుచేయడానికి రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండాలన్నారు. అన్ని ఆలోచించిన తర్వాత అమలు చేయగలిగే హామీలనే ఇవ్వాలన్నారు. ఎన్నికల ముందు ప్రకటించే మ్యానిఫెస్టోను ఆయా పార్టీలు పవిత్రంగా భావించాలన్నారు. రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు వంద శాతం అమలయ్యేలా ఉండాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. స్వార్థ ప్రయోజనాలు, అధికారం కోసం ప్రజలకు మోసపూరిత హామీలు ఇవ్వకూడదన్నారు. మ్యానిఫెస్టో తయారుచేయడానికి ముందే వాటిని ఎంతవరకు ఆచరణలో పెట్టగలమనే అంశాన్ని ముందే రాజకీయ పార్టీలు పరిశీలించుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు. గతంలో తాము ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

అమరావతి రైతుల మహా పాదయాత్రపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ అమరావతి ఉద్యమం పేరుతో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ విధానాన్ని తాము ఎందుకు ఎంచుకున్నామో ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించాల్సి అవసరం ఎంతైనా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చి అమలు చేయలేదని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నాయకులు అసత్య ప్రచారాలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని, అయినా ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారని తెలిపారు. సీఏం వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాలలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, పేద ప్రజల సంకేమానికి తమ నాయకుడు కట్టుబడి ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తమ పార్టీ కట్టుబడి ఉందని, దీనిలో భాగంగానే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..