AP Politics: కృష్ణా జిల్లాలో వైసీపీకి చుక్కెదురు.. కాంగ్రెస్‌లోకి కీలక నేత
ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా చార్జ్ తీసుకున్న షర్మిల.. జోరు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకొచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె వైఎస్ సన్నిహితులను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, జనవరి 27: కృష్టా జిల్లాలో వెసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం సీనియర్ నేత, ప్రముఖ వైద్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల డాక్టర్ రామచంద్రరావును ఆయన నివాసంలో కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రామచంద్రరావు త్వరలో కాంగ్రెస్‌లో చేరతారని చెప్పారు. డాక్టర్ రామచంద్రరావు 2014లో వైఎస్సార్‌సీపీ టికెట్‌పై పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయారు. రామచంద్రరావుపై వంశీ 9,548 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వంశీకి 99,163 ఓట్లు రాగా, రామచంద్రరావుకు 89,615 ఓట్లు వచ్చాయి.
రామచంద్రరావు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రాష్ట్ర పర్యటనలో ఉన్న షర్మిల గురువారం సాయంత్రం గన్నవరంలో కొద్దిసేపు ఆగి డాక్టర్ రామచంద్రరావును కలిసి.. పలు సామాజిక, రాజకీయ అంశాలపై చర్చించారు. గన్నవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున రామచంద్రరావు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోషల్ సర్వీస్‌తో పాటు, పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం ద్వారా రామచంద్రరావుకు ఆ ప్రాంతంలో మంచి పేరు ఉంది. పార్టీలో తనకంటే.. ఫిరాయించిన ఎమ్మెల్యే వంశీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని భావించిన డాక్టర్ రామచంద్రరావు వైఎస్సార్‌సీపీ హైకమాండ్‌పై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. వంశీకి సహకరించేది లేదని పలుమార్లు బహిరంగంగా మీడియాతోనే చెప్పారు.
కాగా 2019లో గన్నవరం వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన యార్లగడ్డ వెంకట్రావు.. టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ చేతిలో స్వల్ప ఓట్లతో ఓటమి చెందారు. అయితే ఆ తర్వాతి కాలంలో వంశీ వైసీపీలోకి రాగా.. యార్లగడ్డ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి దుట్టా ఈసారి బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. దీంతో ఈ సారి గన్నవరం పోరు ఆసక్తికరంగా మారనుంది.

Dutta Ramachandra Rao
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
