AP Land Survey: ఏపీలో భూముల రీ సర్వేకు సంబంధించి కీలక అప్‌డేట్.. రంగంలోకి డ్రోన్స్, రోవర్స్
సచివాలయంలో 'వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష'పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రుల కమిటీ సమావేశం అయ్యింది. కాగా...
సచివాలయంలో ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష’పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రుల కమిటీ సమావేశం అయ్యింది. కాగా వంద సంవత్సరాల తరువాత తొలిసారి ఈ తరహా సమగ్ర సర్వేను జగన్ సర్కార్ చేపడుతున్న విషయం తెలిసిందే. జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షతో భూ వివాదాలకు చెక్ పడనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్, రోవర్ల సహకారంతో భూసర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో మొత్తం 70 కోర్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ముందుగా గ్రామాల సరిహద్దుల గుర్తింపునకు చర్యలు చేపడుతున్నారు. సమగ్ర సర్వే కోసం 13,371 పంచాయతీ కార్యదర్శులు, 10,935 మంది డిజిటల్ అసిస్టెంట్లు, 10,185 మంది గ్రామ సర్వేయర్లకు బాధ్యతలు అప్పగించారు. 12వేల మంది ఫంక్షనరీలకు శిక్షణ ఇచ్చారు అధికారులు. ఇప్పటి వరకు 736 గ్రామాల్లో ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌లు సిద్దమయ్యాయి. 240 గ్రామాలకు చెందిన విలేజ్ మ్యాప్‌లు సిద్దం చేశారు. మొత్తం 34 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ అండ్ వాలిడేషన్ సర్వే పూర్తి అయ్యింది. 70.2 లక్షల అసెస్‌మెంట్లకు గానూ ఇప్పటి వరకు 13.7 లక్షల అసెస్‌మెంట్ల పరిశీలన పూర్తి అయ్యిందని అధికారులు తెలిపారు. జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకంను సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. నిర్థిష్ట కాలపరిమితిలో మొత్తం భూ సర్వే జరగాలని కూడా ఆయన ఆదేశించారు. సమగ్ర సర్వే ద్వారా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళణ అవుతుందని పేర్కొన్నారు. కాగా ఈ సర్వేలో కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎంను కోరనున్నట్లు మంత్రుల కమిటీ తెలిపింది. కాగా వైఎస్సార్ జగనన్న- శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం అమలు కోసం సీఎం మంత్రుల కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్వీనర్ గా, ధర్మాన కృష్ణ దాస్ , బొత్స సత్యనారాయణ సభ్యులుగా కమిటీ వ్యవహరిస్తున్నారు.
మంత్రుల కమిటీ సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ (రెవెన్యూ), మంత్రి బొత్స సత్యనారాయణ, సిసిఎల్‌ఎ నీరభ్ కుమార్ ప్రసాద్, ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) ఉషారాణి, పిఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ గిరిజాశంకర్, సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్ సిద్దార్ధ్ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎంఎం నాయక్, డిఎంజి, ఎపిఎండిసి విసి అండ్ ఎండి విజి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక అప్‌డేట్.. వాచ్‌మన్ రంగయ్య సంచలన వాంగ్మూలం