Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఓర్నీ దుంపతెగ.. మద్యం బాటిల్ కోసం లొల్లి! ముగ్గురిపై పెట్రోలు పోసి నిప్పంటించేశాడు

చెడు వ్యసనాల మాయలో కొందరు యువకులు నానాయాగీ చేశారు. క్వార్టర్‌ మద్యం కోసం ఒకరికొకరు ఘర్షణ పడి.. చివరికి పెట్రోల్‌ పోసి నిప్పటించే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఓ యువకుడి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన విజయవాడలోని కాన్వెంట్‌ జంక్షన్‌ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కృష్ణా జిల్లాలోని గుడివాడకు చెందిన ఆవాల శ్రీకాంత్‌ జీవనోపాది కోసం విజయవాడ వచ్చాడు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ అడ్డా వద్ద ఉంటూ..

Andhra Pradesh: ఓర్నీ దుంపతెగ.. మద్యం బాటిల్ కోసం లొల్లి! ముగ్గురిపై పెట్రోలు పోసి నిప్పంటించేశాడు
Fight Over Liquor Bottle
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 12, 2024 | 11:55 AM

విజయవాడ, ఆగస్టు 12: చెడు వ్యసనాల మాయలో కొందరు యువకులు నానాయాగీ చేశారు. క్వార్టర్‌ మద్యం కోసం ఒకరికొకరు ఘర్షణ పడి.. చివరికి పెట్రోల్‌ పోసి నిప్పటించే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఓ యువకుడి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన విజయవాడలోని కాన్వెంట్‌ జంక్షన్‌ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కృష్ణా జిల్లాలోని గుడివాడకు చెందిన ఆవాల శ్రీకాంత్‌ జీవనోపాది కోసం విజయవాడ వచ్చాడు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ అడ్డా వద్ద ఉంటూ రోజువారీ కూలి పనులకు వెళ్తుంటాడు. అయితే శనివారం రాత్రి పని ముగించుకున్న శ్రీకాంత్‌, కూలి డబ్బు తీసుకుని వెళ్తూ.. మార్గం మధ్యలో నిర్మల కాన్వెంట్‌ జంక్షన్‌ వద్ద ఉన్న వైన్‌ షాపులో ఓ మందు బాటిల్‌ కొన్నాడు. ఇంటికి వెళ్తున్న క్రమంలో పైవంతెన కింద బల్లలపై షేక్‌ నాగుల్‌మీరా, గుణ అనే వ్యక్తులతో పాటు మరికొంత మంది లుడో ఆడుతుండటం గమనించాడు.

దీంతో అక్కడికి వెళ్లిన శ్రీకాంత్‌ నిలబడి ఆట చూడ సాగాడు. సరిగ్గా అదే సమయంలో ఆట ఆడుతున్న నాగుల్‌మీరా, గుణ.. శ్రీకాంత్‌ జేబులోని మద్యం సీసాను చూశారు. అనంతరం వాళ్లిద్దరూ లేచి, బలవంతంగా శ్రీకాంత్‌ను పట్టుకొని.. అతడి జేబులోని మద్యం సీసా గుంజుకున్నారు. అనంతరం జేబులో ఉన్న రూ.500 నగదు లాక్కోని, అతడిపై దాడి చేశారు. దీంతో కోపోధ్రిక్తుడైన శ్రీకాంత్‌ సమీపంలోని ఫిల్లింగ్‌ స్టేషన్‌లో పెట్రోల్‌ కొని తీసుకొచ్చాడు. నిర్మల కాన్వెంట్‌ జంక్షన్‌ వద్ద ఉన్న నాగుల్‌మీరాతో పాటు మరో ఇద్దరిపై పెట్రోల్ పోశాడు.

అగ్గిపెట్టె ముట్టించేలోగా వారిలో ఇద్దరు తప్పించుకుని పారిపోయారు. నాగుల్‌మీరాకు నిప్పంటించాడు. మంటలు అంటుకోవడంతో అతడి ముఖం, మెడపై మంటలు వ్యాపించాయి. గమనించిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌, స్థానికులు మంటలు అదుపు చేశారు. కాలిన గాయాలతో నాగుల్‌మీరా నడుచుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. ఈ సంఘటన శనివారం రాత్రి 10 గంటల సమయంలో చోటు చేసుకుంది. అయితే మరుసటి రోజు అంటే ఆదివారం మధ్యాహ్నం వరకు పెట్రోల్‌ పోసి నిప్పంటించిన శ్రీకాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడం గమనార్హం. దీనిపై సీపీ కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పటమట పోలీసులు వెంటనే శ్రీకాంత్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగుల్‌మీరా ఆరోగ్యం నిలకడగా ఉంది. శ్రీకాంత్‌పై దాడి చేసి నగదు లాక్కున్నందుకు నాగుల్‌మీరా, గుణలతో పాటు మరొకరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించినందుకు శ్రీకాంత్‌పై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.