Natwar Singh: కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ విదేశాంగ మంత్రి కె నట్వర్‌సింగ్ (93) శనివారం (ఆగస్టు 10) కన్నుమూశారు. గత రెండు వారాలుగా అనారోగ్యంతో గుర్గావ్లోని మేదాంత ఆసుపత్రిలో నట్వర్‌సింగ్ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి శనివారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. ఆయనుకు భార్య హేమిందర్ కుమారి సింగ్, కుమారుడు జగత్ సింగ్ ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు నట్వర్‌సింగ్ 2004 నుంచి 2005 వరకు ప్రధాన మంత్రి..
న్యూఢిల్లీ, ఆగస్టు 11: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ విదేశాంగ మంత్రి కె నట్వర్‌సింగ్ (93) శనివారం (ఆగస్టు 10) కన్నుమూశారు. గత రెండు వారాలుగా అనారోగ్యంతో గుర్గావ్లోని మేదాంత ఆసుపత్రిలో నట్వర్‌సింగ్ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి శనివారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య హేమిందర్ కుమారి సింగ్, కుమారుడు జగత్ సింగ్ ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు నట్వర్‌సింగ్ 2004 నుంచి 2005 వరకు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. అంతకుముందు రాజీవ్ గాంధీ హయాంలోనూ కేంద్ర ఉక్కు, గనులు, వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా కూడా సేవలు అందించారు. అలాగే 1986 నుంచి 1989 వరకు విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు.
నట్వర్ సింగ్ 1931లో రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో జన్మించారు. ఆయన దేశ రాజకీయాల్లో పలు కీలక శాఖల్లో విశిష్ట సేవలు అందించారు. 1966 నుంచి 1971 వరకు ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కార్యాలయానికి అనుబంధంగా సేవలు అందించారు. గొప్ప దౌత్యవేత్తగా, రచయితగా మంచి పేరు గడించారు. ఆయన దేశానికి చేసిన సేవకు గానూ కేంద్ర ప్రభుత్వం 1984లో పద్మభూషణ్‌తో సత్కరించింది. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దౌత్యం, విదేశాంగ విధానానికి సింగ్ చేసిన విశేష కృషిని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ప్రముఖ నేత రణదీప్ సూర్జేవాలాతో సహా పలువురు సోషల్ మీడియా వేదికగా నట్వర్ సింగ్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నట్వర్‌సింగ్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనున్నాయి.
Deeply saddened by the passing away of K Natwar Singh, distinguished diplomat and former External Affairs Minister.
His many contributions include a vital role in the July 2005 India – US nuclear deal. His writings, especially on China, provided valuable insights into our… pic.twitter.com/HsMXzI2WtF
— Dr. S. Jaishankar (@DrSJaishankar) August 11, 2024
నట్వర్ సింగ్ తన జీవిత కాలంలో ‘ది లెగసీ ఆఫ్ నెహ్రూ: ఎ మెమోరియల్ ట్రిబ్యూట్’, ‘మై చైనా డైరీ 1956-88’ వంటి పలు పుస్తకాలను రచించారు. ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్’ అనే పేరుతో ఆయన ఆత్మకథ కూడా పుస్తకం రూపంలో వెలువడింది.