AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gurajala: అటు వైసీపీ.. ఇటు టీడీపీ.. మధ్యలో దూరిన జనసేన.. వైసీపీ జయహో బీసీ సభతో పొలిటికల్‌ సెగలు..

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల టిడిపి ఏర్పాటు చేయనున్న బిసి సభ రాజకీయ కాక రేపింది. అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు జనసేన కూడా శ్రతి కలపడంతో వివాదంగా మారింది. బిసిలకు నువ్వేం చేశావని అధికార పార్టీ అంటే మీరేం చేశారని టిడిపి అంటుంది. ఈ మధ్య మీరిద్దరికి అంత ప్రేముంటే బిసికి టికెట్ ఇచ్చి వారి గెలుపుకు క్రషి చేస్తారా అంటూ జేఎస్పీ రంగంలోకి దిగింది. దీంతో మూడు పార్టీల మధ్య మాటలు యుద్దం జరుగుతుంది.

Gurajala: అటు వైసీపీ.. ఇటు టీడీపీ.. మధ్యలో దూరిన జనసేన.. వైసీపీ జయహో బీసీ సభతో పొలిటికల్‌ సెగలు..
Gurjala
Sanjay Kasula
|

Updated on: Dec 15, 2022 | 7:07 PM

Share

విజయవాడలో అధికార వైసీపీ.. జయహో బీసీ సభ ఏర్పాటు చేశాక.. ఏపీ పొలిటికల్‌ తెరమీద కొత్త మెరుపులు కనిపిస్తున్నాయ్‌. దీంతో అలర్టయిన టీడీపీ నేతలు.. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో బీసీ సభను పెట్టారు. గురజాల నియోజవర్గం పరిధిలోని బీసీలు ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. అయితే, దీనిపై గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌గా కాక పుట్టించాయ్‌. మనం చేసిన వాటిని మనమే చెప్పుకోవడం కంటే… దాన్ని ప్రత్యర్థి పార్టీలు ఫాలో అయినప్పుడు ఉండే కిక్కే వేరప్పా… అంటూ ఆయన చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి.

వైసీపీ వల్లే టీడీపీలో కదలిక వచ్చిందని సెటైర్‌ 

అంటే… బీసీల పార్టీగా చెప్పుకొనే టీడీపీ… అధికారంలో ఉన్నప్పుడు వాళ్లకోసం ఏమీ చేయలేదన్నది కాసు విమర్శ. టీడీపీ హయాంలో ఒకరిద్దరికి తప్ప బీసీలెవ్వరికీ పదవులివ్వలేదనీ… అదే వైసీపీ అధికారంలోకి రాగానే ఎనిమిది మంది బిసిలకు పదవులిచ్చామనీ… మహేశ్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పుడు తమను, టీడీపీ ఫాలో అవుతోందన్నది వైసీపీ ఎమ్మెల్యే సెటైరన్నమాట. అందుకే, వైసీపీ ఏర్పాటుచేసిన జయహో బీసీ సభను చూసి.. టీడీపీలో కదలిక వచ్చిందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే.

టీడీపీ, బీసీల సభ పెడితే ఉలుకెందుకన్న యరపతినేని?

ఎమ్మెల్యే వ్యాఖ్యలను.. అదే రేంజ్‌లో తిప్పికొట్టారు మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. టీడీపీ.. బీసీల సభ ఏర్పాటుచేస్తే ఎమ్మెల్యేకు అంత ఉలుకెందుకని ప్రశ్నించారు. నిజంగా బీసీలకు మంచే చేసుంటే… ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీసీనాయకులు ఎందుకు రోడ్డెక్కుతున్నారో చెప్పాలన్నారు. వైసిపి హయాంలో చాలా మంది బీసీనేతలు, కార్యకర్తలు.. హత్యకు గురయ్యారన్నారని విమర్శించారు.

వైసీపీ, టీడీపీ గొడవలో దూరిన జనసేన

టిడిపి, వైసిపిల మధ్య విమర్శలు మామూలే అనుకుంటే.. నడుమ నేనంటూ జనసేన తలదూర్చింది. గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాసు, మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఇద్దరూ బిసిలకు అన్యాయం చేశారంటూ… లోకల్‌ జనసేన నాయకుడు మందపాటి దుర్గారావు విమర్శలు గుప్పించడం.. వ్యవహారాన్ని మరో మలుపు తిప్పింది. కాసు మహేష్ రెడ్డి బిసిల నుంచి గురజాల సీటు లాక్కుంటే… యరపతినేని ఒకరిద్దరికి తప్ప బిసిలకు పెద్దగా పదవులివ్వలేదనీ ఆరోపించారు దుర్గారావు.

నిజంగా వైసీపీ, టీడీపీలకు చిత్తశుద్ధి ఉంటే.. బీసీలకు టిక్కెట్‌ ఇచ్చి గెలిపించాలని సవాల్‌ విసిరారు. అంటే, బీసీనైన తాను నిలబడితే .. గెలుపుకోసం పోటీ చేయాలని.. ఇండైరెక్టుగా కాదు, డైరెక్టుగానే అడుగుతున్నాడు ఈ జనసేన నాయకుడు. మరి, ఈ రచ్చ ఇలాగే కంటిన్యూ అవుతుందా? పుల్‌స్టాప్‌ పడుతుందా? అన్నదే గురజాల పాలిటిక్స్‌లో మెయిన్‌ గుసగుసలా మారింది.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం