AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kesineni Nani: కేశినేని వారి పెండ్లి పిలుపు!..వచ్చిందెవరు? రానిదెవరు?.. కూతురి పెళ్లిలో కనిపించని సొంత పార్టీ నేతలు..

ఆ ఎంపీ ఇక రాజకీయాల నుంచి తప్పుకున్నారా?ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు కూడా పార్టీ నేతలను ఎందుకు పిలవలేదు?వారితో బంధం తెంచుకున్నట్లేనా?సొంత తమ్ముడిని కాదని పక్క పార్టీ నాయకుడిని ఎందుకు ఆహ్వానించారు?ఇప్పుడిదే చర్చ సైకిల్ పార్టీలో జోరుగా సాగుతోంది.

Kesineni Nani: కేశినేని వారి పెండ్లి పిలుపు!..వచ్చిందెవరు? రానిదెవరు?.. కూతురి పెళ్లిలో  కనిపించని సొంత పార్టీ నేతలు..
Kesineni Nani Daughter Marriage
Sanjay Kasula
|

Updated on: Dec 15, 2022 | 7:39 PM

Share

ఏం చేసినా సంచలనమే… ఏం మాట్లాడినా వివాదమే… అన్నట్టుగా ఉంటుంది విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం. ఆయన తీరుపై ఇప్పటికే టీడీపీ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్న వేళ… మరో కొత్త మేటర్‌ పొలిటికల్‌ హీట్‌ను పెంచేస్తోంది. దానికి, నాని కుమార్తె శ్వేత వివాహమే కారణమన్నది.. పొలిటికల్‌ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట. బుధవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిన ఈ పెళ్లి వేడుకలో.. బంధువుల సంగతి పక్కన పెడితే, ఆయన సొంత పార్టీ నుంచి ఎవరెవరు హాజరయ్యారనే దానిపైనే.. రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై, ఎవరికితోచించి వాళ్లు ఊహించేసుకుంటున్నారు.

నాని ఇంట్లో పెళ్లి జరుగుతుంటే పార్టీనేతలెక్కడ?

నాని కుమార్తె వివాహానికి.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ మినహా… పార్టీ నేతలు పెద్దగా హాజరుకాకపోవడంపై గుసగుసలు మొదలయ్యాయి. కీలకమైన బెజవాడ నియోజకర్గానికి ఎంపీ… ఆ పరిధికి ఆయనే టీడీపీ ఇంచార్జ్‌ కూడా… అలాంటి నాయకుడి ఇంట్లో ఇంత పెద్ద దావత్‌ అయితే… పార్టీ సీనియర్లు ఎందుకు రాలేదన్నదే ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్‌ లో డిస్కషన్ పాయింట్‌ అయ్యింది. సీనియర్‌ నేతలు సరే…. నాని ప్రాతినిథ్యం వహిస్తున్న బెజవాడ ఎంపీ స్థానం పరిధిలో… పార్టీకి సంబంధించిన ఒక్క అసెంబ్లీ ఇంచార్జి కూడా ఈ పెళ్లికి రాలేదు. మొత్తం 7 అసెంబ్లీ స్థానాల నుంచి… ఒక్కరంటే ఒక్కరు కూడా.. కేశినేని ఫ్యామిలీ వైపు చూడలేదట. దీంతో.. సహజంగానే పార్టీక్యాడర్‌లో గుసగుసలు మొదలయ్యాయి.

పార్టీ నేతలను నాని పిలిచారా?లేదా?

కేశినేని, తన కుటుంబంలో జరిగిన ఈ వివాహ వేడుకకు.. అసలు పార్టీ నేతలను పిలిచారా? లేదా? అన్నది కూడా పాయింటే ఇక్కడ. పిలవకపోతే సరే.. రాలేదనుకోవచ్చు. ఒకవేళ ఆయన పిలిచినా.. నేతలెవరూ రాలేదంటే మాత్రం… అది కచ్చితంతా ఇష్యూనే. పార్టీ నాయకులు సరే… సొంత తమ్ముడు చిన్ని ని కూడా పెళ్ళికి పిలవలేదట నాని. దీంతో, ఇదేదో తేడాగా ఉందే.. అన్న చర్చ మొదలైంది. చాన్నాళ్లుగా ఈ ఇద్దరు బ్రదర్స్ మధ్య… వార్‌ నడుస్తోంది. పార్టీలో ఎవరికివారు పైచేయి సాధించేందుకు పోటీపడుతున్నారు. తాను ఎంపీగా ఉన్నా… ఆ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలంతా చిన్ని వైపు చూడటం… నానీకి నచ్చలేదు. దీంతో, అందరినీ దూరంగా పెట్టేశారనే వార్తలు వినిపించాయి. అయితే, ఎప్పట్నుంచో పార్టీలో ఉన్న నానికి… పార్టీలో చాలామందితో సన్నిహిత సంబంధాలున్నాయి. అలాంటిది ఆయన కుమార్తె పెళ్లివేడుకలో వాళ్లెవరూ కనిపించకపోవడం నిజంగా ఆశ్చర్యకరమే. రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నాని తీసుకున్న నిర్ణయమే దీనికి కారణమనే మాట వినిపిస్తోంది. ఈసారి విజయవాడ ఎంపీగా పోటీచేయబోనని గతంలోనే ప్రకటించారు నాని. అయితే, దానికి కొనసాగింపుగా కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితి.

మెహందీ ఫంక్షన్‌లో ప్రత్యక్షమైన గన్నవరం ఎమ్మెల్యే వంశీ

మరోవైపు, పెళ్లికి ముందు జరిగిన మెహందీ ఫంక్షన్‌కు కూడా టీడీపీ నుంచి.. ఒక్కరూ రాలేదు. పార్టీనుంచి ఎవరూ రాకపోయినా… గన్నవరంఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ ప్రోగ్రామ్‌కు హాజరవ్వడం పెద్ద చర్చకే దారి తీసింది. ఎందుకంటే.. వంశీ ఇప్పటికే టీడీపీకి దూరమయ్యారు. పైగా చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే కోపంతో… వంశీ పట్ల రగిలిపోతూనే ఉంది టీడీపీ క్యాడర్‌. అలాంటిది.. కేశినేని నాని ఇప్పుడు వంశీని ..

ఈ ఫంక్షన్‌కు పిలవడం వెనుక మతలబు ఏంటన్నదే టీడీపీ నేతలకు అంతుచిక్కడం లేదు. ఏదేమైనా.. ఇంట్లో జరిగిన శుభకార్యం ద్వారా.. తాను పార్టీకి దూరం అనే సంకేతాల్ని నాని బలంగానే పంపించారన్న టాక్‌ వినిపిస్తోంది. సో.. ఇప్పట్నుంచే మెల్లమెల్లగా టీడీపీ నాయకులతోనూ రిలేషన్ కట్ చేసుకుంటున్నారమో అంటూ.. తెగ గుసగుసలాడుకుంటున్నారు తెలుగుతమ్ముళ్లు. అయితే, ఇందులో నిజమెంత అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం