Srikalahasti: హోటల్ నిర్వహించుకునే మహిళపై విరుచుకుపడ్డ మహిళా సీఐ.. తీవ్రంగా రెస్పాండయిన విమెన్ కమిషన్
శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాటి మహిళపై ఆమె వ్యవహరించిన తీరును విమెన్ కమిషన్ సీరియస్‌గా తీసుకుంది.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సీఐ ఓవరాక్షన్ మాములుగా లేదు. మాముళ్ల కోసం కొందరు సామాన్యులపై ఆమె అరాచకాలు పెరిగిపోయాయ్ అంటున్నారు బాధితులు. ఈ లేడీ ఆఫీసర్ ఒక హోటల్ నిర్వాహకురాలిపై దారుణంగా దాడి చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆమె గతంలోనూ ఇలాగే దుందుడుకుగా వ్యవహరించేవారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఇదే విషయంపై బాధితురాలి భర్త, కుమారుడు స్పందించారు. పదకొండున్నర వరకూ హోటల్ నిర్వహించే అవకాశముంటే.. పది గంటలకే వచ్చి తీవ్రంగా దాడి చేశారనీ. మాదే తప్పంటూ.. వీడియోలు తీశారనీ. లేకుంటే గంజాయి కేసులు పెడ్తామని బెదిరించారనీ వాపోతున్నారు బాధితురాలి కుమారుడు.
ఇదంతా ఈ లేడీ సీఐ ఎందుకు చేస్తున్నారంటే.. మామూళ్ల కోసమేనని ఆరోపిస్తున్నారు బాధితులు. మా హోటల్ ఆమె పరిధిలో లేదు. అయినా సరే.. వచ్చి మాపై దౌర్జన్యానికి దిగారని అంటున్నారు వీరు. హోటల్ బాగానే జరుగుతోందిగా.. ముప్పై వేలు మాములు ఇవ్వాల్సిందేనని సీఐ హుకుం జారీ చేస్తున్నట్టు చెబుతున్నారు బాధితురాలి భర్త. బాధితురాలిపై తీవ్ర దాడి చేసి.. ఆమెను స్టేషన్లో నిర్బంధించిన సీఐపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయ్. ఆమె ప్రవర్తన నిజంగా జుగుప్సను కలిగించిందని పేర్కొంటున్నారు మరొకొందరు. తోటి మహిళ బ్రతిమాలకుంటున్నప్పటికీ.. లేడీ ఆఫీసర్ అలా ప్రవర్తించిన సిగ్గుచేటు అని విమర్శిస్తున్నారు.
శ్రీకాళహస్తిలో చిరు వ్యాపారం చేసుకుంటున్న మహిళపై సీఐ అంజు యాదవ్ వ్యవహరించిన తీరుపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. సీఐ అంజు పై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు మహిళా కమిషన్ సభ్యురాలు లక్ష్మి. గతంలోనూ సీఐ అంజు యాదవ్ ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా సిఐ తీరు ఉందన్నారు. సాటి మహిళ పట్ల సభ్యసమాజం తలదించుకునేలా మహిళా పోలీసు అధికారిణి వ్యవహరించారని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ సిగ్గు పడేలా ఆమె ప్రవర్తన ఉందన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..