AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: MRI స్కాన్ చేస్తుండగా మహిళ గిలగిలా కొట్టుకుంది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

ఓ మహిళ MRI స్కాన్ తీసుకునేందుకు స్థానిక డయాగ్నోస్టిక్స్ సెంటర్ దగ్గరకు వచ్చింది. ఇలా వచ్చిందో లేదో.. కాసేపటికి గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది. ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఆ వివరాలు ఈ స్టోరీలో ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి

AP News: MRI స్కాన్ చేస్తుండగా మహిళ గిలగిలా కొట్టుకుంది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
Representative Image
B Ravi Kumar
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 06, 2025 | 8:13 PM

Share

ఆరోగ్యమే మహాభాగ్యంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుత జీవన విధానంలో కొనసాగుతోంది. తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు ఇలా మనిషి మనుగడకు ఉపయోగించే అన్ని కలుషితమై పోవడంతో సాధారణంగా ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. అయితే అలాంటి రోగులను ఆసరాగా చేసుకుని కొందరు ఆస్పత్రి నిర్వాహకులు, అదేవిధంగా టెస్టులు పేరుతో వచ్చిరాని వైద్యం చేస్తూ వారి ప్రాణాల మీదకు తెస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఏలూరు జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మారై స్కానింగ్ చేస్తుండగా గిలగల కొట్టుకుంటూ ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తూ అందుకు కారణమైన ప్రైవేట్ ల్యాబ్‌ల నిర్వహణపై అధికారులు కొరడా జులిపించాలని కోరుతున్నారు.

ఏలూరు రూరల్ మండలం పత్తి కోళ్లలంక గ్రామానికి చెందిన రామ తులసి(60) అనే మహిళ గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతుంది. అయితే డాక్టర్ల సూచనల మేరకు డయాలసిస్ చేయించుకుంటుంది. ఇటీవల ఆమెకు శరీరంలో గుండెకు సంబంధించిన సమస్య తలెత్తింది. గుండె సమస్యపై వైద్యులను సంప్రదించిన ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పేస్ మేకర్ అమర్చారు. దాంతో ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ఇదిలా ఉంటే మూడు రోజుల ఆమెకు విపరీతమైన తలనొప్పి రావడమే కాక తలలో ఏదో సమస్య ఉన్నట్లు గుర్తించి.. ఏలూరులోని ప్రైవేట్ వైద్యశాలలో బంధువులు ఆమెను చేర్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు సమస్య తెలుసుకోవడానికి ఎమ్మారై స్కానింగ్ చేయించుకోవాలని సూచించారు. అయితే ఆమె బంధువులు ఎమ్మారై స్కానింగ్ తీయించే నిమిత్తం ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌కు రామ తులసిని తీసుకువెళ్లారు.

అక్కడ స్కానింగ్ చేస్తుండగా ఆమె గిలగిల కొట్టుకుంటూ చనిపోయింది. దాంతో మృతురాలు బంధువులు స్కానింగ్ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందని ఆందోళన చేశారు. తన కళ్లముందే తన భార్య కొట్టుకుంటూ గిలగిలలాడుతూ చనిపోయిందని రామ తులసి భర్త కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. స్కానింగ్ చేసే సమయంలో తాను లోపలే ఉన్నానని కిడ్నీ సమస్య కారణంగా తనకు డయాలసిస్ చేయిస్తున్నామని, అదేవిధంగా గుండె సమస్య ఉండడంతో పేస్ మేకర్ కూడా అమర్చారని స్కానింగ్ చేసే సిబ్బందికి ముందుగానే తెలిపామని.. స్కానింగ్ మొదలుపెట్టిన కొద్ది నిమిషాలకే తను గిలగిలా కొట్టుకుంటూ ఉండడంతో వెంటనే సిబ్బందికి చెప్పినా.. వాళ్లు పట్టించుకోలేదని, పైగా ఆమె కదలకూడదు అంటూ మైక్‌లో అనౌన్స్ చేస్తూ, కదిలితే స్కానింగ్ సరిగా రాదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ స్కానింగ్ తీస్తూనే ఉన్నారని.. స్కానింగ్ అయిన తర్వాత టెక్నీషియన్ లోపలికి వచ్చి చూసేసరికి ఆమె చనిపోయిందని రామ తులసి భర్త కోటేశ్వరరావు చెప్పారు.

ఇవి కూడా చదవండి

దాంతో బంధువులు వెంటనే స్కానింగ్ సెంటర్ వద్ద ఆందోళన చేయడంతో సమాచారం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారులు అక్కడికి చేరుకుని స్కానింగ్ సెంటర్లో తనిఖీలు చేపట్టారు. వైద్యాధికారుల తనిఖీలలో మార్నింగ్ సెంటర్‌లో అవకతవకలను గుర్తించారు. సెంటర్ నిర్వహణ లేకపోవడం, అంతేకాక రేడియాలజిస్ట్ లేకపోవడం, ఎంఆర్ఐ టెక్నీషియన్ కూడా స్కానింగ్ సెంటర్లో లేరని, అంతేగాక అక్కడ పనిచేస్తున్న వారికి సరైన క్వాలిఫికేషన్ లేకుండా బాధ్యతలు నిర్వహిస్తున్నారని, అంతేకాకుండా రికార్డులు కూడా సరిగా మైంటైన్ చేయకపోవడాన్ని వైద్యాధికారులు గుర్తించారు. ఇలా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ ధనార్జనే ధ్యేయంగా నడుపుతున్న స్కానింగ్ సెంటర్‌లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి