Salur : నీ వెంటే నేను.. చితిలోనూ తోడుంటా.. ! భర్త మరణం తట్టుకోలేని ఇల్లాలు..
ఆ భార్య భర్తలు ఇద్దరూ అన్యోన్యంగా జీవించారు. ఎక్కడికైనా కలిసే వెళ్లేవారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేకపోయారు. జీవితాంతం తోడు నీడగా ఉంటానని చేసిన పెళ్లి నాటి ప్రమాణాన్ని పాటిస్తూ భర్త వెంటే తుదివరకు నడిచింది ఓ ఇల్లాలు..
ఆ భార్య భర్తలు ఇద్దరూ అన్యోన్యంగా జీవించారు. ఎక్కడికైనా కలిసే వెళ్లేవారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేకపోయారు. జీవితాంతం తోడు నీడగా ఉంటానని చేసిన పెళ్లి నాటి ప్రమాణాన్ని పాటిస్తూ భర్త వెంటే తుదివరకు నడిచింది ఓ ఇల్లాలు.. భర్త మరణాన్ని తట్టుకోలేక కుప్పకూలిపోయింది.. భర్త మరణించిన గంటల వ్యవధిలోనే తనువు చాలించి అతనితో పాటే వెళ్లిపోయింది. ఈ విషాధ ఘటన విజయనగరం జిల్లా సాలూరులో చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సాలూరు మండలంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని అల్లు వీధికి చెందిన దంపతులు అల్లు చిన్న (72), విజయమ్మ (68) అన్యోన్య దంపతులు..వారి అన్యోన్య దాంపత్యాన్ని చూసి విధికి కన్నుకుంటిందో ఏమో గానీ, ఒకే రోజు గంటల వ్యవధిలో దంపతులిద్దరినీ బలితీసుకుంది. అల్లు చిన్న కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. భర్తకు అనారోగ్య రీత్యా భార్య విజయమ్మనే దగ్గరుండి సపర్యలు చేసింది. కానీ, ఫలితం లేకపోయింది. చిన్న ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో గురువారం వేకువజామున మృతి చెందాడు. భర్త మృతిని తట్టుకోలేని విజయమ్మ తీవ్ర మనస్తాపానికి గురైంది. అపస్మారక స్థితికి చేరుకున్న విజయమ్మను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో విజయమ్మ కన్నుమూసింది. అల్లు చిన్న, విజయమ్మలకు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. గంటల వ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరూ తిరిగి లోకాలకు చేరటంతో వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంతకాలం కలిసి కాపురం చేసిన భార్య భర్తలు మరణంలోనూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పోయారంటూ గ్రామస్తులు సైతం కన్నీరుమున్నీరుగా విలపించారు.