Huge rush: తిరుమల క్యూలైన్‌లో భక్తుల మధ్య ఘర్షణ.. గందరగోళ పరిస్థితి, అసలేమైందంటే..
తిరుమలలోని సర్వదర్శన క్యూలైన్‌లో భక్తుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్వామి వారి దర్శనార్థం క్యూలైన్‌లోకి ఎంటరైన భక్తులు త్వరగా దర్శనం చేసుకోవాలనే ఆతృతతో..
తిరుమలలోని సర్వదర్శన క్యూలైన్‌లో భక్తుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్వామి వారి దర్శనార్థం క్యూలైన్‌లోకి ఎంటరైన భక్తులు త్వరగా దర్శనం చేసుకోవాలనే ఆతృతతో వేగంగా వెళ్తూ ఒకరిపై మరొకరు పడిపోయారు. ఈ క్రమంలోనే క్యూలైన్లలో వేచియున్న రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడికి దిగారు భక్తులు. ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడినట్టుగా తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆముదాల గ్రామానికి చెందిన సుధాకర్ ఐదుగురు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు సర్వదర్శనం క్యూలైన్‌లోకి వెళ్లారు. తమిళనాడులోని విల్లుపురానికి చెందిన దాదాపు 20మందితో కూడిన భక్తబృందం కూడా అదే సమయంలో లైన్‌లోకి ప్రవేశించింది. ఎస్‌ఎంసీ జనరేటర్ సమీపంలో ఈ రెండు కుటుంబాల మధ్య తోపులాట జరిగింది. గొడవకు దిగి ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో సుధాకర్ ముక్కు నుంచి రక్తం వచ్చింది. దీంతో సుధాకర్‌ను భద్రతా సిబ్బంది అశ్విని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు.
సీసీటీవీ కెమెరాల ద్వారా ఘర్షణ విషయం తెలుసుకున్న విజిలెన్స్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. దాడికి దిగిన కోదండరామయ్య, గోపాలకృష్ణ, వరదన్ అనే వ్యక్తులను టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత గాయపడిన సుధాకర్ కూడా పోలీస్టేషన్‌కు రావడంతో రెండు కుటుంబాలతో పోలీసులు మాట్లాడారు. తమకు కేసు వద్దని, ఆవేశంలో అనుకోకుండా ఘర్షణ జరిగిందని రెండు కుటుంబాలు చెప్పడంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. ఈ ఘర్షణతో క్యూలైన్‌లో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. తోటి భక్తులు ఒకింత భయాందోళనకు గురయ్యారు.