Nani and Vamshi: ప్రాణ స్నేహితుల సీట్లు మార్పులో సూత్రధారులు ఎవరు..? వైసీపీ అధిష్టానం మ‌దిలో ఏముంది..?

ఆంధ్రప్ర‌దేశ్ లో ఆ ఇద్ద‌రూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. అంతేకాదు ఒక‌రికొక‌రు ప్రాణ స్నేహితులు. అన్నింటికంటే ముఖ్యంగా ఆ జిల్లాలో ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటారు. అందుకే ఆ ఇద్ద‌రినీ ఓడించాల‌నేది తెలుగుదేశం పార్టీ ఫ‌స్ట్ టార్గెట్.

Nani and Vamshi: ప్రాణ స్నేహితుల సీట్లు మార్పులో సూత్రధారులు ఎవరు..? వైసీపీ అధిష్టానం మ‌దిలో ఏముంది..?
Kodali Nani And Vallabhaneni Vamshi
Follow us
pullarao.mandapaka

| Edited By: Balaraju Goud

Updated on: Feb 20, 2024 | 6:29 PM

ఆంధ్రప్ర‌దేశ్ లో ఆ ఇద్ద‌రూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. అంతేకాదు ఒక‌రికొక‌రు ప్రాణ స్నేహితులు. అన్నింటికంటే ముఖ్యంగా ఆ జిల్లాలో ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటారు. అందుకే ఆ ఇద్ద‌రినీ ఓడించాల‌నేది తెలుగుదేశం పార్టీ ఫ‌స్ట్ టార్గెట్. జిల్లాలో ఎక్కడ ఓడినా ఫ‌ర్వాలేదు గానీ, అక్క‌డ మాత్రం గెలిచి తీరాల్సిందే అంటున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు. అయితే ప్రాణ స్నేహితుల సీట్ల విషయంలో లెక్క‌లు త‌ప్పుతున్నాయా…?ప్లేస్ లు చేంజ్ చేయాల‌ని అధిష్టానం నిర్ణ‌యించిందా….? కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో ఫ్లెక్సీల క‌ల‌క‌లం వెనుక కార‌ణాలేంటి..? కొత్త‌గా పార్టీలో చేరుతున్న వారికోసం సీట్ల మార్పుపై హైక‌మాండ్ ఫోక‌స్ పెట్టిందా..? ఇంత‌కీ అక్క‌డ ఏం జ‌రుగుతోందనే చ‌ర్చ రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

కృష్ణా జిల్లాలో అత్యంత కీల‌క‌మైన అసెంబ్లీ స్థానాలంటే ఏ మాత్రం ఆలోచించ‌కుండా ఠ‌క్కున చెప్పేయొచ్చు. ఆ రెండు స్థానాల్లో ఒక‌టి గుడివాడ‌, మ‌రొక‌టి గ‌న్న‌వ‌రం…అవును…ఎందుకంటే ఇక్క‌డ ఎమ్మెల్యేలుగా ఉన్న వారి వ‌ల్లే ఈ స్థానాలు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. ఇద్ద‌రు ప్రాణ‌స్నేహితులు కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీలు గుడివాడ‌,గ‌న్న‌వ‌రం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే ఈ ఇద్ద‌రూ కూడా ఒక‌ప్పుడు సైకిల్ పార్టీ నుంచి వైఎస్సార్ సీపీలోకి వ‌చ్చిన వారే.. ఇక తెలుగుదేశం పార్టీతో పాటు చంద్ర‌బాబును, లోకేష్ కు గ‌ట్టి కౌంట‌ర్లు ఇవ్వ‌డం, ఓ రేంజ్ లో ఆడుకోవ‌డంలో ఈ ఫ్రెండ్స్ ఇద్ద‌రూ ముందుంటారు. అందుకే ఈ సీట్ల‌ను తెలుగుదేశం పార్టీ కూడా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుడివాడ‌లో కొడాలి నానిని, గ‌న్న‌వ‌రంలో వ‌ల్ల‌భ‌నేని వంశీని ఓడించ‌డ‌మే ప్ర‌ధాన టార్గెట్ గా పెట్టుకున్నారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. ఈ రెండు స్థానాల్లో ఆర్ధికంగా బ‌లంగా ఉండి సామాజిక వ‌ర్గాల ప‌రంగానూ ఎదుర్కోగ‌లిగే నేత‌ల‌ను ఇంచార్జిలుగా నియ‌మించారు. కొడాలి నానిపై పోటీకి వెనిగండ్ల రామును రంగంలోకి దింపారు. వ‌ల్ల‌భ‌నేని వంశీపై పోటీకి యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావును వ్యుహాత్మకంగా బ‌రిలో నిలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ ఈ రెండు స్థానాల్లో విజ‌యావ‌కాశాల‌పై ఎవ‌రి లెక్క‌లు వారు వేసుకుంటున్నారు. అయితే ఉన్న‌ట్లుండి ఇద్ద‌రు మిత్రులు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు…

ప్రాణ స్నేహితుల సీట్లు మార్పుపై ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంత‌?

కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీల‌కు సిట్టింగ్ స్థానాలు కాకుండా వేరే స్థానాల‌కు అధిష్టానం పంపిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. దీనికి ఆజ్యం పోసిన‌ట్లుగా గుడివాడ‌లో ఫ్లెక్సీలు వెల‌వ‌డం క‌ల‌కలంగా మారింది. కృష్ణా జిల్లా వైసీపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షులు మండ‌లి హ‌నుమంత‌రావుకు అనుకూలంగా గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు గుడివాడ‌లోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో భారీ ఫ్లెక్సీలు క‌ట్టారు. గుడివాడ వైఎస్‌ఆర్ సీపీ త‌ర‌పున ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా మండ‌లి హ‌నుమంత‌రావుకు శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీలు వెలిసాయి. దీంతో ఒక్క‌సారిగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చ‌ర్చ మొద‌లైంది. కొడాలి నానికి టిక్కెట్ ఇవ్వ‌డం లేదంటూ ప్ర‌చారం జోరందుకుంది.

ఇక వ‌ల్ల‌భ‌నేని వంశీ విష‌యంలో కూడా ఇదే ర‌క‌మైన ప్ర‌చారం కొంత‌కాలంగా జ‌రుగుతుంది. వ‌ల్ల‌భ‌నేని వంశీని గ‌న్న‌వ‌రంకు బ‌దులు పెన‌మ‌లూరు నుంచి పోటీ చేయాల‌ని వైసీపీ అధిష్టానం సూచించిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. నూజివీడు టీడీపీ ఇంచార్జి ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావును గ‌న్న‌వ‌రం బ‌రిలో దింపుతార‌ని చ‌ర్చ జ‌రిగింది. ముద్ద‌ర‌బోయిన గ‌తంలో గ‌న్న‌వ‌రం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ త‌ర్వాత టీడీపీలో చేరారు. దీంతో త‌న‌కు బ‌లం ఉన్న గ‌న్న‌వ‌రం సీటును ముద్ద‌ర‌బోయిన‌కు అప్ప‌గించేలా అధిష్టానం క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రిగింది.

ఇక గ‌న్న‌వ‌రం, గుడివాడ ఎమ్మెల్యేల‌కు టిక్కెట్ క‌ష్టాలంటూ టీడీపీ కూడా ప్ర‌చారం మొద‌లుపెట్టింది.రాజ‌కీయంగా జ‌రుగుతున్న సీటు ర‌చ్చ‌పై కొడాలి నాని ఘాటుగానే స్పందించారు. ఎవ‌రో దుర‌ద ఉన్న వ్య‌క్తులు ఫ్లెక్సీలు క‌ట్టినంత మాత్రాన సీటు ఇవ్వ‌డం లేద‌ని ఎలా అంటార‌ని నాని ప్ర‌శ్నించారు. గుడివాడ నుంచి తాను, గ‌న్న‌వ‌రం నుంచి వ‌ల్ల‌భ‌నేని వంశీ మాత్ర‌మే వైసీపీ త‌ర‌పున పోటీలో ఉంటున్న‌ట్లు కొడాలి నాని స్ప‌ష్ట‌త ఇచ్చారు. కుట్రలు కుతంత్రాల్లో భాగంగానే త‌న‌కు, వంశీకు సీటు లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని కొడాలి మండిపడ్డారు. ఎవరో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి ఉదయానికి తీసేశాడని, ఫ్లెక్సీలు ఎవడైనా కట్టవచ్చని, కాక‌పోతే అర్థవంతంగా ఉండాలని అన్నారు నాని. అంతేకాదు దమ్ముంటే త‌న‌ను ఓడించడానికి చంద్రబాబును గుడివాడ అభ్యర్థిగా రావాలన్నారు కొడాలి నాని.

మ‌రోవైపు త‌న పేరుమీద ఫ్లెక్సీలు క‌ట్ట‌డంపై మండలి హ‌నుమంత‌రావు కూడా స్పందించారు. తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నట్లు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం జ‌రుగుతుంద‌న్నారు హ‌నుమంత‌రావు. ఎమ్మెల్యే కొడాలి నానికి త‌న‌కు అభిప్రాయ బేదాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఎమ్మెల్యే కొడాలి నానిను దాటే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తాను వైయస్ఆర్ కుటుంబానికి విశ్వాసంగా ఉంటాన‌న్న మండ‌లి.. పార్టీ లైన్ దాటి వెళ్ళనని స్ప‌ష్ట‌త ఇచ్చారు. అయితే సీట్ల మార్పుపై వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని కూడా ముఖ్యనేత‌లు క్లారిటీ ఇస్తున్నారు. గుడివాడ‌, గ‌న్న‌వ‌రంలో తిరిగి వైసీపీదే విజ‌యం అంటున్నారు. టీడీపీ నేత‌లు కావాల‌నే అస‌త్యాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని కూడా చెప్పుకొస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…