AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh Naidu: తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ పర్సన్ వెంకటేష్ నాయుడు.. ఇంతకీ ఇతను ఎవరివాడు…?

ఏపీలో లిక్కర్ స్కాం సృష్టిస్తోన్న సంచలనం అంతా ఇంతా కాదు. ఈ ఎపిసోడ్‌లో రెండు రోజులుగా ఓ వ్యక్తి గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. లిక్కర్ స్కాంను మించి ఆ వ్యక్తి గురించి ఎందుకు అంత చర్చ నడుస్తుంది. ఎవరా వ్యక్తి? అతని వెనుక ఉన్నది ఎవరు?

Venkatesh Naidu: తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ పర్సన్ వెంకటేష్ నాయుడు.. ఇంతకీ ఇతను ఎవరివాడు...?
Venkatesh Naidu
Vasanth Kollimarla
| Edited By: Ram Naramaneni|

Updated on: Aug 05, 2025 | 4:05 PM

Share

చెరుకూరు వెంకటేష్ నాయుడు, s/o తిరుపతి నాయుడు. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో నివాసం. 36 ఏళ్ల వెంకటేష్ నాయుడు, లిక్కర్ కేసులో ఏ34 అనూహ్యంగా తెరపైకి వచ్చాడు. లిక్కర్ స్కాం డబ్బును తరలించడానికి సహకారం అందించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటేష్ నాయుడిని.. జూన్ 18న బెంగళూరు ఎయిర్పోర్టులో సిట్ అదుపులోకి తీసుకుంది. ఈ వెంకటేష్ నాయుడు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద దుమారం రేపుతున్నాడు. రెండు రోజులుగా ఇతని చుట్టూనే రాజకీయం నడుస్తోంది. అటు వైసీపీకి ఇటు టీడీపీ మధ్య మాటల యుద్ధానికి కేంద్ర బిందువు అయ్యాడు.

వైసీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయంటోన్న టీడీపీ

చెవిరెడ్డి అనుచరుడిగా ప్రచారం జరుగుతోన్న ఈ వెంకటేష్‌నాయుడు, రెండు రోజుల క్రితం నోట్ల కట్టలను లెక్కిస్తున్న వీడియో వైరల్ అయింది. లిక్కర్ డబ్బులను దాచడం, తరలించడంలో వెంకటేష్ నాయుడు కీలకపాత్ర పోషించారనీ, చెవిరెడ్డి సహా వైసీపీలో కీలక నేతలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయనీ టీడీపీ విమర్శలు చేస్తోంది. అయితే టీడీపీ విమర్శలకి వైసీపీ రివర్స్ ఎటాక్ స్టార్ట్ చేసింది.

టీడీపీ సహా పలు పార్టీల నేతలతో వెంకటేష్ నాయుడు ఫోటోలు

కేవలం వైసీపీ నేతలతోనే కాదు, టీడీపీ సహా పలు పార్టీల కీలక నేతలతో ఈ వెంకటేష్ నాయుడు ఫోటో దిగాడు. కేంద్ర మంత్రులు, టీడీపీ నాయకులు, బీఆర్‌ఎస్ కీలక నేతలతో పాటు జగన్‌తోనూ ఫోటోలు దిగారాయన. ఈ ఫోటోలను విడుదల చేసి.. టీడీపీకి కౌంటర్ ఇస్తోంది వైసీపీ.

వెంకటేష్ నాయుడిది రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటోన్న వైసీపీ

వెంకటేష్ నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అందరితోనూ సన్నిహితంగా ఉంటారని వైసీపీ చెప్తోంది. అతని వ్యాపారానికి సంబంధించిన డబ్బును.. లిక్కర్ డబ్బు అంటూ ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అది లిక్కర్ డబ్బు అయితే, ఎన్నికల్లో పంచింది అయితే, 2 వేల రూపాయల నోట్లు ఎందుకు ఉంటాయని వైసీపీ ప్రశ్నిస్తోంది. అయితే.. వెంకటేష్‌నాయుడికి వైసీపీతోనే లింకులు ఉన్నాయని అధికార కూటమి వాదిస్తోంది.

దీంతో అసలు లిక్కర్ వివాదం కాస్తా పక్కకు వెళ్లి.. వెంకటేష్ నాయుడు ఎవరి అనుచరుడు అనే చర్చ నడుస్తోంది. మీవాడు అంటే మీ వాడు అంటూ వైసీపీ టీడీపీ విమర్శలు చేసుకుంటుంటే ఎవరి వాడో త్వరలో కోర్టులో తెలుస్తుందని అంటోంది సిట్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..