Weekend Hour: వైఎస్‌ మరణం చుట్టూ ఏపీ రాజకీయం

ఏపీ రాజకీయాలు మరోసారి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణం చుట్టూ తిరుగుతున్నాయి. హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్‌ చనిపోయిన 14ఏళ్ల తర్వాత.. ఇప్పుడా అంశం విభజిత ఆంధ్రప్రదేశ్‌లో అగ్గి రాజేస్తోంది. వైఎస్‌ కుమార్తె షర్మిల.. కాంగ్రెస్‌లో చేరడం దానికి ఆజ్యం పోసింది.

Weekend Hour: వైఎస్‌ మరణం చుట్టూ ఏపీ రాజకీయం
Weekend Hour
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 07, 2024 | 7:01 PM

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ… మరోసారి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలు.. ఈ పేరునే అస్త్రంగానే వాడుకోవాలని భావిస్తున్నాయి. ఆయన మరణంపై పొలిటికల్‌గా జరుగుతున్న రచ్చే… ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. వైఎస్‌ మరణానికి కాంగ్రెస్సే కారణమంటూ గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన వైఎస్‌ షర్మిల… ఇప్పుడు అదే కాంగ్రెస్‌ గూటికి చేరడం ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. వైఎస్‌ కుటుంబంలో కాంగ్రెస్‌ పార్టీ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందంటూ… అధికార వైసీపీ దుమ్మెత్తిపోస్తోంది. వైఎస్‌ మరణం కాంగ్రెస్‌ కుట్రయితే… కాంగ్రెస్‌లో షర్మిల చేరిక చంద్రబాబు కుట్ర అంటూ… సజ్జల చేసిన సంచలన వ్యాఖ్యలు ఒక్కసారిగా హీటు పెంచేశాయి.

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూడా అలాంటి వ్యాఖ్యలే చేసి కలకలం సృష్టించారు. కాంగ్రెస్ పార్టీని రాజశేఖర్ రెడ్డి బతికిస్తే… చంద్రబాబు, కాంగ్రెస్‌ కలిసి ఆయనను చంపేశారని ఆరోపించారు స్వామి. కాంగ్రెస్ పార్టీకి వైఎస్‌ ఫొటో పెట్టుకునే అర్హతే లేదన్నారు.

అయితే, వైసీపీ ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చింది కాంగ్రెస్‌. ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ… వైఎస్‌ మరణంపై విచారణ ఎందుకు జరిపించలేదని ప్రశ్నించింది. వైఎస్‌ మరణించి పద్నాలుగేళ్లు గడిచినా.. ఆ సెగ మాత్రం తగ్గలేదనిపిస్తోంది. ఆ అంశంపై రేకెత్తిన అనుమానాలు మరోసారి ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తున్నాయి. ఎవరికివారు వైఎస్‌ పేరు వాడేసుకుని.. వచ్చే ఎన్నికల్లో లాభపడాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ, కాంగ్రెస్‌.. ఈ విషయంలో పోటాపోటీగా ఉన్నాయి. మరి, వైఎస్‌ ఫ్యాక్టర్‌ 2024లో పనిచేస్తుందా? అదే జరిగితే, ఎవరికి లాభిస్తుందన్నది చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..