Magunta Srinivasulu Reddy: వైసీపీలో అసంతృప్తి సెగలు.. చేతులెత్తేసిన సీనియర్లు.. టీడీపీ వైపు మాగుంట చూపు
ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు సభ్యుులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి విషయంలో 2014 సీన్ రిపీట్ అవుతుందా...? ఆయన మళ్ళీ పార్టీ మారక తప్పదా...? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉన్నాయట. వైసీసీలో టికెట్ లేదన్న సంకేతాలు వస్తుండటంతో తెలుగుదేశం పార్టీతో మాగుంట టచ్‌లో ఉన్నారట..
ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు సభ్యుులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి విషయంలో 2014 సీన్ రిపీట్ అవుతుందా…? ఆయన మళ్ళీ పార్టీ మారక తప్పదా…? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉన్నాయట. వైసీసీలో టికెట్ లేదన్న సంకేతాలు వస్తుండటంతో తెలుగుదేశం పార్టీతో మాగుంట టచ్‌లో ఉన్నారట.. కనిగిరి సభలో వైసీపీ ఎమ్మెల్యేలను విమర్శించిన చంద్రబాబు తనను తిట్టాలని అధిష్టానం ఆదేశించినా తిట్టలేదంటూ మాగుంటకు అభినందనలు అందుకే చెప్పారంటున్నారట టీడీపీ కేడర్. అసలు సిట్టింగ్ ఎంపీ మాగుంటకు వైసీపీ టికెట్ ఎందుకు నిరాకరించినట్టు.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీ వైపు చూస్తున్నారా.. అంటే. వైసీపీలో టికెట్ రాకుంటే ఏం చేస్తాం.. మాదారి మేం చూసుకుంటాం.. అంటున్నారట మాగుంట అభిమానులు. దీంతో ఒంగోలులో వైసీపీ నుంచి పార్లమెంట్‌కు, అసెంబ్లీకి కలిసి పోటీ చేయాలని భావిస్తున్న మాగుంట – బాలినేని కాంబినేషన్‌కు ఈ ఎన్నికలు మరోసారి బ్రేక్ పడనున్నట్టు కనిపిస్తోంది. వైసీపీ టికెట్ కోసం ఆఖ రివరకు ఎదురు చూడాలని మాగుంటకు బాలినేని సూచించడంతో అందుకు అనుగుణంగానే హైదరాబాద్‌లో ఉన్న బాలినేనితో రెండు రోజుల పాటు మంతనాలు చేసిన మాగుంట చివరకు వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి సూచనలు రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ టచ్‌లోకి వెళ్ళిపోయారని భావిస్తున్నారు.
టీడీపీ నుంచి సానుకూల సంకేతాలు ఉన్నాయని, ఒంగోలు లేదా నెల్లూరు నుంచి పోటీ చేసేందుకు సిద్దంగా ఉండాలని టీడీపీ అధిష్టానం నుంచి ఇప్పటికే మాగుంట శిబిరానికి సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల బరిలో మాగుంట కుటుంబం నుంచి ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీ చేయించాలని భావిస్తున్నారట. టీడీపీ అధిష్టానం కూడా మాగుంట కుటుంబానికి సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది అందుకు ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన రా కదలిరా.. ఎన్నికల శంఖారావ సభలో పరోక్షంగా మాగుంటను అభినందిస్తూ చంద్రబాబు చేసిన ప్రసంగమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు తెలుగు తమ్ముళ్ళు.
కనిగిర సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలంటే చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌ను తిట్టాలంటూ జగన్ విధించిన షరతులను తిరస్కరించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వైపు టీడీపీ అధిష్టానం దృష్టి సారించిందని ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన ఎన్నికల శంఖారావం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను, లోకేష్‌ను, పవన్‌కళ్యాణ్‌ను తిడితేనే ఎంపీ సీటు ఇస్తానని జగన్ చెబితే, మాకు సంస్కారం ఉంది.. మేం అలా తిట్టమని చెప్పిన ఎంపీ, ఎమ్మెల్యేలను అభినందించాలని చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో వైసీపీలో టికెట్ దక్కకపోవచ్చని భావిస్తున్న మాగుంట కుటుంబానికి టీడీపీ గేట్లు బార్ల తెరిచినట్టయిందని భావిస్తున్నారు. మరోవైపు టీడీపీ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో 2014లో టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన మాగుంటను తిరిగి పార్టీలో చేర్చుకుని పదేళ్ళ తరువాత 2024లో సీన్ రిపీట్ చేయాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టు చెబుతున్నారు…
2014లో కూడా ఇదే జరిగింది…
2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై ఎంపీగా పోటీ చేసేందుకు మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రయత్నించారు. 2009లో కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందిన మాగుంట రాష్ట విభజన తరువాత ఎపీలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు కావడంతో 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే వైవీ సుబ్బారెడ్డిని పార్లమెంట్ నుంచి పోటీ చేయించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకోవడంతో మాగుంటకు వైసీపీలో ఛాన్స్ దక్కలేదు. దీంతో తెలుగుదేశం పార్టీలో చేరిన మాగుంట 2014 ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 40 వేల ఓట్ల తేడాతో వైవి సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు.
రాజకీయ వారసుడు మాగుంట రాఘవరెడ్డి
ఆ తరువాత జరిగిన పరిణామాల్లో భాగంగా 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మాగుంటకు వైవిని కాదని ఎంపీ టికెట్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. ఈ ఎన్నికల్లో మాగుంట 2 లక్షల మెజారిటీతో వైసీపీ నుంచి గెలుపొందారు. అప్పటి నుంచి వైసీపీ ఎంపీగా కొనసాగుతున్న మాగుంట ఈసారి ఎన్నికల్లో తన రాజకీయ వారసుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీకి నిలబెడుతున్నట్టు ప్రకటించారు. ఆతరువాత రాఘవరెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కోవడం, బెయిల్‌పై బయటకు రావడం తెలిసిందే..! అయితే ఈసారి కూడా మాగుంట కుటుంబానికి వైవి సుబ్బారెడ్డి రూపంలో అడ్డంకి ఎదురైందట. అంతేకాకుండా మరికొన్ని ఇతర కారణాలు కూడా తోడు కావడంతో ఈసారి మాగుంటకు టికెట్ ఇవ్వకుండా వైవి సుబ్బారెడ్డి లేదంటే ఆయన కుమారుడు వైవి విక్రాంత్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. దీంతో ఇక విధిలేని పరిస్థితుల్లో టీడీపీ నుంచి పోటీ చేయడానికి మాగుంట కుటుంబం సిద్దమైనట్టు భావిస్తున్నారు. మాగుంట కుటుంబానికి 2014 సీన్ రిపీట్ అయినట్టు చెబుతున్నారు. చూద్దాం.. మరీ ఈసారి మాగుంట ప్రయత్నం ఏ తీరానికి చేరుతుందో..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…